2
1 సోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి దేవుని గురించిన సాక్ష్యం ప్రకటించినప్పుడు మాటకారితనం గానీ ఉన్నత జ్ఞానం గానీ వినియోగించుకోలేదు. 2 ఎందుకంటే యేసు క్రీస్తు తప్ప – సిలువ పాలైన ఆయన తప్ప – మీ మధ్య మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని నిశ్చయించు కొన్నాను. 3 మీ మధ్య దౌర్బల్యంతో, భయంతో, ఎంతో వణుకుతో ఉన్నాను. 4  మీ విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాదు గాని దేవుని బలప్రభావాలే కావాలని నా ఉద్దేశం. 5 కనుక నా సందేశం, ప్రబోధంలో ఒప్పించే మానవ జ్ఞాన వాక్కులతో కాక దేవుని ఆత్మ బలప్రభావాల ప్రదర్శనతో ఉండేది.
6 అయినా ఆధ్యాత్మికంగా ఎదిగినవారి మధ్య జ్ఞానం వాడుకొని మాట్లాడుతాం. ఆ జ్ఞానం ఈ లోకానికి చెందినది కాదు, ఎందుకూ కొరగాకుండా పోయే ఈ లోక అధికారుల జ్ఞానమూ కాదు. 7 మేము మాట్లాడేది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, మరుగై ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనతకోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం. 8 ఈ జ్ఞానం లోకపాలకులలో ఎవరికీ తెలియదు. ఒక వేళ అది తెలిసి ఉంటే వారు మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువ వేసి ఉండేవారు కారు. 9 రాసి ఉన్నదాని ప్రకారం, తనను ప్రేమించేవారికోసం దేవుడు సిద్ధం చేసినవి కంటికి కనిపించలేదు, చెవికి వినిపించలేదు, మానవ హృదయంలోకి రాలేదు. 10 అయితే వాటిని దేవుడు తన ఆత్మద్వారా మనకు వెల్లడి చేశాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని లోతైన సంగతులను కూడా పరిశోధిస్తాడు.
11 ఒక మనిషి విషయాలు ఆ మనిషిలో ఉన్న తన ఆత్మకు తప్ప మరే మనిషికి తెలుసు? అలాగే దేవుని ఆలోచనలు దేవుని ఆత్మకే గాని మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినవేవో తెలుసుకొనేలా మనం పొందినది లౌకికాత్మ కాదు గాని దేవునినుంచి వచ్చిన ఆత్మే. 13 మేము ఆధ్యాత్మికమైన విషయాలను ఆధ్యాత్మికమైన వాటితో పోలుస్తూ మానవ జ్ఞానం నేర్పే మాటలలో కాక, దేవుని ఆత్మ నేర్పే మాటలలో వాటిని చెపుతాం.
14  సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలు స్వీకరించడు. అవి అతనికి తెలివితక్కువతనంగా అనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగా మాత్రమే విలువకట్టాలి గనుక అతడు వాటిని గ్రహించలేడు. 15  ఆధ్యాత్మిక వ్యక్తి అన్నిటిని సరిగా పరిశీలించి అంచనా కడతాడు, గాని అతణ్ణి ఎవరూ సరిగా పరిశీలించి అంచనా కట్టరు. 16  ప్రభు మనసు తెలుసుకొని ఆయనకు ఉపదేశించ గలవాడెవడు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.