1 కొరింతువారికి లేఖ
1
1 కొరింతులో ఉన్న దేవుని సంఘానికి, అంటే క్రీస్తు యేసు ద్వారా పవిత్రమైనవారికి, 2 తన సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు రాయబారిగా ఉండేందుకు దేవుడు పిలిచిన పౌలు, సోదరుడు సొస్తనేసు రాస్తున్న సంగతులు. మన ప్రభువైన యేసు క్రీస్తు పేర ప్రతి స్థలంలో ప్రార్థన చేసేవారితో కూడా పవిత్రులై ఉండడానికి మీరు దేవుని పిలుపు పొందారు. యేసు వారికీ, మనకూ ప్రభువే. 3 మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసు క్రీస్తునుంచీ అనుగ్రహం, శాంతి మీకు కలుగుతాయి గాక!
4 యేసు క్రీస్తు ద్వారా దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహం కారణంగా నేను మీ గురించి నా దేవునికి ఎప్పుడూ కృతజ్ఞత చెపుతూ ఉన్నాను. 5 దేని గురించి అంటే, క్రీస్తులో మీరు ప్రతి విషయంలో – మాట్లాడే సామర్థ్యమంతటిలోనూ జ్ఞానమంతటిలోనూ అభివృద్ధి చెందారు. 6 అలాగే క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో సుస్థిరమైపోయింది. 7 అందుచేత దేవుడిచ్చే సామర్థ్యాలలో ఏదీ మీకు కొదువగా లేదు. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షం కోసం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. 8 మన ప్రభువైన యేసు క్రీస్తు వచ్చే రోజున మీరు నిందారహితులై ఉండేలా ఆయన మిమ్ములను చివరివరకు సుస్థిరంగా ఉంచుతాడు. 9 తన కుమారుడూ మన ప్రభువూ అయిన యేసు క్రీస్తు సహవాసానికి మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.
10  సోదరులారా, మీరంతా ఒకే మాట మీద ఉండాలనీ మీలో విభేదాలు లేకుండా చూచుకోవాలనీ మీరు మనసులో ఉద్దేశాలలో పూర్తిగా ఏకీభవించాలనీ మన ప్రభువైన యేసు క్రీస్తు పేర మిమ్ములను వేడుకొంటున్నాను. 11 నా సోదరులారా, మీ మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయె ఇంటివారు మీ గురించి నాకు తెలియజేశారు. 12 ఇంతకూ నేను చెప్పవచ్చేదేమిటంటే, మీరంతా ఇలా అంటున్నారు: “నేను పౌలు పక్షంవాణ్ణి”, “నేను అపొల్లో మనిషిని”, “నేను కేఫా పక్షంవాణ్ణి”, “నేను క్రీస్తు మనిషిని.”
13 క్రీస్తు విభాగాలైపోయాడా ఏమిటి? పౌలు మీ కోసం సిలువ మరణం పొందాడా! పౌలు పేర మీరు బాప్తిసం పొందారా? 14-15  నా పేర మీరు బాప్తిసం పొందారని ఎవరూ చెప్పకుండా నేను క్రిస్పస్‌కూ గాయియస్‌కూ తప్ప ఇంకెవరికీ బాప్తిసం ఇవ్వలేదు. ఇందుకు దేవునికి కృతజ్ఞుణ్ణి. 16 స్తెఫనస్ ఇంటివారికి కూడా బాప్తిసమిచ్చాను, ఇంకెవరికైనా ఇచ్చానో లేదో నాకు గుర్తు లేదు. 17 క్రీస్తు నన్ను పంపినది బాప్తిసం ఇవ్వడానికి కాదు గాని శుభవార్త ప్రకటించడానికి. క్రీస్తు సిలువ వ్యర్థం కాకూడదని లౌకిక జ్ఞానవాక్కులతో ప్రమేయం లేకుండా ప్రకటించడానికి నన్ను పంపాడు.
18 సిలువ సందేశం నశించిపోతున్న వారికి తెలివితక్కువ తనం గానీ రక్షణ పొందుతున్న మనకు అది దేవుని బలప్రభావాలు. 19 ఈ సందర్భంలో రాసి ఉన్నదేమంటే, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. తెలివైన వారి తెలివిని శూన్యతగా చేస్తాను.
20 జ్ఞాని ఎక్కడ? ధర్మశాస్త్ర పండితుడు ఎక్కడ? ఈ యుగం తర్కవాది ఎక్కడ? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని తెలివితక్కువతనంగా చేశాడు గదా. 21 దేవుని జ్ఞానం కారణంగా, లోకం తన జ్ఞానం మూలంగా దేవుణ్ణి తెలుసు కోలేదు గనుక ప్రకటించిన సందేశం అనే “తెలివితక్కువతనం” ద్వారా దేవుణ్ణి నమ్మేవారిని రక్షించడం దేవుని ఇష్టపూర్వకమైన సంకల్పం. 22 యూదులు సూచనకోసమైన అద్భుతాలు చూపమని అడుగుతారు. గ్రీసు దేశస్థులేమో జ్ఞానం కావాలని దేవులాడుతారు. 23 మేమైతే సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఈయన యూదులకు ఆటంకంగా, ఇతర జనాలకు తెలివితక్కువతనంగా ఉన్నాడు. 24 దేవుని పిలుపు అందినవారికైతే – వారు యూదులైనా గ్రీసుదేశస్థులైనా – క్రీస్తు దేవుని బలప్రభావమే, దేవుని జ్ఞానమే. 25 ఎందుకంటే, దేవుని “తెలివితక్కువతనం” మనుషుల కంటే తెలివైనది. దేవుని “దౌర్బల్యం” మనుషుల కంటే బలమైనది.
26 సోదరులారా, మీకు అందిన పిలుపు విషయం చూస్తున్నారు. లోక సంబంధంగా మీలో జ్ఞానులు, ఘనులు, గొప్ప వంశికులు అనేకులు లేరు. 27 జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి దేవుడు ఈ లోకంలోని తెలివితక్కువతనం ఉన్నవాటిని ఎన్నుకొన్నాడు. బలమైనవాటిని సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో బలం తక్కువవాటిని ఎన్నుకొన్నాడు. 28 ఉన్నవాటిని శూన్యతగా చేయడానికి ఈ లోకంలో పేరు ప్రతిష్ఠలు లేనివాటినీ తృణీకారానికి గురి అయినవాటినీ లేనివాటినీ కూడా దేవుడు ఎన్నుకొన్నాడు. 29 తన ఎదుట ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని ఇందులో దేవుని ఉద్దేశం.
30 అయితే మీరు ఆయనద్వారా క్రీస్తు యేసులో ఉన్నారు. 31 ఈయనే దేవుని ద్వారా మనకు జ్ఞానం, నిర్దోషత్వం, పవిత్రత, విమోచన అయ్యాడు. ఇందువల్ల రాసివున్నదాని ప్రకారం, అతిశయించే వ్యక్తి ప్రభువును బట్టే అతిశయించాలి.