5
1 ✽మీలో వ్యభిచారం ఉన్నట్టు మాకు వినవచ్చింది. ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. ఇలాంటి వ్యభిచారం క్రైస్తవులు కాని ఇతర జనాలలో కూడా సూచించబడడం లేదు. 2 మీరైతే విర్రవీగుతూ✽ ఉన్నారు. దీనికి బదులు ఆ పని చేసినవాణ్ణి మీమధ్య నుంచి తొలగించడం జరిగేలా మీరు దుఃఖంతో మూలగలేదు. 3 ✽నా మట్టుకైతే నేను శరీరరీతిగా మీ దగ్గర లేకపోయినా, ఆత్మరీతిగా ఉన్నాను. వాస్తవంగా మీతో ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడికి ఇంతకు ముందే తీర్పు తీర్చాను. 4 ✽మన ప్రభువైన యేసు క్రీస్తు పేర మీరు సమకూడేటప్పుడు నేను ఆత్మరీత్యా మీతో కూడా ఉండి ప్రభువైన యేసు క్రీస్తు బలప్రభావాలతో 5 అతని శరీరం నాశనమయ్యేలా అతణ్ణి సైతానుకు అప్పగించండి. ఈ విధంగా యేసుప్రభువు వచ్చే రోజున అతడి ఆత్మకు విముక్తి ఉండాలనే ఉద్దేశంతో అలా చేయండి.6 ✽ మీరు అతిశయించడం మంచిది కాదు. పొంగుపదార్థం కొంచెమైనా పిండి ముద్దంతటినీ పొంగజేస్తుందని మీకు తెలియదా? 7 కాబట్టి మీరు క్రొత్త పిండి ముద్దలాగా కావడానికి ఆ పాత పొంగు పదార్థాన్ని✽ తొలగించండి. అసలు మీరు పొంగు పదార్థమేమీ లేనివారే. ఎలాగంటే క్రీస్తు మనకోసం పస్కా బలి అయ్యాడు. 8 ✽అందుచేత మనం పాత పొంగజేసే పదార్థంతో కాక, చెడుతనం, దుర్మార్గం అనే పొంగజేసే పదార్థంతో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని దానితో ఈ మహోత్సవాన్ని ఆచరించుదాం.
9 ✽నా ఉత్తరంలో మీరు వ్యభిచారులతో కలిసి మెలిసి ఉండకూడదని రాశాను. 10 అయితే ఈ లోకానికి చెందే వ్యభిచారులతో, పేరాశపరులతో, వంచకులతో, విగ్రహపూజ చేసేవారితో బొత్తిగా సాంగత్యం చేయకూడదని అర్థం కాదు. అలాగైతే మీరు లోకంలోనుంచి వెళ్ళిపోవలసి వస్తుంది! 11 ఇప్పుడు నేను మీకు రాసేదేమిటంటే, సోదరుడు అనిపించుకొంటున్న వాడెవడైనా సరే, అతడు వ్యభిచారి గానీ పేరాశపరుడు గానీ విగ్రహ పూజకుడు గానీ తిట్టుబోతు గానీ త్రాగుబోతు గానీ వంచకుడు గానీ అయివుంటే ఆ వ్యక్తితో కలిసిమెలిసి ఉండకూడదు. అలాంటివాడితో తిననూ కూడదు.
12 ✽ బయటివారి విషయం కూడా తీర్పు చెప్పడానికి నాకేం పని? బయటివారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. 13 లోపలి వారికైతే మీరు తీర్పరులు కారా మరి? అందుచేత మీ మధ్య ఉండకుండా ఆ దుర్మార్గుణ్ణి వెలివేయండి.