15
1  విశ్వాసంలో బలం గల మనం ఎక్కువ బలం లేనివారి లోపాలు భరించడానికి బద్ధులం. అంతేగాని మన సంతోషమే మనం చూచుకోకూడదు. 2 పొరుగువారి మేలు కోసం వారి అభివృద్ధికి మనలో ప్రతి ఒక్కరమూ వారి సంతోషం చూడాలి. 3  ఎందుకంటే, క్రీస్తు కూడా తన సంతోషం చూచుకోలేదు. ఇలా రాసివుంది: “నిన్ను నిందించేవాళ్ళు మోపిన నిందలకు నేను గురి అయ్యాను.”
4 లేఖనాలు ఇచ్చే సహనం, ప్రోత్సాహంవల్లా మనం ఆశాభావం కలిగి ఉండాలని గతంలో పాత ఒడంబడికలో రాసి ఉన్నవన్నీ మన ఉపదేశంకోసం రాసి ఉన్నాయి. 5 మీరు ఏకభావం కలిగి ఏక స్వరంతో మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి మహిమ కలిగించాలి. 6 ఇందుకే మీలో ఒకరితో ఒకరికి క్రీస్తు యేసుకు అనుగుణమైన ఏకమనసును సహనానికీ ప్రోత్సాహానికీ కర్త అయిన దేవుడు అనుగ్రహిస్తాడు గాక!
7 అందుచేత, దేవుని మహిమ కోసం క్రీస్తు మనలను స్వీకరించే ప్రకారమే మీరూ ఒకరినొకరు స్వీకరించండి. 8 నేను చెప్పేదేమిటంటే, దేవుని సత్యం తరఫున యూద పితరులకు ఆయన చేసిన వాగ్దానాలను సుస్థిరం చేయడానికి క్రీస్తు సున్నతి గలవారికి సేవకుడయ్యాడు. 9 అంతే కాదు, ఇతర జనాలు దేవుని కరుణను బట్టి ఆయనకు మహిమ కలిగించాలని ఆయన అలా సేవకుడయ్యాడు.
దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: అందుచేత ఇతర జనాల మధ్య నీకు కృతజ్ఞత అర్పిస్తాను, నీ నామ సంకీర్తనం చేస్తాను.
10  “ఇతర జనాల్లారా! ఆయన ప్రజతో కూడా సంతోషించండి” అని కూడా అన్నాడు. 11 “ఇతర ప్రజలారా! మీరంతా ప్రభువును స్తుతించండి. అన్ని జనాల్లారా! ఆయనను కీర్తించండి” అని కూడా రాసి ఉంది. 12 యెష్షయి వంశంలో నుంచి “వేరు” వస్తుంది, ఇతర జనాలను ఏలడానికి పరిపాలకుడు ఉదయిస్తాడు. ఆయనమీద ఇతర జనాలకు ఆశాభావం కలుగుతుందని యెషయా అన్నాడు.
13 ఇప్పుడు పవిత్రాత్మ బలప్రభావాలవల్ల మీకు ఆశాభావం సమృద్ధిగా కలిగేలా ఆశాభావానికి కర్త అయిన దేవుడు నమ్మకముంచడం ద్వారా పూర్ణ ఆనందంతోనూ పూర్ణ శాంతితోనూ మిమ్ములను నింపుతాడు గాక!
14 నా సోదరులారా, నా మట్టుకైతే నేను మీ విషయం గట్టిగా నమ్మేదేమిటంటే, మీరు మంచితనంతో, సర్వ జ్ఞానంతో నిండినవారు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలవారు. 15  అయినా, సోదరులారా, నేను కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయడానికి తెగించి రాశాను. 16 ఎందుకంటే ఇతర జనాల కోసం యేసు క్రీస్తు సేవకుణ్ణయి ఉండడానికి దేవుడు నాకు కృప ప్రసాదించాడు. దేవుని శుభవార్త విషయంలో యాజి సేవ చేస్తున్నాను. ఈ విధంగా యూదేతరులు అనే అర్పణ పవిత్రాత్మవల్ల పవిత్రమై దేవునికి అంగీకారమవుతుంది.
17 కాబట్టి దేవుని విషయాలలో క్రీస్తు యేసులో అతిశయించడానికి నాకు కారణం ఉంది. 18 క్రీస్తు నా ద్వారా జరిగించని వాటి గురించి మాట్లాడడానికి నేను తెగించను, గాని ఆయన నా ద్వారా చేసినదాని ఫలితంగా మాటల్లోనూ పనుల్లోను 19 సూచనమైన క్రియలు, అద్భుతాల చేత, పవిత్రాత్మ, బలప్రభావాలచేత యూదేతర జనాలకు విధేయత కలిగింది. జెరుసలం మొదలుకొని ఇల్లూరికం వరకు ఉన్న ప్రదేశాలలో నేను క్రీస్తు శుభవార్త పూర్తిగా ప్రకటించాను.
20 ఈ విధంగా, నేను మరొకరి పునాది మీద కట్టకుండా క్రీస్తు పేరు కూడా వినిపించని ప్రాంతాలలో శుభవార్త ప్రకటించాలని ఎప్పుడూ నా ఆశయం. 21 రాసి ఉన్నదాని ప్రకారం ఆయనను గురించిన సమాచారం తెలియనివారు చూస్తారు. చేరనివారు విని గ్రహిస్తారు.
22  ఈ కారణంచేత చాలా కాలం మీ దగ్గరకు రాలేకపోయాను. 23 అనేక సంవత్సరాలనుంచి మిమ్ములను సందర్శించాలని నాకు అభిలాష ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతాలలో సంచరించవలసిన స్థలం నాకు లేదు, 24 గనుక నేను స్పెయిన్‌కు చేసే ప్రయాణంలో మీ దగ్గరకు వస్తాను. నా ప్రయాణంలో మిమ్ములను చూచి కొద్ది కాలం మీతో ఆనందించాలనీ ఆ తరువాత మీరు అక్కడికి నన్ను సాగనంపగలరనీ ఆశాభావంతో ఎదురు చూస్తున్నాను.
25  ఇప్పుడైతే పవిత్రులకు సేవ చేయడానికి జెరుసలం వెళ్తున్నాను. 26 ఎందుకంటే, జెరుసలంలో ఉన్న పవిత్రులలో బీదలకోసం చందా ఇవ్వడం మాసిదోనియ, అకయ సంఘాల వారికి ఇష్టం అయింది. 27 అవును, అలా చేయడం వారికిష్టమైంది – అసలు వీరు వారికి రుణపడి ఉన్నారు. ఎందుకంటే, యూదేతర ప్రజలు యూదుల ఆధ్యాత్మిక విషయాలలో భాగస్వాములైతే వారికి శారీరక విషయాలలో పరిచర్య చేయడం వీరి కర్తవ్యం. 28 నేనీ సేవ ముగించి ఈ ఫలం వారికి అప్పగించిన తరువాత, మీ స్థలం మీదుగా స్పెయిన్‌కు ప్రయాణం చేస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చేటప్పుడు క్రీస్తు శుభవార్త దీవెన సంపూర్ణతతో వస్తానని నాకు తెలుసు.
30 సోదరులారా, నా కోసం చేసే ప్రార్థనలలో మీరు నాతోపాటు ప్రయాసపడాలని ప్రభువైన యేసు క్రీస్తును బట్టీ దేవుని ఆత్మ ప్రేమను బట్టీ మిమ్ములను బతిమాలు కొంటున్నాను. 31 అంటే, నేను యూదయలో అవిధేయుల చేతులలో నుంచి తప్పించుకొనేలా, జెరుసలంలో చేయబోయే నా పరిచర్య అక్కడి పవిత్రులకు అంగీకారంగా ఉండేలా 32 దేవుని ఇష్టప్రకారం మీ దగ్గరకు సంతోషంతో వచ్చి మీతో కూడా సేద తీర్చుకోగలిగేలా ప్రార్థించండి. 33 శాంతి ప్రదాత అయిన దేవుడు మీకందరికీ తోడై ఉంటాడు గాక! తథాస్తు.