16
1 మన సోదరి ఫీబేను మీకు సిఫారసు చేస్తున్నాను. కెంక్రేయలో ఉన్న క్రీస్తుసంఘంలో ఈమె సేవకురాలు. 2 పవిత్రులకు తగినట్టుగా ప్రభువును బట్టి ఈమెను స్వీకరించండి. ఈమెకు ఏ విషయాలలో మీ సహాయం అవసరమో వాటిలో తోడ్పడండి. ఎందుకంటే ఈమె అనేకులకూ, ఆ మాటకు వస్తే నాకూ కూడా సహాయం చేసింది.
3 ప్రిస్కిల్లాకూ అకులకూ నా అభివందనాలు చెప్పండి. వారు క్రీస్తు యేసులో నా జతపనివారు. 4  నా కోసం వారు తమ ప్రాణాలను కూడా తెగించారు. నేను వారికి కృతజ్ఞుణ్ణి – నేనూ కాదు, యూదేతర జనాలలో ఉన్న క్రీస్తుసంఘాల వారంతా కృతజ్ఞులు. 5 వారి ఇంట్లో సమకూడే సంఘానికి కూడా నా అభివందనాలు. నా ప్రియ సోదరుడైన ఎపైనీటుకు నా అభివందనాలు చెప్పండి. ఆసియా రాష్ట్రంలో ఇతడే క్రీస్తుకు తొలిపంట.
6 మరియకు అభివందనాలు. మా కోసం ఆమె ప్రయాస ఇంతింత కాదు.
7 ఆంద్రోనికస్‌కూ యూనికస్‌కూ అభివందనాలు. వారు నా రక్తసంబంధులు, మునుపు నాతోకూడా ఖైదీలు, క్రీస్తు రాయబారులలో ప్రసిద్ధులు, నాకంటే ముందుగా క్రీస్తులో ఉన్నవారు.
8 ప్రభువులో నా ప్రియ మిత్రుడు అంప్లీయతుకు అభివందనాలు.
9 క్రీస్తులో నా జతపనివాడైన ఊర్బానుకు, నా ప్రియ మిత్రుడు స్టాకుకు అభివందనాలు.
10 అపెల్లెకు అభివందనాలు. అతడు క్రీస్తులో పరీక్షలకు నిలిచిన యోగ్యుడు. అరిస్టాబులస్ ఇంటివారికి అభివందనాలు.
11 నా రక్తసంబంధి అయిన హెరోదియొన్‌కు అభివందనాలు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభువులో ఉన్నవారికి అభివందనాలు.
12 ప్రభువులో ప్రయాసపడే త్రుఫైనాకూ త్రుఫోసాకూ అభివందనాలు. ప్రియ సోదరి పెర్సిసుకు అభివందనాలు. ఆమె ప్రభువులో అధికంగా ప్రయాసపడింది.
13 ప్రభువులో ఎన్నికైనవాడు రూఫసుకూ అతని తల్లికీ అభివందనాలు. ఆవిడ నాకు కూడా తల్లి.
14 అసుంక్రితసుకూ ఫ్లెగోనుకూ హెర్మాకూ పత్రొబసుకూ హెర్మేకూ వారితో ఉన్న సోదరులకూ అభివందనాలు.
15 ఫిలొలొగస్‌కూ యూలియాకూ నేరియాకూ అతని సోదరికీ ఒలుంపాకూ వారితో ఉన్న పవిత్రులందరికీ అభివందనాలు.
16 పవిత్రమైన ముద్దుపెట్టుకొని ఒకరితో ఒకరు అభివందనాలు చెప్పుకోండి. క్రీస్తు సంఘాలనుంచి మీకు అభివందనాలు.
17 సోదరులారా, మీరు నేర్చుకొన్న ఉపదేశానికి విరుద్ధమైన భేదాలూ అభ్యంతరాలూ కలిగించేవారిని కనిపెట్టి వారి సహవాసం నుంచి తొలగాలని మిమ్ములను వేడుకొంటున్నాను. 18 అలాంటివారు మన ప్రభువైన యేసు క్రీస్తుకు సేవ చేయడం లేదు గాని తమ కడుపుకే దాసులు. వారు ఇచ్చకం వినియోగిస్తూ, మృదువైన మాటలతో అమాయకులను మోసగిస్తారు. 19 మీ విధేయతను గురించి అందరికీ వినిపించింది గనుక మీ విషయం నేనానందిస్తున్నాను. అయితే మీరు మంచి విషయాలలో తెలివైనవారు, చెడు విషయాలలో నిర్దోషులు కావాలని నా కోరిక.
20 శాంతి ప్రదాత అయిన దేవుడు మీ పాదాలక్రింద సైతానును త్వరగా చితగ్గొట్టివేస్తాడు. మన ప్రభువైన యేసు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక.
21 నా జతపనివాడు తిమోతి, నా బంధువులు లూకియ, యాసోను, సోసిపత్తు మీకు అభివందనాలు చెపుతున్నారు.
22 ఈ లేఖ రాసిపెట్టిన తెర్తియ అనే నేను కూడా ప్రభువులో మీకు అభివందనాలు చెపుతున్నాను.
23 నాకూ క్రీస్తు సంఘమంతటికీ అతిథి సత్కారాలిచ్చే గాయస్, ఈ నగర ఖజానాదారుడు ఎరస్తు, సోదరుడు క్వర్తు మీకు అభివందనాలు చెపుతున్నారు. 24 మన ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహం మీకు తోడై ఉంటుంది గాక. తథాస్తు.
25 నేను ప్రకటించే శుభవార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ఉపదేశం ప్రకారం దేవుడు మిమ్ములను సుస్థిరం చేయడానికి సమర్ధుడు. ఇదంతా అనాదినుంచి మరుగైవుండీ, ప్రత్యక్షమైన రహస్య సత్యానికి అనుగుణమైనది. 26 ఈ రహస్య సత్యం ఇప్పుడు వెల్లడి అయింది. జనాలన్నీ ఈ విశ్వాస సత్యాలకు లోబడాలన్న శాశ్వతుడైన దేవుని ఆజ్ఞప్రకారం, ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియవచ్చింది. 27 ఆ ఏకైక జ్ఞానవంతుడైన దేవునికి యేసు క్రీస్తు ద్వారా ఎప్పటికీ మహిమ కలుగుతుంది గాక! తథాస్తు!