14
1 విశ్వాస సత్యాలలో అసమర్థుణ్ణి చేర్చుకోండి గాని సందేహాల గురించిన నిర్ణయం కోసం కాదు. 2 అన్నీ తినవచ్చని ఒకరి నమ్మకం. విశ్వాస సత్యాలతో అసమర్థుడు శాఖాహారమే తినవచ్చు. 3 అన్నీ తినే వ్యక్తి తినని వ్యక్తిని తృణీకరించకూడదు, తినని వ్యక్తి తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. దేవుడే ఆ వ్యక్తిని చేర్చుకొన్నాడు గదా. 4 మరొకరి దాసునికి తీర్పు తీర్చడానికి మీరెవరు? అతడు నిలకడగా ఉన్నా, పడిపోయినా ఆ సంగతి తన సొంత యజమానికే చెందుతుంది. అతడు నిలకడగా ఉండేలా దేవుడు చేయగలడు గనుక అతడు నిలకడగా ఉంటాడు.
5 ఒకరు ఒక రోజుకంటే మరో రోజు ప్రత్యేకమైనదిగా ఎంచుతారు. రోజులన్నీ సమానమే అని మరొకరు ఎంచుతారు. ప్రతి ఒక్కరూ తమ మనసులో గట్టి నిశ్చయానికి రావాలి. 6 విశేష దినాన్ని ఆచరించేవాడు ప్రభువు విషయంలో ఆచరిస్తాడు. ఆ దినాన్ని ఆచరించనివాడు ప్రభువు విషయంలో ఆచరించకుండా ఉంటాడు. అన్నీ తినేవాడు ప్రభువు విషయంలో తింటారు. ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెపుతారు గదా. అన్నీ తిననివారు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పి ప్రభువు విషయంలో తినకుండా ఉంటారు. 7 మనలో ఏ ఒక్కరూ తన మట్టుకు తానే బ్రతకరు, తన మట్టుకు తానే చనిపోరు. 8 మనం బ్రతుకుతూ ఉంటే ప్రభువు సంబంధంగా బ్రతుకుతున్నాం. చనిపోతే ప్రభువు సంబంధంగా చనిపోతాం. కాబట్టి బ్రతికినా, చనిపోయినా మనం ప్రభువుకే చెందేవారం. 9 తాను చనిపోయినవారికీ బ్రతికి ఉన్నవారికీ ప్రభువై ఉండాలనే కారణంచేత క్రీస్తు చనిపోయి లేచి మళ్ళీ బ్రతికాడు.
10 అయితే మీరు మీ సోదరునికి తీర్పు తీర్చడమెందుకని? లేదా, మీ సోదరుణ్ణి తృణీకరించడం ఎందుకని? మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతాం. 11 ఇలా రాసి ఉంది: “ప్రభువు చెప్పేదేమిటంటే, నా జీవంతోడు, ప్రతి మోకాలూ నా ముందు వంగుతుంది, ప్రతి నాలుకా దేవున్ని ఒప్పుకొంటుంది.” 12 కనుక మనలో ప్రతి ఒక్కరూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసివస్తుంది.
13 కాబట్టి ఇకమీదట ఒకరికి ఒకరం తీర్పు తీర్చకుండా ఉందాం. దానికి బదులుగా, మన సోదరుని ఎదుట అడ్డంకీ ఆటంకమూ ఏదీ కలిగించకూడదని నిశ్చయించుకొందాం. 14 ఆహార పదార్థం ఏదీ సహజంగా అశుద్ధమైనది కాదని నాకు తెలుసు – యేసుప్రభువు ద్వారా దృఢ నిర్ణయానికి వచ్చాను. కానీ ఏదైనా అశుద్ధమని తలచేవారికే అది అశుద్ధం. 15 మీరు తినే ఆహారాన్ని బట్టి మీ సోదరుడు నొచ్చుకొంటే, మీరిక ప్రేమభావంతో ప్రవర్తించడం లేదన్నమాట. క్రీస్తు అతనికోసం చనిపోయాడు; మీ ఆహారంచేత అతణ్ణి పాడు చేయకండి. 16 మీకు మేలైనది దూషణపాలు కాకుండా చూచుకోండి.
17 దేవుని రాజ్యమంటే తినడమూ త్రాగడమూ కాదు. అది పవిత్రాత్మలో నీతిన్యాయాలు, శాంతి, ఆనందం. 18 ఈ విషయాల్లో క్రీస్తుకు సేవ చేసేవాడు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడు.
19 అందుచేత మనం సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధి కలిగించేవాటినే అనుసరించుదాం. 20 తిండి కోసం దేవుని పనిని పాడు చేయకండి. ప్రతి తిండి పవిత్రమే గాని వాటిని తింటూ ఇతరులకు అడ్డంకి కలిగించే వ్యక్తికి అది చెడ్డది. 21 మాంసం తినడంవల్ల గానీ ద్రాక్షరసం త్రాగడం వల్ల గానీ మరి దేనివల్లనైనా గానీ మీ సోదరునికి అడ్డంకి, ఆటంకం, బలహీనత కలిగితే అలాంటి వాటిని మానివేయడమే మంచిది. 22 ఒక విషయంలో మీకు నమ్మకం ఉందా? దాన్ని దేవుని ఎదుట మీ మట్టుకు మీరే ఉంచుకోండి. తాను సమ్మతించిన వాటిలో తనను నిందించుకోని వ్యక్తి ధన్యజీవి. 23 అయితే అనుమానంతో తినే వ్యక్తి దోషం చేసినట్టే తీర్పు అయింది. ఎందుకంటే నమ్మకం మూలంగా తినడం లేదు. నమ్మకం మూలంగా చేయనిది ఏదైనా సరే అది పాపమే.