13
1 ప్రతి ఒక్కరూ రాజ్యాధికారాలకు లోబడి ఉండాలి. ఎందుకంటే దేవునివల్ల కలిగిన అధికారం తప్ప మరేదీ లేదు. ఉన్న ఆ అధికారాలను స్థాపించినది దేవుడే. 2 ఈ కారణంచేత అధికారాన్ని ఎదిరించేవారు దేవుని నిర్ణయాన్ని ఎదిరిస్తున్నారు. ఎదిరించేవారు తమమీదికి తామే తీర్పు తెచ్చిపెట్టుకొంటారు.
3 పరిపాలకులు మంచి పనుల విషయంలో బీకరులు కారు – చెడు పనుల విషయంలోనే. అధికారులంటే భయం లేకుండా ఉండాలనే కోరిక మీకు ఉందా? ఉంటే, మంచినే చేస్తూ ఉండండి. అప్పుడు వారు మిమ్ములను మెచ్చుకొంటారు. 4 ఎందుకంటే, అధికారి మీ మేలుకోసం దేవుని పరిచారకుడు. కానీ, మీరు కీడు చేస్తే భయపడాలి. అతడు ఊరికే ఖడ్గం ధరించడు. అతడు కీడు చేసే వారిపై ఆగ్రహం చూపే దేవుని పరిచారకుడు. 5 అందుచేత, వారికి లోబడి ఉండడం తప్పనిసరి – ఆ ఆగ్రహం కారణంగా మాత్రమే కాక అంతర్వాణిని బట్టి కూడా లోబడాలి.
6  ఇందువల్లే గదా మీరు సుంకాలు కూడా చెల్లించేది? అవును, పరిపాలకులు అదే పని సదా చేస్తున్న దేవుని పరిచారకులు. 7 గనుక ప్రతి ఒక్కరికీ చెల్లించవలసినది ఇవ్వండి. ఎవరికీ సుంకమో వారికి సుంకం, ఎవరికి పన్నో వారికి పన్ను చెల్లించండి. ఎవరిపట్ల భయం చూపదగినది వారిపట్ల భయం చూపండి. ఎవరిని గౌరవించదగింది వారిని గౌరవించండి.
8 ఎవరికీ ఏమి బాకీ పడి ఉండకండి – ఒకరినొకరు ప్రేమతో చూడడం అనే బాకీ తప్ప. ఇతరులను ప్రేమతో చూచేవాడు తద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినవాడయ్యాడు. 9 “వ్యభిచారం చెయ్యకూడదు”, “హత్య చెయ్యకూడదు”, “దొంగతనం చెయ్యకూడదు”, “మీరు పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు”, “పొరుగువారిది ఆశించకూడదు” – ఈ ఆజ్ఞలు, మరే ఆజ్ఞ అయినా సరే ఈ వాక్కులోనే ఇమిడి ఉన్నాయి: “మిమ్ములను ప్రేమించుకొన్నట్టు మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి.” 10 ప్రేమ పొరుగువారికి హాని ఏమీ చేయదు. అందుచేతే ప్రేమ ధర్మశాస్త్రానికి నెరవేర్పు.
11 ఈ కాలం గుర్తెరిగి ఆ ప్రకారం ప్రవర్తించండి. మీరు నిద్రనుంచి మేల్కొనవలసిన వేళ అయిందని తెలుసుకోండి. మనం నమ్మకం ఉంచిననాటికంటే మోక్షం ఇప్పుడు మనకు దగ్గరగా ఉంది. 12 రాత్రి చాలా మట్టుకు గడిచింది. పగలు దగ్గరపడింది. అందుచేత అంధకార పనులను త్రోసిపుచ్చి వెలుగుసంబంధమైన కవచం ధరించుకొందాం. 13 పగటిలో నడిచినట్లు యోగ్యంగా నడచుకొందాం. అల్లరిచిల్లరగా తిరగకుండా, మత్తుగా త్రాగకుండా, లైంగిక అవినీతీ, పోకిరీ పనులూ, కక్షలూ, అసూయ లేకుండా ఉండిపోదాం. 14 దానికి బదులుగా ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకోండి. శరీర స్వభావంలో ఉన్న చెడు కోరికల కోసం ఏ ఏర్పాటూ చేయకండి.