12
1 ✽కాబట్టి, సోదరులారా, మీ శరీరాలను దేవునికి సమర్పించండని దేవుని కరుణాక్రియలను బట్టి మిమ్ములను బతిమాలుకొంటూ ఉన్నాను. ఈ అర్పణ సజీవమైనది, పవిత్రమైనది, దేవునికి ప్రీతికరమైనది. ఇలా చేయడం మీ యుక్తమైన సేవ. 2 ✽ఈ లోకం తీరుకు లొంగకండి గాని మీ మనసు కొత్తది కావడంవల్ల పూర్తిగా మార్పు చెందుతూ ఉండండి. అప్పుడు దేవుని చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకోగలుగుతారు. దేవుని చిత్తం మంచిది, ప్రీతికరమైనది, ఏ లోపమూ లేనిది.3 ✽ దేవుడు నాకు ప్రసాదించిన కృపవల్ల మీలో ప్రతి ఒక్కరితో ఇలా అంటున్నాను: దేవుడు కొలత ప్రకారం ఒక్కొక్కరికి విశ్వాసం పంచి ఇచ్చాడు. దానినిబట్టి ఒకరు ఎంతవారో అని తలచుకోతగ్గ దానికంటే తాను అధికుడని తలచుకోకూడదు గాని స్వస్థ బుద్ధితో తలచుకోవాలి. 4 ✽ఒకే శరీరంలో అనేక అవయవాలు మనకున్నాయి. అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. 5 అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒకే శరీరమై ఉన్నాం. ప్రత్యేకంగా ఒకరికొకరం అవయవాలై ఉన్నాం.
6 దేవుడు మనకు అనుగ్రహించిన కృపప్రకారం వేరువేరు కృపావరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ వరం దేవునిమూలంగా పలకడం✽ అయితే మన నమ్మకం కొలది అలా చేయాలి. 7 అది పరిచర్య అయితే పరిచర్య చేయడంలో ఆ వరం ఉపయోగించాలి. ఉపదేశమైతే ఉపదేశించడంలో ఆ వరం ఉపయోగించాలి. 8 ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. ఇచ్చేవాడు ధారాళంగా ఇవ్వాలి. నాయకత్వం వహించేవాడు దానిని శ్రద్ధతో నిర్వహించాలి. దయ చూపేవాడు సంతోషంతో చూపాలి.
9 ✽మీ ప్రేమలో కల్లాకపటాలంటూ✽ ఉండకూడదు. దుష్టత్వాన్ని అసహ్యించుకోండి✽. మంచిని అంటిపెట్టుకొని ఉండండి. 10 ✝సోదర ప్రేమతో ఒకరిమీద ఒకరు అభిమానం చూపండి. గౌరవించడంలో ఒకరినొకరు మించిపోండి. 11 ✽ శ్రద్ధాసక్తుల విషయంలో వెనుకపడకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువుకు సేవ చేస్తూ వుండండి. 12 ✝ఆశాభావంతో ఎదురుచూస్తూ ఆనందంగా ఉండండి. బాధలలో సహనంతో ఉండండి. ప్రార్థన చేయడంలో దృఢంగా ఉండండి. 13 ✽పవిత్రుల అక్కరలలో సహాయపడుతూ✽ ఉండండి. అతిథి సత్కారం చేయడానికి అవకాశాలు వెతకండి.
14 ✝మిమ్ములను హింసించేవారిని దీవించండి. శపించకండి గాని దీవించండి. 15 ✽ సంతోషించేవారితో సంతోషించండి. ఏడ్చేవారితో ఏడ్వండి. 16 ✽ఒకరిపట్ల ఒకరు ఏక మనసు కలిగి ఉండండి. గొప్పతనాన్ని ఆలోచించక, దీనులతో సహవాసం చేయండి. మీరు వివేకులని అభిప్రాయపడకండి.
17 ✽ అపకారానికి అపకారం ఎవరికీ చేయకండి. మనుషులందరి దృష్టికి శ్రేష్ఠమనిపించుకొనే విషయాలను ఆలోచించండి. 18 ✝మీ మట్టుకైతే మీరు సాధ్యమైనంతవరకు ప్రతి మనిషితో సమాధానంగా ఉండండి. 19 ✽ ప్రియ సోదరులారా, మీకు మీరే ఎన్నడూ పగతీర్చుకోకండి గాని దేవుని కోపానికి అవకాశమివ్వండి. పగతీర్చే పని నాదే అని ప్రభువు చెపుతున్నాడని రాసి ఉంది గదా. 20 ✽ అందుచేత నీ శత్రువుకు ఆకలి వేస్తే భోజనం పెట్టు. దాహం వేస్తే నీళ్ళియ్యి. అలా చేస్తే అతడి తలపై నిప్పు కణికెలు పోసినట్టే. 21 కీడువల్ల అపజయం పాలుకాకండి గాని మేలుతో కీడును జయించండి.