11
1 అలాగైతే నేనడిగేదేమిటంటే, దేవుడు తన ఇస్రాయేల్‌ ప్రజను నిరాకరించాడా? అలా కానే కాదు. ఆ మాటకు వస్తే నేను ఇస్రాయేల్‌వాణ్ణే. అబ్రాహాము సంతానంలో ఒకణ్ణి. బెన్యామీను గోత్రికుణ్ణి. 2 దేవుడు ముందుగా ఎరిగిన తన ప్రజను త్రోసివేయలేదు. ఏలీయా ఇస్రాయేల్‌కు వ్యతిరేకంగా దేవుని ఎదుట వాదించిన లేఖన భాగంలో చెప్పినది మీకు తెలియదా? 3 అదేమంటే, “ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడద్రోశారు. నేనొక్కణ్ణే మిగిలాను. వారు నా ప్రాణం కూడా తీయజూస్తున్నారు.” 4 అయితే దేవుడు అతనికి చెప్పిన సమాధానం ఏమిటంటే, “బయల్‌దేవుడికి మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించి ఉంచుకొన్నాను.”
5 ఆ విధంగానే, ప్రస్తుత కాలంలో కూడా దేవుని కృపమూలమైన ఏర్పాటు ప్రకారం కొందరు మిగిలి ఉన్నారు. 6 అది కృపవల్ల గనుక అయితే ఇక క్రియలమూలమైనది కాదు. లేకపోతే కృప ఇక కృపే కాదు. అది క్రియల మూలమైనది అయితే అది ఇక కృపమూలమైనది కాదు, లేకపోతే క్రియ ఇక క్రియ కాదు.
7  అయితే తేలినదేమిటి? ఇస్రాయేల్‌ప్రజ వెదికేది ఏదో అది వారికి కలగలేదు గాని వారిలో దేవుడు ఎన్నుకొన్నవారికి అది కలిగింది. తక్కినవారికి గుడ్డితనం కలిగింది. 8 ఇందుకు ఇలా రాసి ఉంది: దేవుడు వారికి నిద్రపోయే మనసు, చూడని కండ్లు, వినని చెవులు నేటివరకు ఇచ్చాడు. 9 దావీదు చెప్పిన దేమిటంటే, వాళ్ళ భోజనం బల్ల వాళ్ళకు ఉచ్చు, బోను అవుతుంది గాక! అది వాళ్ళకు అడ్డురాయిగా, ప్రతీకారంగా ఉంటుంది గాక! 10 వాళ్ళు చూడకుండా వాళ్ల కళ్ళకు చీకటి కమ్ముతుంది గాక! వాళ్ళ వీపులు ఎప్పటికీ వంగిపోతాయి గాక!
11 అందుచేత నేనడిగేదేమిటంటే, వారు పూర్తిగా పడిపోవాలని తొట్రుపడడం జరిగిందా? అలా కానే కాదు గాని, వారి తొట్రుపాటువల్ల ఇతర ప్రజలకు పాపవిముక్తి కలిగింది. తద్వారా ఇస్రాయేల్‌వారికి అసూయ పుట్టాలి అని దేవుని ఉద్దేశం. 12 వారి తొట్రుపాటు లోకానికి ఐశ్వర్యంగా ఉంటే, వారి భంగపాటు ఇతర ప్రజలకు ఐశ్వర్యంగా ఉంటే, వారి సమృద్ధివల్ల ఇంకా ఎంత ఎక్కువ ఐశ్వర్యం కలుగుతుందో!
13 ఇతర ప్రజలైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఇతర ప్రజలకు దేవుడు పంపిన రాయబారిని నేను, గనుక నా సేవను ఘనపరుస్తున్నాను. 14 ఎలాగైనా సరే శరీర సంబంధంగా నా జనానికి అసూయ పుట్టించి, వారిలో కొందరికి పాపవిముక్తి కలిగించాలని నా కోరిక. 15 దేవుడు వారిని త్రోసివేయడం లోకం దేవునితో రాజీపడే స్థితికి కారణం అయితే వారిని స్వీకరించడంవల్ల ఏమి జరుగుతుంది? మృతమైన దానిలో నుంచి జీవమే గదా!
16 ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్ద కూడా పవిత్రమే. చెట్టువేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే. 17 అయితే కొమ్మలలో కొన్ని విరిగిపోయాయి. ఇతర ప్రజలైన మీరు అడవి ఆలీవ్ చెట్టుగా మిగిలినవాటి మధ్య అంటుకట్టబడ్డారు. వాటితో కూడా ఆలీవ్ చెట్టువేరు సారంలో పాల్గొన్నారు. 18 ఇది నిజమైతే ఆ కొమ్మలకు వ్యతిరేకంగా గొప్పలు చెప్పకండి. ఒకవేళ గొప్పలు చెపితే మీరు చెట్టువేరుకు ఆధారం కాదు గాని చెట్టువేరే మీకు ఆధారమని తెలుసుకోండి.
19 మీరంటారు గదా, “నేను అంటుకట్టబడేందుకే కొమ్మలను విరగ్గొట్టడం జరిగింది!” 20 సరే గాని, వారు అవిశ్వాసాన్ని బట్టే విరిగిపోయారు, మీరు విశ్వాసాన్నిబట్టే నిలిచి ఉన్నారు. విర్రవీగకండి! భయంతో ఉండండి. 21 దేవుడు సహజమైన కొమ్మలను విరగొట్టడం నుంచి వెనకకు తగ్గకుండా ఉంటే మిమ్మల్ని విరగొట్టడం నుంచి వెనకకు తగ్గడు.
22 ఇందులో దేవుని దయ, కాఠిన్యం చూడండి. పతనమైన వారిమీద కాఠిన్యమూ, మీరు దేవుని దయలో నిలిచివుంటే మీమీద దయ చూపుతాడు. నిలిచి ఉండకపోతే మిమ్ములను కూడా నరికివేయడం జరుగుతుంది. 23 వారేమో ఇంకా అవిశ్వాసంలో సాగుతూ ఉండకపోతే అంటుకట్టబడతారు. వారిని మళ్ళీ అంటుకట్టడానికి దేవుడు సమర్థుడు. 24 మిమ్ములను సహజమైన అడవి ఆలీవ్ చెట్టునుంచి నరికివేసి మంచి ఆలీవ్‌చెట్టులో అసహజంగా అంటుకట్టడం జరిగిందంటే, ఈ సహజమైన కొమ్మలను తమ సొంత ఆలీవ్‌చెట్టులో అంటుకట్టడం మరీ ఎంతో నిశ్చయంగా జరుగుతుంది గదా!
25 సోదరులారా, మీ దృష్టిలో మీరే జ్ఞానులమని అనుకోకుండేలా మీరు ఈ రహస్య సత్యం తెలుసుకోకుండా ఉండాలని నా కోరిక కాదు. ఆ సత్యం ఏమంటే ఆలీవ్‌చెట్టులో ఇతర ప్రజల సంఖ్య పూర్తి అయ్యేవరకు ఇస్రాయేల్‌ప్రజలో కొంత భాగానికి గుడ్డితనం కలిగి ఉంది. 26 తరువాత ఇస్రాయేల్ ప్రజ అంతటికీ పాపవిముక్తి కలుగుతుంది. దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, విమోచకుడు సీయోను నుంచి వచ్చి యాకోబు జనంలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు; 27 వారి అపరాధాలను తీసివేసేటప్పుడు నేను వారితో చేసే ఒడంబడిక ఇదే.
28 శుభవార్త విషయమైతే వారు విరోధులు. ఇది మీకోసమే. కానీ దేవుని ఎన్నిక విషయంలో వారు పితరులను బట్టి దేవునికి ప్రియులు. 29  ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటి విషయంలో, ఆయన పిలుపు విషయంలో మార్పు కలగదు.
30 గతంలో మీరు దేవునికి లోబడనివారు. ఇప్పుడైతే వారు లోబడకపోవడంచేత మీకు కరుణ లభించింది. 31 అలాగే, ఇప్పుడు వారూ లోబడనివారు గాని మీకు కలిగిన కరుణవల్ల వారికి కూడా కరుణ కలగాలి అని దేవుని ఉద్దేశం. 32  ఎందుకంటే దేవుడు అందరి మీదా కరుణ చూపాలని అందరినీ లోబడని స్థితిలో మూసివేసి నిర్బంధించాడు.
33 ఆహా, దేవుని బుద్ధిజ్ఞానాల సమృద్ధి ఎంత లోతైనది! ఆయన న్యాయ నిర్ణయాలు ఎంత అన్వేషించలేనివి! ఆయన మార్గాలు ఎంత జాడ పట్టలేనివి! 34  ప్రభు మనసు ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? 35  ఆయన మళ్ళీ ఇవ్వాలని ఆయనకు ముందుగా ఇచ్చిన వాడెవడు? 36 సమస్తమూ ఆయననుంచీ, ఆయనద్వారా, ఆయనకే. ఆయనకే శాశ్వతంగా మహిమ కలుగుతుంది గాక! తథాస్తు.