10
1 ✝సోదరులారా, ఇస్రాయేల్ ప్రజకు పాపవిముక్తి కలగాలనే నా హృదయాభిలాష, వారికోసం దేవునికి చేసే నా ప్రార్థన. 2 ✽వారికి దేవుని విషయంలో ఆసక్తి ఉందని వారిని గురించిన నా సాక్ష్యం. అయితే వారి ఆసక్తి జ్ఞానానికి అనుగుణమైనది కాదు. 3 దేవుని నీతిన్యాయాల విషయంలో వారికి తెలివి లేదు గనుక తమ సొంత నీతిన్యాయాలను స్థాపించాలని చూస్తూ, దేవుని నీతిన్యాయాలకు లోబడలేదు.4 నీతిన్యాయాల సంగతి చూస్తే తనను నమ్మిన ప్రతి ఒక్కరి విషయంలోనూ క్రీస్తు ధర్మశాస్త్రానికి✽ సమాప్తం. 5 ✝ధర్మశాస్త్రానికి సంబంధించిన నీతిన్యాయాల గురించి మోషే రాసేదేమంటే, వాటిని చేస్తూ ఉండే మనిషి వాటివల్ల జీవిస్తాడు. 6 ✽ అయితే నమ్మకానికి సంబంధించిన నీతిన్యాయాలు చెప్పేదేమిటంటే మీ హృదయాలలో ఇలా అనుకోకండి: పరలోకానికి ఎక్కిపోయే వారెవరు (క్రీస్తును అక్కడనుంచి క్రిందికి తీసుకురావాలని)? 7 లేదా, అగాధం✽లోకి దిగిపోయేవారెవరు (క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి పైకి తీసుకురావాలని)?
8 అది ఏమని చెపుతూ ఉంది? “వాక్కు మీ సమీపంలో ఉంది. అది మీ నోట్లోనూ మీ హృదయంలోనూ ఉంది.” ఆ వాక్కు మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కే. 9 ✽అదేమంటే ప్రభువైన యేసును మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడని మీ హృదయంలో నమ్మితే మీరు పాపవిముక్తి, రక్షణ పొందుతారు. 10 ఎందుకంటే, మనిషి హృదయంతో నమ్ముతాడు, దాని ఫలితం నిర్దోషత్వం. నోటితో ఒప్పుకొంటాడు. దాని ఫలితం పాపవిముక్తి.
11 ✽ లేఖనం ఇలా అంటుంది: ఆయనమీద నమ్మకం ఉంచినవారెవరికీ సిగ్గంటూ కలగదు. 12 యూదులూ గ్రీసువారూ అంటూ భేదం లేదు✽ – ఒకే ఒక ప్రభువు అందరికీ ప్రభువే. ఆయన తనకు మొరపెట్టే వారందరిపట్లా కృపాసంపన్నుడు. 13 ✽ఎలాగంటే, ఎవరైతే ప్రభువు పేర మొర పెడతారో వారికి పాపవిముక్తి కలుగుతుంది.
14 ✽కానీ వారు నమ్మనివానికి మొరపెట్టడం ఎలా? వారు ఆయనను గురించి వినకపోతే నమ్మడం ఎలా? చాటించేవాడు లేనిదే వారు వినడం ఎలా? 15 ✽ పంపబడకపోతే చాటించేవారు ఎలా చాటిస్తారు? ఇందుకు ఇలా రాసి ఉంది: శాంతి శుభవార్త ప్రకటిస్తూ, ఉత్తమ విశేషాలను గురించి శ్రేష్ఠ సమాచారం తీసుకువచ్చేవారి పాదాలు ఎంతో అందమైనవి.
16 ✽✽అయినా వారంతా శుభవార్త చెవినిపెట్టలేదు. యెషయా అన్నాడు గదా, ప్రభూ! మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు? 17 ✽ గనుక వినడంవల్ల నమ్మకం కలుగుతుంది. వినడం దేవుని వాక్కువల్ల కలుగుతుంది.
18 ✽అయితే నేను చెప్పేదేమిటంటే, వారు వినలేదా? విన్నారు గదా! “వాటి వాణి లోకమంతటా వినిపించింది, వాటి మాటలు జగత్తు కొనలకు చేరాయి.”
19 ✽✽ నేను చెప్పేదేమిటంటే, ఇస్రాయేల్‌ప్రజకు ఇది తెలిసినది కాదా? మొదట మోషే దేవుని మాటలు ఇలా చెప్పాడు: జాతి కానివారివల్ల మీకు అసూయ పుట్టిస్తాను. బుద్ధిలేని జాతివల్ల మీకు కోపం రేకెత్తిస్తాను.
20 ✽ యెషయా చాలా ధైర్యం వహించి దేవుని మాటలు ఇలా పలికాడు: నన్ను వెదకనివారికి నేను దొరికాను. నన్ను గురించి విచారణ చేయనివారికి ప్రత్యక్షమయ్యాను. 21 ఇస్రాయేల్‌ప్రజ విషయమైతే ఆయన అన్నాడు, అవిధేయులై మూర్ఖంగా ఉండే ప్రజవైపు నేను రోజంతా చేతులు చాపాను.