9
1 నాకు హృదయంలో ఎంతో దుఃఖం, ఎడతెగని బాధ ఉన్నాయి – 2 క్రీస్తులో సత్యమే చెపుతున్నాను. నేను అబద్ధమాడడం లేదు. నా అంతర్వాణి పవిత్రాత్మతో కలిసి నాకు సాక్ష్యం చెపుతూ ఉంది. 3 శరీర సంబంధంగా నా సోదరులైన నా సొంత జాతివారికోసం నేను క్రీస్తునుంచి వేరుపడి శాపానికి గురి కావడానికి కోరగలవాణ్ణి. 4 వారు ఇస్రాయేల్ ప్రజ. దత్తస్వీకారం, మహిమ, ఒడంబడికలు, ధర్మశాస్త్ర ప్రధానం, ఆరాధనాచారాలు, వాగ్దానాలు వారికి చెందుతాయి. 5 పితరులు వీరివారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చినది వీరిలోనుంచే. ఈయన అందరికంటే ఉన్నతుడు, శాశ్వతంగా స్తుతిపాత్రుడైన దేవుడు. తథాస్తు!
6 దేవుని వాక్కు భంగమైనట్టు కాదు. ఎందుకంటే, ఇస్రాయేల్ నుంచి సహజంగా వచ్చినవారంతా నిజమైన ఇస్రాయేల్‌వారు కారు. 7  అలాగే, అబ్రాహాముకు పుట్టిన వారంతా దాన్ని బట్టి అబ్రాహాము సంతానమని కాదు గాని “ఇస్సాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అని పిలవడం జరుగుతుంది.” 8 దీని అర్థమేమంటే శరీరరీతిగా పుట్టినవారు దేవుని సంతానం కాదు గాని దేవుని వాగ్దానం మూలంగా పుట్టినవారే సంతానంగా లెక్కలోకి వస్తారు.
9 ఆ వాగ్దానం గురించిన వాక్కు ఇది: “ఇదే కాలంలో నేను వస్తాను. శారాకు కుమారుడు కలుగుతాడు.”
10 అంతే కాదు. రిబ్కా కూడా మన పితరుడైన ఇస్సాకు అనే ఒక మనిషి వల్ల గర్భం ధరించినప్పుడు 11 ఆ పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏదీ చేయకముందే ఆమెతో ఇలా చెప్పడం జరిగింది: “పెద్దవాడు చిన్నవాడికి సేవ చేస్తాడు.” 12 దేవుని ఎన్నిక ప్రకారమైన ఉద్దేశమే నిలవాలని అలా జరిగింది. ఆ ఉద్దేశం మనుషుల క్రియల మూలమైనది కాదు గాని మనుషులను పిలిచే దేవుని మూలమైనదే. 13  దీనికి సమ్మతంగా ఈ విధంగా రాసి ఉన్నది: “యాకోబును ప్రేమతో చూశాను గాని ఏశావును ద్వేషంతో చూశాను.”
14 అందుచేత మనం ఏమనాలి? దేవుడు అన్యాయస్థుడా? అలా కానే కాదు! 15 ఆయన మోషేతో ఇలా అన్నాడు గదా: “నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వారిమీద కరుణ చూపుతాను. ఎవరిని కనికరించాలని ఉందో వారిని కనికరిస్తాను.” 16 గనుక కరుణ చూపడం దేవునివల్లే అయ్యేది. అది కావాలని ఇష్టపడే వ్యక్తివల్ల కాదు, దానికోసం పరుగెత్తే వ్యక్తివల్లా కాదు. 17  లేఖనం ఫరోతో చెప్పేదేమిటంటే, “నీ విషయంలో నా బలప్రభావాలను ప్రదర్శించాలి, నా పేరు విశాల లోకంలో ప్రచురం కావాలి. ఈ కారణంచేతే నిన్ను హెచ్చించాను”. 18  కనుక ఆయన ఎవరిమీద కరుణ చూపాలని కోరుతాడో వారిమీద చూపుతాడు, ఎవరి హృదయం గట్టిపరచాలని కోరుతాడో వారికి అలా చేస్తాడు.
19 అలాగైతే నీవు నాతో ఇలా అంటావు: “ఆయన సంకల్పాన్ని ఎదిరించేదెవరు? ఆయన తప్పు పట్టడమెందుకు?” 20 అయితే, ఓ మనిషీ, దేవునికి ఎదురు చెప్పడానికి నీవెవరివి? “నన్ను ఈ విధంగా ఎందుకు చేశావు?” అని నిర్మాణమైనది దాని నిర్మాతతో అనవచ్చా? 21 కుమ్మరికి మట్టిమీద హక్కు లేదా? ఒకే ముద్ద తీసుకొని ఘనత కోసం ఒక పాత్రను, ఘనహీనతకోసం మరో పాత్రను అతడు చేయలేడా?
22 ఒకవేళ దేవుడు తన కోపాన్ని వెల్లడి చేయాలనీ తన బలప్రభావాలను తెలియజేయాలనీ నాశనానికి సిద్ధమైన, కోపానికి గురి అయిన పాత్రలను అధిక సహనంతో ఓర్చుకొంటే ఏమి? 23 ఆయన ముందుగానే మహిమకోసం సిద్ధం చేసిన పాత్రలపట్ల – కరుణ పొందిన ఆ పాత్రలపట్ల – తన మహిమ సంపత్తు తెలియజేయడానికి ఆశిస్తే ఏమి? 24 కరుణ పొందిన ఈ పాత్రలం మనమే – యూదుల్లోనుంచి మాత్రమే కాకుండా, ఇతర ప్రజలలో నుంచి కూడా ఆయన పిలిచినవారమే.
25 దీనికి సమ్మతంగా ఆయన హోషేయగ్రంథంలో ఇలా అంటున్నాడు: నా ప్రజ కానివారిని “నా ప్రజ” అనీ, ప్రియురాలు కానిదానిని “ప్రియురాలు” అనీ పిలుస్తాను. 26 అంతేకాదు, “మీరు నా జనం కాదు” అని చెప్పిన స్థలంలోనే వారిని “సజీవ దేవుని సంతానం” అనడం జరుగుతుంది.
27 యెషయా కూడా ఇస్రాయేల్‌ను గురించి స్వరమెత్తి ఇలా పలుకుతున్నాడు: ఇస్రాయేల్ ప్రజల సంఖ్య సముద్రం ఇసుక రేణువుల్లాగా ఉన్నా మిగిలిపోయిన భాగానికే రక్షణ కలుగుతుంది. 28 ఎందుకంటే ఆయన ఆ పని ముగించి న్యాయంతో దానిని సంక్షిప్తంగా చేస్తాడు. ప్రభువు భూమిమీద ఆ పని త్వరగా పూర్తి చేస్తాడు.
29  అంతే గాక యెషయా ముందుగా ఇలా అన్నాడు: సేనల ప్రభువు మనకు సంతానాన్ని మిగిల్చి ఉండకపోతే మనం సొదొమలాగా అయి ఉండే వాళ్ళమే, గొమొర్రా పోలిన వారంగా చేయడం జరిగి ఉండేది.
30 అలాగైతే మనమేమంటాం? నిర్దోషత్వాన్ని వెంటాడని యూదేతరులు నిర్దోషత్వాన్ని – నమ్మకం మూలమైన నిర్దోషత్వాన్ని – అందుకొన్నారు. 31 ఇస్రాయేల్‌ప్రజలైతే నిర్దోషత్వాన్ని గురించిన నియమాన్ని వెంటాడినా దాన్ని అందుకోలేదు. 32 ఎందుకని? వారు దాన్ని నమ్మకం ద్వారా కాక ధర్మశాస్త్ర క్రియల ద్వారా దానిని వెతికారు. వారి కాలికి అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 33 దీన్ని గురించి ఇలా రాసి ఉంది: ఇదుగో నేను సీయోనులో ఒక అడ్డురాయి, తొట్రుపాటు బండ ఉంచుతాను. ఆయనమీద నమ్మకం ఉంచేవారు అవమానానికి గురి కాబోరు.