8
1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్షావిధి అంటూ ఏమీ లేదు. వారు శరీర స్వభావం అనుసరించకుండా దేవుని ఆత్మననుసరించి నడుస్తారు. 2 ఎందుకంటే, క్రీస్తు యేసులో జీవమిచ్చే ఆత్మనియమం నన్ను పాప మరణాల నియమం నుంచి విడిపించింది. 3 శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమై ఉన్నకారణంగా అది ఏమి చేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు. తన సొంత కుమారుణ్ణి భ్రష్ట శరీర స్వభావాన్ని పోలిన రూపంతో పంపాడు, పాపాలకోసం బలిగా పంపాడు, శరీర స్వభావంలో ఉన్న పాపానికి తీర్పు తీర్చాడు. 4 ఇందులో దేవుని ఉద్దేశమేమిటంటే, శరీర స్వభావాన్ని అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిన్యాయాలు నెరవేరాలి.
5 శరీర స్వభావానికి లోనైనవారు శరీర స్వభావానికి చెందిన విశేషాల మీద మనసు పెట్టుకొంటారు. దేవుని ఆత్మకు లోనైనవారు ఆత్మ విశేషాలమీద మనసు పెట్టుకొంటారు. 6 శరీర స్వభావానికి చెందే మనసు మరణం. దేవుని ఆత్మకు చెందే మనసు జీవమూ, శాంతీ. 7 ఎందుకంటే, శరీర స్వభావానికి చెందే మనసు దేవునికి విరోధమే. అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదు, అలా లొంగడం అసాధ్యమే. 8 గనుక శరీర స్వభావంలో ఉన్నవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.
9 అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక, ఆ ఆత్మలోనే ఉన్నారు. ఎవరికైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు. 10 క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతం, గాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం. 11 చనిపోయిన వారిలోనుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసముంటే చనిపోయినవారిలోనుంచి క్రీస్తును లేపినవాడు చావుకు లోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసముంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు.
12 అందుచేత, సోదరులారా, శరీర స్వభావం ప్రకారంగా బ్రతకడానికి మనం దానికి బాకీపడ్డవారమేమీ కాము. 13 మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే, చనిపోతారు గాని దేవుని ఆత్మమూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు. 14 ఎందుకంటే, దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం. 15 మీరు పొందినది దాస్యంలో ఉంచి, మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు గాని దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే. ఈ ఆత్మ ద్వారా మనం “తండ్రీ, తండ్రీ” అని స్వరమెత్తి దేవుణ్ణి పిలుస్తాం. 16 మనం దేవుని సంతానమని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యమిస్తాడు.
17 మనం సంతానమైతే వారసులం కూడా, అంటే క్రీస్తుతోపాటు మహిమ పొందేందుకు ఆయనతోపాటు బాధలు అనుభవించేవారమైతే మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం.
18 ఇప్పటి మన బాధలు తరువాత మనలో వెల్లడి కాబొయ్యే మహిమతో పోల్చతగ్గవి కావని నా అంచనా. 19 దేవుని సంతానం వెల్లడి అయ్యే సమయంకోసం సృష్టి నిరీక్షణతో చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంది. 20 సృష్టి వ్యర్థమైన పరిస్థితికి ఆధీనమైంది – తనంతట తానే కాదు గాని దానిని ఆశాభావంతో ఆధీనం చేసిన దేవుని ద్వారానే. 21 ఎందుకంటే సృష్టి కూడా నాశన బంధకాలనుంచి విడుదల అయి, దేవుని సంతతివారి మహిమగల విముక్తిలో పాల్గొంటుంది. 22 సృష్టి యావత్తూ ఇదివరకు ఏకంగా ప్రసవ వేదనలు పడుతూ ఉన్నట్టుండి, మూలుగుతున్నదని మనకు తెలుసు.
23  అంత మాత్రమే కాదు. మనం కూడా – దేవుని ఆత్మ ప్రథమ ఫలాలు గల మనం కూడా దత్తస్వీకారం కోసం, అంటే, మన దేహ విమోచనం కోసం చూస్తూ లోలోపల మూలుగుతున్నాం. 24 మనం ఈ ఆశాభావంతో రక్షణ పొందాం. అయితే నెరవేరి కనబడ్డ ఆశాభావం ఆశాభావం కాదు. తమ ఎదుటే కనిపిస్తున్న దానికోసం ఎవరైనా ఎదురు చూడడమెందుకు? 25 కానీ చూడనిదాని కోసం మనకు ఆశాభావం ఉంటే దానికోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాం.
26 అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే, తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు గాని ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలుకాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు. 27 దేవుని సంకల్పం ప్రకారం పవిత్రులకోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు గనుక హృదయాలను పరిశీలించేవానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు.
28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచినవారికి, మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తున్నాయని మనకు తెలుసు. 29 ఎందుకంటే, ముందుగానే తనకు తెలిసిన తనవారు తన కుమారుణ్ణి సరిపోలిన రూపం గలవారు కావాలని దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడు. తన కుమారుడు అనేక సోదరులలో జ్యేష్ఠుడై ఉండాలన్నమాట. 30 ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు. ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమపరచాడు కూడా.
31 ఈ విషయాలను గురించి మనం ఏమనాలి? దేవుడే గనుక మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? 32 తన సొంత కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక్కు తీయకుండా మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతోపాటు అన్నిటినీ మనకు ఎలా ఉచితంగా ఇవ్వకుండా ఉంటాడు? 33 దేవుడు ఎన్నుకొన్నవారి మీద ఎవరు నేరం మోపుతారు? వారిని నిర్దోషులుగా ఎంచేది దేవుడే! 34 ఎవరు శిక్ష విధించగలరు? వారికోసం చనిపోయింది క్రీస్తే. అంతే కాదు, సజీవంగా లేచినవాడు కూడా ఆయనే. దేవుని కుడిప్రక్కన కూర్చుని ఉండి మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే.
35 క్రీస్తు ప్రేమనుంచి మనలను ఎవరు వేరు చేయగలరు? బాధ గానీ వేదన గానీ హింస గానీ కరవు గానీ వస్త్రహీనత గానీ అపాయం గానీ ఖడ్గం గానీ వేరు చేయగలవా? 36 దీన్ని గురించి ఇలా రాసి ఉన్నది: “నీ కోసమే మేము రోజంతా హతం అవుతున్నాం. వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం.”
37 అయినా మనలను ప్రేమించేవానిద్వారా వీటన్నిటి లోనూ మనం అత్యధిక విజయం గలవారం.
38 నాకున్న దృఢ నిశ్చయమేమిటంటే, చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా 39 ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభువైన క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమనుంచి మనలను వేరు చేయనేలేవు.