7
1 సోదరులారా, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నంత కాలమే ఆ వ్యక్తి మీద ధర్మశాస్త్రానికి అధికారం ఉంటుందని మీకు తెలియదా? ధర్మశాస్త్రం తెలిసినవారితో మాట్లాడుతున్నాను గదా. 2  పెండ్లయిన స్త్రీ తన భర్త బ్రతికి ఉన్నంతవరకూ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కట్టుబడి ఉంటుంది గాని భర్త చనిపోతే భర్తను గురించిన చట్టంనుంచి ఆమె విడుదల అవుతుంది. 3 అయితే భర్త ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఆమె మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొంటే ఆమెను వ్యభిచారిణి అనడం జరుగుతుంది. భర్త చనిపోతే ఆమెకు ఆ చట్టం నుంచి విడుదల కలుగుతుంది గనుక మరో పురుషుణ్ణి పెళ్ళిచేసుకొన్నా ఆమె వ్యభిచారిణి కాదు.
4 ఆ ప్రకారం, నా సోదరులారా, మీరు మరో వ్యక్తికి – అంటే చనిపోయినవారిలోనుంచి లేచిన క్రీస్తుతో వివాహ మయ్యేలా ధర్మశాస్త్రం విషయంలో ఆయన శరీరంతోపాటు చనిపోయారు. మనం దేవునికోసం ఫలించేందుకు అలా జరిగింది. 5 మనం శరీర స్వభావానికి లోనై ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల రెచ్చిపోయిన పాపిష్ఠి కోరికలు మన శరీర భాగాలలో పని చేస్తూ వచ్చాయి, మరణం కోసం ఫలించాయి. 6 ఇప్పుడైతే మనకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది. మనలను బంధించిన దాని విషయంలో చనిపోయాం. ఎందుకని? మనం దేవుని ఆత్మను అనుసరించే కొత్త విధానంలో సేవ చేయాలి గాని ధర్మశాస్త్రాన్ని అక్షరాల అనుసరించిన పాత విధానంలో కాదు.
7 అలాగైతే మనం ఏమనాలి? ధర్మశాస్త్రం పాపమా? అలా కానే కాదు. అసలు ధర్మశాస్త్రం ద్వారానే తప్ప పాపమంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. ఇతరులదేదీ వాంఛించకూడదు అంటూ ధర్మశాస్త్రం చెప్పకపోతే అలాంటి వాంఛ ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు.
8 కానీ పాపం ఆ ఆజ్ఞను అవకాశంగా తీసుకొని నాలో ప్రతి రకమైన పేరాశ పుట్టించింది. ధర్మశాస్త్రానికి వేరుగా పాపం చచ్చి ఉంది. 9 ఒకప్పుడు ధర్మశాస్త్రానికి వేరుగా నాకు జీవం ఉన్నట్టుంది గాని ఆ ఆజ్ఞ రావడంతో పాపానికి ప్రాణం వచ్చింది, నేను చచ్చాను. 10 జీవాన్ని తేవలసిన ఆ ఆజ్ఞ నాకు చావు తెచ్చినట్టు తెలిసిపోయింది. 11 ఎలాగంటే, పాపం ఆ ఆజ్ఞ ద్వారా అవకాశం చిక్కించుకొని నన్ను పూర్తిగా మోసపుచ్చి దాని ద్వారా చంపింది.
12 కాబట్టి ధర్మశాస్త్రం పవిత్రమైనదే, ఆ ఆజ్ఞ కూడా పవిత్రమైనదే, న్యాయమైనదే, మంచిదే. 13 అయితే ఆ మంచిది నాకు చావు కలిగించిందా? అలా కానే కాదు. ఆ విధంగా చేసినది పాపమే. మంచిదాని ద్వారా నాకు చావు తెచ్చిపెట్టడంవల్ల అది పాపంగా కనిపించాలనీ ఆ ఆజ్ఞమూలంగా పాపం అతి పాపిష్ఠిది కావాలనీ అలా జరిగింది.
14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. నేనైతే శరీర స్వభావమున్న వాణ్ణి, పాపానికి బానిసగా అమ్ముడు పోయినవాణ్ణి. 15 నేను చేస్తున్నది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే నేను చేయాలని ఇష్టపడేది చేస్తూ ఉండడం లేదు గాని అసహ్యించుకొనేది చేస్తున్నాను. 16 అలా ఇష్టపడనిది నేను చేస్తున్నానంటే ధర్మశాస్త్రం మంచిదని దానితో సమ్మతిస్తున్నాను. 17 అందుచేత ఇకమీదట ఇష్టపడనిది చేసేది నేను కాదు గాని నాలో ఉన్న పాపమే. 18 నాలో – అంటే, నా శరీర స్వభావంలో – మంచిది ఏదీ నివసించడం లేదని నాకు తెలుసు. మంచి చేయాలని ఇష్టపడడం అనేది నాకుంది గాని మంచి చేయడం నావల్ల కావడం లేదు. 19 ఇష్టపడే మంచి నేను చేయడం లేదు గాని ఇష్టపడని చెడును చేస్తున్నాను. 20 ఇష్టపడనిది చేస్తున్నానంటే అలా చేసేది నేను కాదు గాని నాలో ఉంటున్న పాపమే.
21 ఈ విధంగా నాకొక నియమం కనిపిస్తున్నది. అదేమిటంటే, మంచి చేయాలని ఇష్టమున్న నాలో చెడుతనం ఉంది. 22 దేవుని ధర్మశాస్త్రం అంటే నాకు అంతరంగంలో ఆనందమే. 23 అయినా నా శరీర భాగాల్లో మరో నియమముందని నేను గ్రహిస్తున్నాను. అది నా మనసులో ఉన్న నియమంతో యుద్ధం చేస్తూ ఉంది, నా శరీర భాగాల్లో ఉన్న పాప నియమానికి నన్ను ఖైదు చేస్తూ ఉంది. 24 అయ్యో, నాకు ఎంత బాధ! ఈ చావుగొట్టు శరీరంనుంచి నన్నెవరు విడిపిస్తారు? 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను.
కనుక నా విషయం ఇలా ఉంది: నేను మనసు విషయంలో దేవుని నియమానికి దాసుణ్ణి, శరీర స్వభావం విషయంలో పాప నియమానికి దాసుణ్ణి.