6
1 ✽అలాగైతే మనం ఇంకేమి చెప్పాలి? కృప వృద్ధి చెందాలని పాపంలో నిలిచి ఉందామా? 2 అలా కానే కాదు✽! పాపం విషయంలో చనిపోయిన మనం అందులో ఇంకా ఎలా జీవించగలం? 3 ✽యేసు క్రీస్తులోకి బాప్తిసం పొందిన మనం, ఆయన మరణంలోకి బాప్తిసం పొందామని మీకు తెలియదా? 4 గనుక మరణంలోకి బాప్తిసం పొందడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం. ఎందుకంటే, తండ్రి అయిన దేవుని మహాత్యం క్రీస్తును చనిపోయినవారిలోనుంచి లేపినట్టే మనం కూడా క్రొత్త జీవంతో బ్రతకాలి.5 ✽మనం ఆయనతో ఐక్యమై చనిపోయినట్టు ఉంటే, ఆయనతోకూడా సజీవంగా లేచినట్టు ఉంటాం. అనుమానం లేదు. 6 ✽మన పాప శరీరం ప్రభావం లేకుండా పోవాలనీ మనం ఇకమీదట పాపానికి బానిసలుగా ఉండకూడదనీ మన పాత మానవ స్వభావం క్రీస్తుతో సిలువ మరణం పాలైందని మనకు తెలుసు. 7 ✽ఆ విధంగా చనిపోయిన వ్యక్తి పాపంనుంచి విముక్తుడై ఉన్నాడు.
8 ✽ మనం క్రీస్తుతో చనిపోయామంటే ఆయనతో జీవిస్తాం అని కూడా నమ్ముతున్నాం. 9 ✽చనిపోయినవారిలో నుంచి లేచిన క్రీస్తు ఇంకెన్నడూ మళ్ళీ చనిపోడనీ ఇకనుంచి మరణానికి ఆయనమీద ప్రభుత్వమేమీ లేదనీ మనకు తెలుసు. 10 ఎందుకంటే, ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలోనే చనిపోయాడు. చనిపోయింది ఎప్పటికీ ఒక్క సారే. ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే ఈ జీవితం దేవునికోసమే.
11 ✽ఆ ప్రకారమే మీరు పాపం విషయంలో చనిపోయారనీ దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులనీ మిమ్ములను మీరే ఎంచుకోండి. 12 ✽అందుచేత చావుకు లోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి, శరీరం చెడ్డ కోరికలకు లోబడకండి. 13 ✽మీ శరీర భాగాలు దుర్మార్గ సాధనాలుగా పాపానికి ఇచ్చివేసుకోకండి గాని చనిపోయి సజీవంగా లేచినవారం అంటూ మిమ్ములను మీరే దేవునికే ఇచ్చివేసుకోండి, మీ అవయవాలు కూడా న్యాయ సాధనాలుగా దేవునికే ఇచ్చివేసుకోండి. 14 ✽పాపం మీ మీద అధికారం చెలాయించదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కారు గాని కృపక్రింద✽ ఉన్నవారే.
15 ✽ అలాగైతే ధర్మశాస్త్రం క్రింద ఉండక కృప క్రిందే ఉన్నామంటూ పాపం చేద్దామా? అలా కానే కాదు✽. 16 ✽లోబడేందుకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా ఇచ్చివేసుకొంటారో దేనికి లోబడుతారో దానికే దాసులై ఉన్నారని మీకు తెలియదా? పాపానికి దాసులైతే దాని ఫలితం మరణం. విధేయతకు దాసులైతే దాని ఫలితం నిర్దోషత్వం. 17 ✽మునుపు మీరు పాపానికే దాసులు. అయినా ఏ బోధన మూసకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయ పూర్వకంగా విధేయులయ్యారు. 18 ఆ విధంగా పాపంనుంచి విడుదల అయి నీతిన్యాయాలకు దాసులయ్యారు✽. అందుకు దేవునికి స్తుతులు!
19 ✽మీ శరీర స్వభావం బలహీనతను బట్టి మామూలు మానవ ధోరణిలో మాట్లాడుతున్నాను. మునుపు మీరు మీ అవయవాలను దాసులుగా కల్మషానికీ అక్రమానికీ ఇచ్చివేసు కొన్నారు. అది ఇంకా అక్రమానికి దారి తీసింది. ఇప్పుడు అలాగే మీ అవయవాలను దాసులుగా నీతిన్యాయాలకు✽ పవిత్రతకోసం ఇచ్చివేసుకోండి✽. 20 ✽మీరు పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతిన్యాయాలతో నిమిత్తం లేనివారు.
21 ✽అప్పటి పనులవల్ల మీకేమి ప్రయోజనం? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు గదా. అలాంటి వాటి ఫలితం చావే. 22 ✽ఇప్పుడైతే మీరు పాపం నుంచి విడుదల అయి దేవునికి దాసులయ్యారు. దీనివల్ల మీకు కలిగే ఫలం పవిత్రత, చివరి ఫలితం శాశ్వత జీవం.
23 ✽✽ఎందుకంటే, పాపంవల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం.