5
1 ✽✽మనం విశ్వాసంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చినందుచేత మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం ఉంది. 2 అంతేగాక, ఆయన ద్వారా నమ్మకంవల్ల దేవుని కృపలోకి మనకు ప్రవేశం✽ కలిగి ఉంది. ఈ కృపలో✽ నిలిచి ఉంటూ దేవుని మహిమకోసం ఆశాభావం✽తో ఎదురు చూస్తూ ఉత్సాహపడుతున్నాం. 3 ✽అంతేగాక, మన బాధలలో కూడా ఉత్సాహపడుతున్నాం. ఎందుకంటే, బాధ సహనాన్ని కలిగిస్తుందనీ 4 సహనం అనుభవాన్ని కలిగిస్తుందనీ అనుభవం ఆశాభావాన్ని కలిగిస్తుందనీ మనకు తెలుసు. 5 ✽✽ఈ ఆశాభావం మనకు ఆశాభంగం కలిగించదు. ఎందుకంటే, మనకు ప్రసాదించబడిన పవిత్రాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమను కుమ్మరించడం జరిగింది.6 ✽మనమింకా బలం లేకుండా ఉన్నప్పుడు క్రీస్తు తగిన కాలంలో భక్తిహీనులకోసం చనిపోయాడు. 7 న్యాయవంతుని కోసం సహా ఎవరైనా చనిపోవడం అరుదు. ఒకవేళ మంచి వ్యక్తికోసం ఎవరైనా తెగించి చనిపోతే చనిపోవచ్చు. 8 కానీ మనమింకా పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇందులో దేవుడు తన ప్రేమను మనపట్ల చూపుతున్నాడు.
9 ✽ఇప్పుడు మనం ఆయన రక్తంవల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చాం, గనుక మరీ నిశ్చయంగా ఆయనద్వారా దేవుని కోపం నుంచి మనకు విముక్తి కలుగుతుంది. 10 మనం దేవునికి విరోధులమై ఉన్నప్పుడు తన కుమారుని మరణం ద్వారా మనలను దేవునితో సఖ్యపరచడం జరిగింది✽. అలాంటప్పుడు ఆయనతో సఖ్యపడి, ఆ కుమారుడు జీవిస్తూ ఉండడంవల్ల మరి నిశ్చయంగా మనకు విముక్తి కలుగుతుంది. 11 ✽ఇంతేగాక, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు దేవునితో సఖ్యపడి✽ ఆయన ద్వారా దేవునిలో ఉత్సాహ పడుతున్నాం.
12 ✽✽పాపమనేది ఒకే మనిషి ద్వారా లోకంలో ప్రవేశించింది. పాపం ద్వారా చావు ప్రవేశించింది. అందరూ పాపం చేశారు గనుక అలాగే అందరికీ చావు వచ్చింది. 13 ✽ధర్మశాస్త్రానికి ముందు పాపం లోకంలో ఉంది గాని ధర్మశాస్త్రం లేనప్పుడు అది పాపంగా లెక్కలోకి రాదు. 14 అయినప్పటికీ ఆదామునుంచి మోషే వరకు చావు ఏలింది. ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమం లాంటి పాపం చేయనివారిమీద కూడా చావు ఏలింది. ఆదాము అప్పుడు రాబోయి ఉండేవానికి సూచన.
15 అయితే ఆదాము అపరాధంలాగా దేవుని ఉచిత కృపావరం✽ రాలేదు, అంటే ఆ ఒక్క మనిషి అపరాధంవల్ల అనేకులకు✽ చావు కలిగింది గాని యేసు క్రీస్తు అనే మనిషివల్ల వచ్చే ఉచిత కృపావరమూ, దేవుని అనుగ్రహమూ మరీ నిశ్చయంగా అనేకులకు సమృద్ధిగా కలిగాయి. 16 ✽అంతేగాక, పాపం చేసిన ఆ ఒక్కడి వల్ల ఫలితం కలిగినట్లు దేవుని ఉచిత వరం కలగలేదు. ఆ ఒక్క పాపంవల్ల దేవుని తీర్పు వచ్చింది. తీర్పు వల్ల శిక్షావిధి కలిగింది. ఆ ఉచిత వరమైతే అనేక అపరాధాల మూలంగా కలిగింది. దానివల్ల నిర్దోషులుగా ఎంచబడడం అనేది కలిగింది. 17 ఆ ఒక్కని అపరాధంవల్ల చావు వచ్చి ఆ ఒక్కని ద్వారా ఏలింది✽. అయితే కృపాసమృద్ధి, నిర్దోషత్వమనే ఉచిత వరం పొందేవారు మరీ నిశ్చయంగా జీవిస్తూ యేసు క్రీస్తు అనే ఒక్కని ద్వారా ఏలుతారు.
18 కనుక ఒకే అపరాధ ఫలితం మనుషులందరికీ✽ శిక్షావిధి✽ వచ్చినట్టే ఒకే న్యాయ క్రియ వలన మనుషులందరికీ ఆ ఉచిత వరం వచ్చింది. దాని ఫలితం జీవితం నిర్దోషంగా ఎంచబడడం. 19 ఎలాగంటే, ఆ ఒకే మనిషి అవిధేయత✽వల్ల అనేకులు ఎలా పాపులయ్యారో అలాగే ఈ ఒకే మనిషి విధేయత✽వల్ల అనేకులు నిర్దోషులవుతారు.
20 దోషాన్ని వృద్ధి చేయడానికి ధర్మశాస్త్రం✽ ప్రవేశించింది. అయితే పాపం ఎక్కడ వృద్ధి అయిందో అక్కడ దేవుని కృప మరింతగా వృద్ధి అయింది. 21 ఈ విధంగా మరణంలో పాపం ఎలా ఏలిందో✽ అలాగే నిర్దోషత్వం మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాశ్వత జీవానికి కృప ఏలుతుంది.