4
1 శరీరసంబంధంగా మన✽ పితరుడైన అబ్రాహాము కనుగొన్నదేమిటి? మనం ఏమనాలి? 2 ✝ఒకవేళ అబ్రాహాము క్రియల వల్ల నిర్దోషుల లెక్కలోకి వచ్చి ఉంటే గొప్పలు చెప్పుకోవడానికి అతనికి కారణం ఉండేది. కానీ దేవుని ఎదుట కాదు. 3 ✽ ఎందుకంటే, లేఖనం చెప్పేదేమిటి?✽ – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే నిర్దోషత్వంగా అతని లెక్కలోకి వచ్చింది.4 ✽పని చేసేవాడికి లభించిన జీతం దానం కాదు గాని రుణంగా ఎంచబడేది. 5 ✽కానీ విముక్తి కోసం పని చేయనివాడు, పాపులను నిర్దోషులుగా ఎంచే దేవునిమీద నమ్మకం ఉంచితే అతని నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది.
6 ✽ఆ ప్రకారమే క్రియలప్రమేయం లేకుండా నిర్దోషి అని దేవుడు ఎంచిన మనిషి ధన్యజీవి అని దావీదు కూడా చెప్పాడు: 7 దేవుడు ఎవరి అతిక్రమాలు క్షమించాడో, ఎవరి పాపాలను కప్పివేశాడో వారు ధన్యజీవులు. 8 ప్రభువు ఎవరి అపరాధం లెక్కలోకి తీసుకోడో వారు ధన్యజీవులు.
9 ఈ దీవెన సున్నతి ఉన్నవారి✽ కోసమేనా? సున్నతి లేనివారికోసం కూడానా? అబ్రాహాము నమ్మకం నిర్దోషత్వంగా అతని లెక్కలో వచ్చిందని చెపుతున్నాం గదా? 10 ✽అలా లెక్కలోకి వచ్చినది ఏ పరిస్థితులలో? అతనికి సున్నతి ఉన్నప్పుడా? సున్నతి లేనప్పుడా? ఉన్నప్పుడు కాదు, లేనప్పుడే. 11 సున్నతి పొందకముందే విశ్వాసంవల్లే అబ్రాహాముకు ఎంచబడిన నిర్దోషత్వానికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. సున్నతి లేకపోయినా, నమ్మేవారందరూ కూడా లెక్కలోకి నిర్దోషులుగా వచ్చేలా వారికి ఈ విధంగా అబ్రాహాము తండ్రిగా ఉన్నాడు. 12 అంతే గాక సున్నతి ఉన్నవారికి కూడా అతడు తండ్రిగా ఉన్నాడు – అంటే, సున్నతి పొందడం మాత్రమే కాదు గాని సున్నతి లేనప్పుడు మన పితరుడు అబ్రాహాముకు ఉన్న నమ్మకం అడుగు జాడల్లో నడిచే వారికి అతడు తండ్రి.
13 ✽✽అబ్రాహాము లోకానికి వారసుడవుతాడనే వాగ్దానం అతనికి గానీ, అతని సంతానానికి గానీ ధర్మశాస్త్రం ద్వారా కలిగింది కాదు. విశ్వాసంవల్ల కలిగే నిర్దోషత్వం ద్వారానే ఆ వాగ్దానం వచ్చింది. 14 ✽ఎందుకంటే, ధర్మశాస్త్రసంబంధులు దేవుని వారసులైతే విశ్వాసం వృథా, ఆ వాగ్దానం కూడా శూన్యం. 15 ✽కారణం ఏమంటే, ధర్మశాస్త్రంవల్ల కోపం వస్తుంది. ఎలాగంటే ధర్మశాస్త్రం లేకపోతే దానిని మీరడమూ ఉండదు.
16 ✽ఆ వాగ్దానం ధర్మశాస్త్ర సంబంధులకు మాత్రమే గాక అబ్రాహాములాగే నమ్మకముంచినవారికి కూడా – అతని సంతానమంతటికీ – సుస్థిరం కావాలని దేవుని అనుగ్రహం వల్లే కలిగేలా అది విశ్వాసాన్ని బట్టే వచ్చింది. 17 ✽ తాను నమ్మిన దేవుని దృష్టిలో అతడు మనకందరికీ తండ్రి. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: “అనేక జనాలకు నిన్ను తండ్రిగా చేశాను.” ఆ దేవుడు చనిపోయినవారికి జీవమిస్తాడు✽, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుస్తాడు.
18 ✽“నీ సంతతివారు అలాగే ఉంటారు” అని దేవుడు చెప్పిన మాటప్రకారం అనేక జనాలకు తండ్రి అయ్యేలా అబ్రాహాము నమ్మాడు. ఆశాభావానికి ప్రతికూలంగా ఉన్నట్టు ఆశాభావంతో నమ్మాడు. 19 అతని విశ్వాసం దుర్బలం కాలేదు. అప్పుడు అతని వయసు సుమారు నూరేళ్ళు కావడంచేత అతని శరీరం మృతతుల్యం. శారా గర్భం కూడా మృతతుల్యం. అతడు వాటిని గురించి తలపోయలేదు. 20 దేవుని వాగ్దానం గురించి అతడు అవిశ్వాసంవల్ల ఆందోళనపడలేదు గాని దేవుణ్ణి ఘనపరుస్తూ విశ్వాసంలో బలపడ్డాడు. 21 వాగ్దానం చేసినది నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని అతడు పూర్తిగా నమ్మాడు. 22 ✽అందుచేత ఆ నమ్మకం అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది.
23 ✽అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది అనే మాటలు అతనికోసం మాత్రమే కాదు, 24 మనకోసం కూడా రాసి ఉన్నాయి. చనిపోయినవారిలో నుంచి మన ప్రభువైన యేసును లేపినవానిమీద నమ్మకం ఉంచిన మనకు కూడా అది నిర్దోషత్వంగా లెక్కలోకి వస్తుంది. 25 ✽మన అపరాధాలకోసం యేసును మరణానికి అప్పగించడమూ మనం నిర్దోషులుగా ఎంచబడేలా ఆయనను సజీవంగా లేపడమూ జరిగింది.