3
1 ✽అలాగైతే యూదుడికి కలిగిన ఆధిక్యమేమిటి? సున్నతి వల్ల ప్రయోజనమేమిటి? 2 ✽ ప్రతి విషయంలోనూ అధికమే. మొదటిది, దేవుని వాక్కులను అప్పగించినది వారికే. 3 ✽వారిలో కొందరు అవిశ్వాసులైతే మాత్రమేమి? వారి అవిశ్వాసంవల్ల దేవుని విశ్వసనీయత రద్దు అవుతుందా? 4 ✝అలా కానే కాదు! ప్రతి మనిషీ అబద్ధికుడై ఉన్నా దేవుడు మాత్రం సత్యవంతుడై ఉండాలి గదా. దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, నీవు నీ మాటలలో న్యాయవంతుడవుగా కనిపించాలి, తీర్పు చెప్పేటప్పుడు నీవు నెగ్గాలి.5 ✽అయితే మన అన్యాయ ప్రవర్తన దేవుని న్యాయాన్ని నిరూపిస్తూ ఉంటే మనం ఏమనాలి? తన కోపాన్ని కుమ్మరించే దేవుడు అన్యాయస్థుడా? (నేను మనుషుల వ్యవహార రీతిగా మాట్లాడుతున్నాను.) 6 అలా కానే కాదు. అలా ఉంటే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? 7 నా అసత్యం వల్ల దేవుని సత్యం వృద్ధి అయి ఆయనకు మహిమ కలిగిస్తుందనుకోండి – అలాంటప్పుడు నేను పాపినని ఇంకా తీర్పు పొందడం ఎందుకు? 8 ✽“మేలు కలిగేట్టు కీడు చేద్దాం పట్టండి!” అని ఎందుకు అనకూడదు? అలా మేమంటామని చెప్పి కొందరు మామీద అపనింద మోపుతున్నారు. వారికి కలిగే శిక్షావిధి న్యాయమే.
9 ✽అలాగైతే మట్టుకేం? వారికంటే మేము మంచివారమా? ఎంత మాత్రమూ కాదు. యూదులైనా గ్రీసు దేశస్థులైనా అందరూ పాపంక్రింద ఉన్నారని ఇంతకుముందే నేరారోపణ చేశాం గదా. 10 ✽✝దీనికి సమ్మతంగా రాసి ఉన్నదేమిటంటే, న్యాయవంతుడు లేడు, ఒక్కడూ లేడు. 11 గ్రహించేవారెవ్వరూ లేరు. దేవుణ్ణి వెదికేవారెవ్వరూ లేరు. 12 అందరూ త్రోవ తప్పినవారు. అందరూ ఏకంగా వ్యర్థులయ్యారు. మంచి చేసేవాడు లేడు – ఒక్కడూ లేడు. 13 ✝వారి గొంతు తెరచి ఉన్న సమాధి. వారి నాలుకతో మోసం చేస్తూ ఉన్నారు. వారి పెదవులక్రింద నాగు విషం ఉంది. 14 ✝వారి నోళ్ళు శాపనార్థాలతో చేదు మాటలతో నిండి ఉన్నాయి. 15 ✝వారి పాదాలు రక్తం చిందించడానికి పరుగెత్తుతూ ఉన్నాయి. 16 వారి త్రోవలలో నాశనం, ప్రాణగండం ఉన్నాయి. 17 శాంతి మార్గం వారికి ఏమీ తెలియదు. 18 ✝వారి దృష్టిలో దేవుడంటే అసలు భయమే✽ లేదు.
19 ✽ప్రతి నోరూ మూతబడాలి, లోకమంతా దేవుని తీర్పు క్రిందికి రావాలి – అందుచేతే ధర్మశాస్త్రం చెప్పేదేదైనా ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి చెపుతూ ఉంది. 20 ✽ధర్మశాస్త్రంవల్ల పాపం అంటే ఏమిటో తెలుస్తుంది. అంతే గాని ధర్మశాస్త్ర క్రియలవల్ల ఏ శరీరీ న్యాయవంతుడు అని దేవుని దృష్టిలో లెక్కలోకి రాడు.
21 ఇప్పుడైతే✽ ధర్మశాస్త్రం లేకుండానే దేవుని న్యాయం వెల్లడి అయింది. ధర్మశాస్త్రమూ ప్రవక్తల లేఖనాలూ దానికి సాక్ష్యం చెపుతూ ఉన్నాయి. 22 ఆ న్యాయం యేసు క్రీస్తు మీది నమ్మకం ద్వారానే నమ్మేవారందరికీ వారందరిమీదా ఎంచబడే దేవుని న్యాయం. భేదమేమీ లేదు. 23 ✽ఎందుకంటే అందరూ పాపం చేశారు, దేవుని మహిమకు దూరమయ్యారు. 24 నమ్మకమున్నవారు న్యాయవంతుల లెక్కలో రావడం ఉచితంగా దేవుని కృపవల్లే క్రీస్తు యేసులోని విమోచనం✽ ద్వారానే విశ్వాసం మూలంగానే. 25 ✽దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్తబలిగా✽ ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు. 26 ఇప్పుడైతే తాను న్యాయవంతుణ్ణి అనీ, యేసు మీద నమ్మకం ఉన్నవారిని న్యాయవంతులుగా ఎంచేవాణ్ణి అనీ చూపించడానికి ఆయన ఆ విధంగా తన న్యాయాన్ని ప్రదర్శించాడు.
27 ✽ ఇలా ఉన్నప్పుడు గొప్పలు చెప్పుకోవడం ఎక్కడ? అది బయట ఉంచబడింది. ఏ నియమాన్ని బట్టి బయట ఉంచబడింది? క్రియల నియమాన్ని బట్టా? కాదు గాని విశ్వాస నియమాన్ని బట్టే. 28 ✝అందుకని మనిషి ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే, విశ్వాసంవల్లే న్యాయవంతుడుగా నిర్దోషిగా లెక్కలోకి వస్తాడని అర్థం చేసుకొంటున్నాం. 29 ✽దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఇతర ప్రజలకు కూడా దేవుడు కాడా? అవును. ఇతర ప్రజలకు కూడా దేవుడే. 30 ఈ ఒకే దేవుడు సున్నతి ఉన్నవారిని వారి నమ్మకంవల్లే, సున్నతి లేనివారిని కూడా వారి నమ్మకం ద్వారానే న్యాయవంతులుగా నిర్దోషులుగా ఎంచుతాడు. 31 ✽ అయితే ఇలా నమ్మకం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? అలా కానే కాదు. దానికి బదులు ధర్మశాస్త్రాన్ని సుస్థిరం చేస్తున్నాం.