2
1 అందుచేత ఓ మానవుడా, నీవెవరైనా సరే ఇతరులకు తీర్పు తీర్చావు అంటే సాకు చెప్పలేని వ్యక్తివై ఉన్నావు. మరొకరికి దేనిలో తీర్పు తీరుస్తావో దానిలో నీమీద నీవే నేరం మోపుకొన్నట్టే. ఎందుకంటే, తీర్పు తీర్చే నీవు ఆ పనులే చేస్తున్నావు. 2 అవి చేసేవారికి వ్యతిరేకంగా ఉన్న దేవుని తీర్పు సత్య సమ్మతమే అని మనకు తెలుసు.
3 ఓ మానవుడా, అవి చేసేవారికి తీర్పు తీరుస్తూ అవే చేస్తూ ఉన్న నీవు దేవుని తీర్పు తప్పించుకొంటానని అనుకొంటున్నావా? 4 నీవు పశ్చాత్తాపపడడానికి దేవుని దయ దారి తీస్తుందని నీకు తెలియదా? ఆయన దయాసమృద్ధినీ సహనాన్నీ ఓర్పునూ చిన్నచూపు చూస్తున్నావా? 5 దేవుని కోప దినం కోసం – ఆయన న్యాయమైన తీర్పు బయలుపడే ఆ దినం కోసం – నీ కాఠిన్యాన్నిబట్టీ పశ్చాత్తాపపడని నీ హృదయాన్ని బట్టీ నీకు నీవే దేవుని కోపాన్ని పోగు చేసుకొంటూ ఉన్నావు. 6 ఆయన ప్రతి ఒక్కరికీ వారి వారి చర్యలప్రకారం ప్రతిఫలమిస్తాడు. 7 ఓర్పుతో మేలు చేస్తూ ఉండడం వల్ల దేవుడిచ్చే మహిమనూ గౌరవాన్నీ నశించని స్థితినీ వెదికేవారికి శాశ్వత జీవాన్ని ఇస్తాడు. 8 కానీ ఎదురాడుతూ సత్యానికి లోబడకుండా దుర్మార్గానికి లొంగినవారిమీదికి కోపం, ఆగ్రహం వస్తాయి. 9 దుష్టత్వం చేసే ప్రతి ఒక్కరికి బాధ, యాతన వస్తుంది. మొదట యూదులకు, తరువాత గ్రీసుదేశస్థులకు కూడా అంతే. 10 అయితే మంచి చేసే ప్రతి ఒక్కరికీ మొదట యూదులకు, తరువాత గ్రీసు దేశస్థులకు కూడా మహిమ, గౌరవం, శాంతి కలుగుతాయి.
11 దేవునికి పక్షపాతమేమీ లేదు. 12 ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా పాపాలు చేసేవారంతా ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండానే నాశనమవుతారు. ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపాలు చేసేవారంతా ధర్మశాస్త్రం ప్రకారమే తీర్పుకు గురి అవుతారు. 13 ధర్మశాస్త్రం ఆలకించేవారు దేవుని దృష్టిలో న్యాయవంతులు కారు గాని ధర్మశాస్త్రం ప్రకారం చేసేవారే న్యాయవంతుల లెక్కలోకి వస్తారు. 14 ధర్మశాస్త్రం లేని ఇతర ప్రజలు సహజసిద్ధంగా ధర్మశాస్త్రంలోనివి చేస్తే, ధర్మశాస్త్రం లేకపోయినా తమకు తామే ధర్మశాస్త్రంలాగా ఉన్నారు. 15 వారి అంతర్వాణి సాక్ష్యం చెపుతూ, వారి తలంపులు కూడా నేరాలు మోపుతూ, లేదా నేరం లేదంటూ ఉన్నప్పుడు వారి హృదయాలమీద ధర్మశాస్త్రం రాసి ఉన్నట్టు బయలుపడుతుంది. 16 దేవుడు నా శుభవార్త ప్రకారం యేసు క్రీస్తు ద్వారా మనుషుల రహస్యమైన వాటికి తీర్పు తీర్చే రోజున అలా జరుగుతుంది.
17 చూడు, నీవు యూదుడననబడ్డవాడివి. ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవుని విషయంలో అతిశయిస్తూ ఉన్నావు. 18 దేవుని సంకల్పం తెలుసుకొని ధర్మశాస్త్రంలోని ఉపదేశం పొంది ఉత్తమమైనవాటిని మెచ్చుకొంటూ ఉన్నావు. 19 ధర్మశాస్త్రంలో జ్ఞానం సత్యాల నమూనా నీకు ఉండడంవల్ల గుడ్డివారికి దారి చూపేవాడివనీ చీకటిలో ఉండేవారికి వెలుగుగా ఉన్నావనీ 20 తెలివితక్కువవారిని సరిదిద్దేవాడివనీ చిన్నవారికి బోధకుడవనీ నీకు గట్టి నమ్మకం ఉంది.
21 అలాంటి నీవు మరొకరికి బోధిస్తూ ఉంటే నీకు నీవే బోధించుకోవా? “దొంగతనం చేయకూడదు” అని ప్రకటించే నీవే దొంగతనం చేస్తున్నావా? 22 “వ్యభిచారం చేయకూడదు” అనే నీవే వ్యభిచారం చేస్తావా? విగ్రహాలంటే అసహ్యించుకొనే నీవే గుళ్ళను దోచుకొంటున్నావా? 23 ధర్మశాస్త్రం విషయంలో అతిశయించే నీవే ధర్మశాస్త్రాన్ని మీరడంవల్ల దేవునికి అపకీర్తి కలిగిస్తున్నావా? 24 రాసి ఉన్నదాని ప్రకారమే – మిమ్ములను బట్టి ఇతర జనాలలో దేవుని పేరు దూషణకు గురి కావడం జరుగుతూ ఉంది.
25 నీవు ధర్మశాస్త్రం పాటిస్తూ ఉంటే సున్నతి ప్రయోజనకరమే, గాని ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉంటే నీవు సున్నతి పొందినా పొందనట్టే లెక్క. 26 అయితే సున్నతి పొందని వాడెవడైనా ధర్మశాస్త్రంలోని న్యాయ నిర్ణయాలను పాటిస్తూ ఉంటాడనుకో. అతడు సున్నతి లేకపోయినా ఉన్నట్టే లెక్కలోకి రాడా? 27 అంతే గాక శరీరంలో సున్నతి లేనివాడు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటే, రాసిన నియమం, సున్నతి ఉండీ ధర్మశాస్త్రాన్ని మీరుతూ ఉండే నీకు తీర్పు తీర్చడా?
28 బయటి విషయాలలో మాత్రమే యూదుడుగా ఉన్న వ్యక్తి యూదుడు కాడు. అలాగే బయట, శరీరంలో మాత్రమే ఉన్న సున్నతి సున్నతి కాదు. 29 కానీ అంతరంగంలో యూదుడై ఉన్నవాడే యూదుడు. సున్నతి కూడా అక్షరాల సున్నతి కాదు. అది హృదయ సంబంధమైనదే, దేవుని ఆత్మవల్లే జరిగేదే. అలాంటి మనిషిని మెచ్చుకొనేది మనుషులు కాదు గాని దేవుడే.