రోమ్ వారికి లేఖ
1
1 రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ✽, అంటే పవిత్రులుగా ఉండడానికి దేవుని పిలుపు అందిన వారందరికీ పౌలు✽ రాస్తున్న సంగతులు. 2 మన తండ్రి అయిన దేవునినుంచీ ప్రభువైన యేసుక్రీస్తు నుంచీ మీకు కృప, శాంతి✽ కలుగుతాయి గాక. 3 నేను యేసు క్రీస్తుకు దాసుణ్ణి✽, ఆయన రాయబారి✽గా ఉండడానికి పిలుపు అందినవాణ్ణి, దేవుని శుభవార్తకోసం ప్రత్యేకించబడ్డవాణ్ణి✽.4 ✽దేవుడు తన కుమారుడూ మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన ఈ శుభవార్త ముందుగానే ఆయన ప్రవక్తల ద్వారా పవిత్ర లేఖనాలలో వాగ్దానం చేశాడు. 5 ✽యేసు శరీర సంబంధంగానైతే దావీదు సంతానంగా జన్మించాడు. 6 దేవుని పవిత్రమైన ఆత్మ✽సంబంధంగానైతే ఆయన దేవుని కుమారుడు. ఆయన చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేవడంద్వారా ఇది బలప్రభావాలతో రుజువైంది. 7 ✽ఆయనద్వారా మేము కృప, రాయబారి పదవి పొందాం. ఆయన పేరుకోసం అన్ని జనాలలో విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశం. అలాంటివారిలో మీరూ దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందినవారై✽ ఉన్నారు.
8 ✽మీ నమ్మకాన్ని గురించి లోకమంతటా చెప్పడం జరుగుతూ ఉంది గనుక మొట్టమొదట నేను మీ అందరికోసమూ యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెపుతున్నాను. 9 నా ప్రార్థనలలో ఎల్లప్పుడూ మిమ్ములను పేర్కొంటూ, ఎలాగైనా సరే దేవుని ఇష్టప్రకారం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే✽ అవకాశం కలగాలని ఆయనను ఎప్పుడూ వేడుకొంటూ ఉన్నాను. 10 తన కుమారుని శుభవార్త విషయంలో ఆత్మపూర్వకంగా✽ నేను సేవిస్తున్న దేవుడే ఇందుకు నాకు సాక్షి. 11 మీరు స్థిరపడేందుకు ఆధ్యాత్మిక కృపావరం✽ ఏదైనా మీకు కలిగించడానికి మిమ్ములను చూడాలని ఎంతో ఆశిస్తూ ఉన్నాను. 12 ✽అంటే, మీకూ నాకూ ఉన్న అన్యోన్య విశ్వాసంవల్ల నేను మీతో కూడా ప్రోత్సాహం పొందాలని నా ఆశ. 13 సోదరులారా, మీ దగ్గరకు రావడానికి చాలా సార్లు ఉద్దేశించాను గాని ఇదివరకు నాకు ఆటంకాలు కలిగాయి. ఇది మీకు తెలియకపోవడం నాకిష్టం లేదు. ఇతర దేశాల ప్రజల మధ్యలాగే మీమధ్య కూడా ఫలభరితమైన సేవ ✽ జరిగించాలని నా ఉద్దేశం.
14 ✽నేను గ్రీసు దేశస్థులకూ ఇతర జాతులవారికీ, తెలివైనవారికీ తెలివితక్కువవారికీ రుణస్థుణ్ణి. 15 ✽అందుచేత నా మట్టుకు నేను రోమ్‌లో ఉన్న మీకు కూడా శుభవార్త ప్రకటించడానికి సిద్ధంగానే ఉన్నాను.
16 ✽క్రీస్తు శుభవార్తను గురించి నాకు సిగ్గు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే, నమ్మే ప్రతి ఒక్కరికీ – మొదట యూదులకు✽, తరువాత ఇతర ప్రజలకు కూడా – అది పాప విముక్తి, రక్షణ కోసం దేవుని బలప్రభావాలు. 17 ఎందుకంటే, అందులో దేవుని న్యాయం✽ విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడి అయింది✽. దీనికి సమ్మతంగా ఇలా రాసి ఉంది: “న్యాయవంతుడు దేవునిమీది తన నమ్మకంవల్లే జీవిస్తాడు.”
18 దుర్మార్గంచేత సత్యాన్ని అణచివేసే✽ మనుషుల సమస్త భక్తిహీనత మీదా దుర్మార్గం మీదా దేవుని కోపం✽ కూడా పరలోకంనుంచి వెల్లడి అయింది✽. 19 ✽ఎందుకంటే, దేవుని విషయం తెలిసిన సంగతులు వారిలో దృష్టిగోచరమైనవి ఉన్నాయి. దేవుడు తానే వారికి స్పష్టం చేశారు. 20 ఏలాగంటే లోకసృష్టి ఆరంభంనుంచి కంటికి కనబడని ఆయన లక్షణాలు – ఆయన శాశ్వత బలప్రభావాలు, దేవత్వం స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అవి నిర్మాణమైనవాటి వల్ల తెలిసిపోతూ వున్నాయి. అందుచేత వారు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
21 ✽ఎందుకంటే, వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుడుగా ఆయనను మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞత చెప్పలేదు. అంతేగాక వారి తలంపులు వ్యర్థమైపోయాయి. వారి తెలివితక్కువ హృదయాలు చీకటిమయమయ్యాయి. 22 ✽తాము జ్ఞానులమని చెప్పుకొంటూ బుద్ధిలేనివారయ్యారు. 23 ✝ఎన్నడూ నాశనం కానివాడైన దేవుని మహిమకు బదులుగా నాశనం అయ్యే మనుషుల విగ్రహాలనూ పక్షుల, నాలుగు కాళ్ళున్న మృగాల, ప్రాకే ప్రాణుల విగ్రహాలను కూడా పెట్టుకొన్నారు.
24 ✽ ఆ కారణంచేత దేవుడు వారి హృదయంలోని చెడ్డ కోరికలతోపాటు వారిని కల్మషానికి పరస్పరంగా తమ శరీరాలను అవమానపరచడానికి అప్పగించాడు. 25 ✽వారు దేవుని సత్యానికి బదులు అబద్ధాన్ని పెట్టుకొని సృష్టికర్తకు మారుగా సృష్టిలోనివాటినే పూజించారు, సేవించారు. ఆయనే శాశ్వతంగా స్తుతిపాత్రుడు. తథాస్తు!
26 ✽ఆ కారణంచేత దేవుడు వారిని నీచమైన ఆశలకు అప్పగించాడు. వారి స్త్రీలు సహా సహజ సంబంధం మానుకొని అసహజ సంబంధం ఎన్నుకొన్నారు. 27 అలాగే పురుషులు కూడా స్త్రీలతో సహజ సంబంధం మానుకొని ఒకణ్ణి ఒకడు మోహించుకొని కామాగ్నిలో మాడిపోయారు. మగవారు మగవారితో అసహ్యమైనది చేశారు. తమ తప్పిదానికి తగిన ప్రతిఫలం తమ లోపల పొందారు కూడా.
28 ✽దేవుణ్ణి తమ ఎరుకలో ఉంచుకోవడమంటే వారికి ఇష్టంగా లేదు గనుక చేయరానివి చేయించే పాడు మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. 29 ✽వారిలో అన్ని రకాల దుర్మార్గత, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారిని నింపివేశాయి. 30 వారు కొండెగాళ్ళు, అపనిందలు వేసేవారు, దేవుడంటే ద్వేషం✽ ఉన్నవారు, అపకారులు, గర్విష్ఠులు, బడాయికోరులు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట విననివారు, 31 తెలివితక్కువ వారు, మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించనివారు, దయ చూపనివారు. 32 ✽ఇలాంటి వాటిని చేస్తూ ఉండేవారు మరణానికి తగినవారనే దేవుని న్యాయనిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా వాటిని చేస్తూ ఉన్నవారిని మెచ్చుకొంటారు.