27
1 మేము ఇటలీకి ఓడ ప్రయాణం చేయాలని నిర్ణయం అయింది. వారు పౌలునూ మరికొందరు ఖైదీలనూ జూలియస్ అనే శతాధిపతికి అప్పచెప్పారు. అతడు “అగస్తస్ పటాలం”లో ఉండేవాడు. 2 మేము ఆసియా రాష్ట్రం ఒడ్డువెంట ప్రయాణం చేయాలని అద్రముత్తియ రేవుకు చెందిన ఓడ ఎక్కి బయలు దేరాం. మాసిదోనియలోని తెస్సలొనీక పట్టణస్థుడైన అరిస్తార్కస్ మాతో కూడా ఉన్నాడు.
3 మరునాడు సీదోనుకు చేరుకొన్నాం. పౌలు స్నేహితులు అతని అక్కరలను తీర్చేలా వారి దగ్గరకు వెళ్ళడానికి జూలియస్ అతనిమీద దయ చూపి సెలవిచ్చాడు. 4 అక్కడనుంచి ఓడలో బయలుదేరిన తరువాత ఎదురు గాలి కావడంచేత సైప్రస్ ద్వీపం చాటు ప్రయాణం సాగించాం. 5 కిలికియ, పంఫూలియ రాష్ట్రాల దగ్గర ఉన్న సముద్రం దాటి లుకియలోని మురకు చేరుకొన్నాం. 6 అక్కడ అలెగ్జాండ్రియ నగరానికి చెందిన ఓడ ఇటలీకి వెళ్ళనై ఉంటే శతాధిపతి దానిని చూచి మమ్ములను అందులో ఎక్కించాడు. 7 అనేక రోజులపాటు మాకు ప్రయాణం మెల్లగా సాగింది. కష్టంమీద ఓడ కనీదుకు ఎదురుగా చేరింది గాని గాలి మమ్ములను ఆ వైపుకు వెళ్ళనివ్వలేదు గనుక క్రేతు ద్వీపం చాటున సల్మోనేకు ఎదురుగా ప్రయాణం చేశాం. 8 కష్టంతో దానిని దాటి “అందాల రేవులు” అనే చోటుకు చేరుకొన్నాం. దాని దగ్గర లసైయ అనే పట్టణం ఉంది.
9 ఆ విధంగా చాలా కాలం గడిచింది. యూదుల ఉపవాస కాలం కూడా దాటిపోయింది. అప్పుడు ఓడ ప్రయాణం ప్రమాదకరమైందన్నమాట. గనుక పౌలు వారికి ఇలా సలహా ఇచ్చాడు: 10 “అయ్యలారా, ఈ ప్రయాణంవల్ల సరుకులకూ ఓడకూ మాత్రమే గాక మన ప్రాణాలకు కూడా హాని, గొప్ప నష్టం కలుగుతాయని చూస్తున్నాను.”
11 అయినా శతాధిపతి మీద పౌలు చెప్పినదానికంటే నావికుడూ ఓడ యజమాని చెప్పినది ఎక్కువ ప్రభావితం చేసింది. 12 చలికాలానికి ఆ రేవు అనుకూలమైనది కాదు గనుక అక్కడనుంచి బయలుదేరి, ఒకవేళ సాధ్యమైతే ఫీనిక్సు చేరి అక్కడ చలికాలం గడపాలని ఎక్కువమంది సలహా ఇచ్చారు. ఫీనిక్సు క్రేతులో నైరుతి, వాయువ్య దిశగా ఉన్న రేవు.
13 అప్పుడు దక్షిణ దిక్కునుంచి పిల్లగాలులు వీచడం మొదలు పెట్టడంతో వారు తమ ఉద్దేశం నెరవేరుతుంది అనుకొన్నారు గనుక లంగరు ఎత్తి క్రేతు ఒడ్డు వెంట ఓడ నడిపారు. 14 అయితే కొంచెం సేపటికి తుఫాను గాలి ఎదురుగా కొట్టింది. దానిని ఊరొక్లైదోన్ అంటారు. 15 దానిలో ఓడ చిక్కుకొని ఎదురు గాలికి నడవలేకపోయింది గనుక దాన్ని గాలివాటున కొట్టుకుపోనిచ్చాం. 16 తరువాత క్లౌద అనే చిన్న లంక చాటున దాటి పోతూ ఉంటే ఓడకు చెందిన పడవను కష్టంతో భద్రం చేసుకొన్నాం. 17 దానిని ఓడ మీదికి ఎక్కించిన తరువాత వారు ఓడ చుట్టూ త్రాళ్ళు బిగించి కట్టారు. ఓడ సూర్తిస్ అనే ఇసుక తిప్పల మీద పడుతుందేమోనని భయపడి తెరచాపలు దింపివేసి అలాగే కొట్టుకుపోయారు. 18 తుఫాను వడిగా కొడుతూ ఉన్నందుచేత మరుసటి రోజు వారు సరుకులు పారవేసి ఓడ తేలిక చేశారు. 19 మూడో రోజున మేము మా సొంత చేతులతో ఓడ సామాగ్రి పారవేశాం. 20 అనేక రోజులపాటు ప్రొద్దు గానీ చుక్కలు గానీ కనిపించలేదు, తుఫాను మామీద తీవ్రంగా కొడుతూ ఉంది గనుక మాకు రక్షణ కలుగుతుందనే ఆశాభావం కూడా చివరికి వదులుకొన్నాం.
21 వారు చాలా కాలం భోజనం చేయకుండా ఉన్నారు గనుక పౌలు వారి మధ్య నిలిచి ఇలా అన్నాడు: “అయ్యలారా! మీరు నా మాట విని క్రేతునుంచి బయలుదేరకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే ఈ సంకటం, నష్టం కలిగేవి కావు. 22 ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండని మిమ్ముల్ని వేడుకొంటున్నాను. మీలో ఎవరికీ ప్రాణనష్టం కలగదు. ఓడకే నష్టం కలుగుతుంది. 23 నేను ఏ దేవునికి చెంది సేవ చేస్తూ ఉన్నానో ఆ దేవుని దూత ఒకడు గడిచిన రాత్రి నా దగ్గర నిలబడి చెప్పినదేమిటంటే, 24 ‘పౌలూ, నిర్భయంగా ఉండు. నిన్ను సీజర్ ముందుకు తీసుకుపోవడం తప్పనిసరి. ఇదిగో విను, నీతో కూడా ఓడ ప్రయాణం చేస్తున్నవారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు.’ 25 కాబట్టి, అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. ఆయన నాతో చెప్పినట్టే జరుగుతుందని దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాను. 26 అయినా మన ఓడ కొట్టుకుపోయి ఒక లంక ఒడ్డు మీద పడి తీరాలి.”
27 పద్నాలుగో రాత్రి వచ్చింది. మేము అద్రియ సముద్రంలో అటూ ఇటూ కొట్టుకుపోతూ ఉంటే మధ్యరాత్రి వేళ ఏదో దేశం దగ్గరపడుతున్నట్టు ఓడవారికి అనిపించింది. 28 గుండు వేసి చూచి ముప్ఫయి ఏడు మీటర్ల లోతని వారు తెలుసుకొన్నారు. ఇంకా కొంత దూరం తరువాత మళ్ళీ గుండు వేసి చూస్తే పదిహేను మీటర్ల లోతని తెలిసింది. 29 అప్పుడు, రాతి తిప్పలమీద పడుతామేమో అనే భయంచేత వారు ఓడ వెనుక భాగంనుంచి నాలుగు లంగరులు వేసి, పగలు రావాలని ప్రార్థించారు. 30 ఓడవారు ఓడ విడిచి వెళ్ళాలని చూచి ముందు భాగం నుంచి లంగరులు వేయబోతున్నట్లు నటించి పడవను సముద్రంలో దింపివేస్తూ ఉంటే 31 పౌలు శతాధిపతితోను, సైనికులతోను “వీరు ఓడలో ఉంటేనే తప్ప మీరు తప్పించుకోలేరు” అన్నాడు. 32 వెంటనే సైనికులు పడవ త్రాళ్ళు కోసి దానిని పడి పోనిచ్చారు.
33 తెల్లవారబోతూ ఉన్నప్పుడు భోజనం చేయాలని పౌలు అందరిని ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు: “పద్నాలుగు రోజులపాటు ఏమీ తినక పస్తులుంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. 34 భోజనం చేయండని మిమ్మల్ని వేడుకొంటున్నాను. అది మీ సంరక్షణ కోసమే. మీలో ఎవరికీ ఒక్క తలవెంట్రుక కూడా రాలదు.”
35 ఇలా చెప్పి అతడు రొట్టె చేతపట్టుకొని అందరి ఎదుటా దేవునికి కృతజ్ఞత చెప్పి దానిని విరిచి తినసాగాడు. 36 అప్పుడు వారంతా ధైర్యం తెచ్చుకొని భోజనం చేశారు. 37 ఓడలో ఉన్నవారందరమూ రెండు వందల డెబ్భై ఆరుగురం. 38 వారు తృప్తిగా తిన్న తరువాత గోధుమలు సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేశారు.
39 తెల్లవారినప్పుడు వారు ఆ దేశాన్ని చూచి గుర్తుపట్టలేదు గాని అఖాతం, దాని తీరం వారికి కనిపించాయి గనుక సాధ్యమైతే ఒడ్డుమీదికి ఓడను చేర్చాలని నిశ్చయించుకొన్నారు. 40 త్రాళ్ళు కోసి లంగరులు సముద్రంలో పడనిచ్చి, చుక్కానుల కట్లు విప్పి, ముందటి తెరచాప గాలికెత్తి ఒడ్డుకు ఓడను నడిపారు. 41 అయితే రెండు ప్రవాహాలు కలిసిన స్థలంలో చిక్కుకొని ఓడను మెట్ట పట్టించారు. ఓడ ముందుభాగం దానిలో కూరుకుపోయి కదలలేక ఉంది, వెనుకభాగం అలల బలానికి బ్రద్దలైపోతూ ఉంది.
42 ఖైదీలలో ఎవడూ ఈదుకొని తప్పించుకోకుండా వారిని చంపాలని సైనికుల ఆలోచన. 43 అయితే పౌలును రక్షించాలనే ఉద్దేశంతో శతాధిపతి వారి ఆలోచనను భంగపరచాడు. ఈత వచ్చినవారు మొదట సముద్రంలో దూకి ఒడ్డుకు వెళ్ళాలనీ 44 మిగిలినవారు పలకలమీదో ఓడ చెక్కలమీదో వెళ్ళాలనీ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ విధంగా అందరూ తప్పించుకొని ఒడ్డుకు చేరుకొన్నారు.