26
1 అప్పుడు అగ్రిప్ప పౌలుతో “సంజాయిషీ చెప్పుకోవడానికి నీకు సెలవైంది” అన్నాడు. అప్పుడు చేయి చాచి పౌలు ఇలా సమాధానం చెప్పసాగాడు: 2 “అగ్రిప్పరాజా, యూదులలో ఉన్న ఆచారాలూ వివాదాలూ అన్నిటిలో మీరు నిపుణులు. 3 కనుక యూదులు నా మీద మోపిన నేరాలన్నిటిని గురించి ఈవేళ విశేషంగా మీ ఎదుట సమాధానం చెప్పుకోబోతూ ఉన్నందుచేత భాగ్యశాలిని అనుకొంటున్నాను. నేను చెప్పేది ఓపికతో వినాలని మిమ్ములను వేడుకొంటున్నాను.
4 “నా స్వప్రజల మధ్య, జెరుసలంలో, నా యువదశ నుంచి నా జీవిత విధానం ఎలాంటిదో యూదులందరికీ తెలుసు. 5 మొదటినుంచి నన్ను ఎరిగినవారు కావడంచేత వారు సాక్ష్యం చెప్పాలనుకొంటే, మన మతంలోని తెగలన్నిటిలో ఎక్కువ నిష్ఠానియమాలున్న తెగప్రకారం నేను పరిసయ్యుడుగా జీవించానని చెప్పగలరు. 6 ఇప్పుడైతే దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దానం మీద నాకున్న ఆశాభావాన్ని బట్టి నేనిక్కడ నిలుచుండి ఈ విచారణకు గురి అయ్యాను. 7 వాగ్దానం నెరవేర్పు అనుభవించాలని మన పన్నెండు గోత్రాలవారు ఆశతో ఎదురు చూస్తూ మనస్ఫూర్తిగా రాత్రింబగళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అగ్రిప్ప రాజా! యూదులు నా మీద నేరం మోపేది ఈ ఆశాభావం విషయమే! 8 దేవుడు చనిపోయినవారిని సజీవంగా లేపుతాడనే సంగతి నమ్మరానిదని మీరు ఎందుకు భావించుకొంటున్నారు?
9  “ఒకప్పుడు నజరేతువాడైన యేసు పేరుకు వ్యతిరేకంగా నేను అనేక క్రియాకలాపాలు చేయాలి అనుకొన్నాను. 10 జెరుసలంలో అలాగే చేశాను కూడా. ప్రధాన యాజులు నాకిచ్చిన అధికారంతో చాలామంది పవిత్రులను చెరసాలలో వేయించాను, వారిని చంపడం జరిగితే దానికి కూడా సమ్మతించాను. 11 యూద సమాజ కేంద్రాలన్నిటిలో తరచుగా వారిని దండిస్తూ వారిచేత బలవంతంగా దూషణ చేయించాను. వారిమీద ఎంతో ఆగ్రహంతో మండిపడుతూ విదేశీ పట్టణాలకు కూడా వెళ్ళి వారిని హింసిస్తూ వచ్చాను.
12 “ఈ పనిమీద నేను ప్రధానయాజుల చేత అధికారం, ఆజ్ఞ పొంది దమస్కుకు ప్రయాణం కట్టాను. 13 రాజా, మధ్యాహ్న కాలంలో నేను దారిన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నా చుట్టూ, నాతోకూడా ఉన్నవారి చుట్టూ సూర్యకాంతి కంటే దేదీప్యమానమైన వెలుగు ఆకాశం నుంచి ప్రకాశించడం చూశాను. 14 మేమంతా నేలమీద పడ్డాం. అప్పుడు హీబ్రూ భాషలో ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం నాకు వినిపించింది: ‘సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు? ములుకోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం.’
15 “నేను, ‘ప్రభూ! మీరెవరు!’ అని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నాడు: ‘నీవు హింసిస్తూ ఉన్న యేసునే నేను. 16 లేచి నిలబడు. నేను నీకు కనబడే కారణమేమంటే, నీవు చూచిన సంగతులను గురించీ, నేనింకా నీకు వెల్లడి చేయబోయే సంగతులను గురించీ నిన్ను పరిచారకుడుగా సాక్షిగా నియమిస్తున్నాను. 17 నిన్ను యూదప్రజల చేతినుంచీ ఇతర ప్రజల చేతినుంచీ విడిపిస్తాను. 18 వారు చీకటిలోనుంచి వెలుగులోకీ, సైతాను అధికారం క్రిందనుంచి దేవునివైపుకు తిరిగేలా వారి కళ్ళు తెరవడానికీ ఇప్పుడు నిన్ను వారి దగ్గరకు పంపుతున్నాను. వారికి పాపక్షమాపణ కలగాలనీ, నామీద ఉంచిన నమ్మకంచేత పవిత్రం అయినవారిలో వారికి వారసత్వం లభించాలనీ నా ఉద్దేశం.’
19 “అందుచేత, అగ్రిప్పరాజా, పరలోక సంబంధమైన ఆ దర్శనానికి నేను అవిధేయుణ్ణి కాలేదు. 20  మొదట దమస్కులో ఉన్నవారికి, తరువాత జెరుసలంలో, యూదయ ప్రాంత మంతటిలో ఉన్నవారికి, యూదేతరులకు కూడా ప్రకటిస్తూ వారు పశ్చాత్తాపపడి దేవునివైపు తిరగాలనీ, పశ్చాత్తాపానికి తగిన పనులు చేయాలనీ చెపుతూ ఉన్నాను. 21 ఈ కారణాలనుబట్టి యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేశారు.
22 “అయినా దేవుని తోడ్పాటు పొంది నేటివరకూ నిలుచుండి అల్పులకూ ఘనులకూ సాక్ష్యం చెపుతూ ఉన్నాను. మోషే, ప్రవక్తలు ఏమేమి జరుగుతాయని చెప్పారో అవి గాక నేను మరేమీ చెప్పడం లేదు. 23 అవేమిటంటే, క్రీస్తు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుంచి లేచినవారిలో మొదటివాడై ఈ ప్రజకూ ఇతర ప్రజలకూ వెలుగును ప్రకటిస్తాడని.”
24 అతడు ఇలా సమాధానం చెప్పుకొంటూ ఉన్నప్పుడే ఫేస్తస్ “పౌలు! నీకు మతి తప్పింది! అతి విద్య నిన్ను వెర్రివాణ్ణిగా చేస్తున్నది” అని పెద్ద స్వరంతో చెప్పాడు.
25 అందుకు పౌలు “మహా ఘనులైన ఫేస్తస్‌గారు, వెర్రివాణ్ణి కాను. నేను చెప్పే మాటలు స్థిర బుద్ధికి అనుగుణమైన సత్యాలే. 26 రాజుకు ఈ సంగతులు తెలుసు గనుక వారి ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ విషయాలలో వారు గుర్తించనిది ఏదీ లేదని నమ్ముతున్నాను. ఇదంతా మారుమూలలో జరిగినది కాదు. 27 అగ్రిప్పరాజా! ప్రవక్తల మాటల మీద మీకు నమ్మకం ఉన్నదా? మీకున్నదని నాకు తెలుసు” అన్నాడు.
28 అందుకు అగ్రిప్ప “నేను క్రైస్తవుడుగా అయ్యేందుకు కొద్ది కాలంలో నన్ను నచ్చచెపుతున్నావు” అని పౌలుతో చెప్పాడు.
29 పౌలు “కొద్ది కాలంలోనో చాలా కాలంలోనో మీరే కాదు, ఈవేళ నా మాటలు వింటున్నవారంతా, ఈ సంకెళ్ళు తప్ప, నాలాగే కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అన్నాడు.
30 అతడు ఈ మాటలు చెప్పిన తరువాత రాజు, పాలకుడు, బెర్నీకే, వారితో కూర్చుని ఉన్నవారు లేచి అవతలకు వెళ్ళి 31 తమలో తాము మాట్లాడుకొంటూ “ఆ మనిషి మరణానికి గానీ ఖైదుకు గానీ తగిన పని ఏదీ చేయడంలేదు” అన్నారు. 32 అగ్రిప్ప ఫేస్తస్‌తో “చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననకపోతే ఈ మనిషిని విడుదల చేయడం వీలై ఉండేది” అన్నాడు.