25
1 ✽ఫేస్తస్ ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజులకు సీజరియనుంచి జెరుసలంకు వెళ్ళాడు. 2 అక్కడ ప్రముఖయాజీ యూదులలో ముఖ్యులూ పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు విషయం అతనికి తెలియజేసి, 3 ✝“దయ ఉంచి అతణ్ణి జెరుసలంకు పిలవనంపించండి” అని అతణ్ణి గురించి మనవి చేసి ఫేస్తస్‌ను ప్రాధేయ పడ్డారు. త్రోవలో పౌలును చంపడానికి వారు మాటులో ఉంటారని వారి కుట్ర.4 అయితే ఫేస్తస్ పౌలు సీజరియలో కావలిలో ఉంచబడాలనీ తాను త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నానని జవాబిచ్చాడు. 5 “కనుక మీ నాయకులు నాతో కూడా రావచ్చు. ఆ మనిషి ఏ విషయంలో అయినా దోషి అయితే అతనిమీద నేరారోపణ చేయవచ్చు” అన్నాడు.
6 వారి మధ్య పది రోజులకంటే ఎక్కువ కాలం గడిపి అతడు సీజరియకు వెళ్ళాడు. మరునాడు న్యాయపీఠం మీద కూర్చుని పౌలును రప్పించమని ఆజ్ఞ జారీ చేశాడు. 7 ✝అతడు వచ్చిన తరువాత, జెరుసలం నుంచి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలుచుండి పౌలుమీద అనేక తీవ్ర నేరాలు మోపారు గాని వాటిని రుజువు చేయలేకపోయారు.
8 అందుకు పౌలు “యూదుల ధర్మశాస్త్రానికి గానీ దేవాలయానికి గానీ చక్రవర్తికి గానీ వ్యతిరేకంగా నేను తప్పిదమేమీ చేయలేదు” అని సమాధానం చెప్పుకొన్నాడు.
9 అయితే ఫేస్తస్ యూదులకు దయ చూపాలని పౌలుకు జవాబిస్తూ ఇలా అన్నాడు: “జెరుసలంకు వెళ్ళి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విచారణకు నిలబడడానికి సమ్మతిస్తావా?”
10 ✽అందుకు పౌలు ఇలా అన్నాడు: “చక్రవర్తికి చెందిన న్యాయపీఠం ముందు నిలుచున్నాను. నాకు విచారణ జరగవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని మీకు బాగా తెలుసు. 11 ✽ఒకవేళ నేను అక్రమస్థుణ్ణయి మరణానికి తగినదేదైనా చేసి ఉంటే మరణించడానికి వెనుకంజ వేయను. కానీ వీరు నామీద మోపే నేరాలు వట్టివైతే నన్ను వీరి చేతికి అప్పగించే అధికారం ఎవరికీ లేదు. చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటాను.”
12 అప్పుడు ఫేస్తస్ తన సలహాదారులతో ఆలోచన చేసి “చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటాను అన్నావా? అలాగే, చక్రవర్తి దగ్గరికే వెళ్ళిపోతావు” అని జవాబిచ్చాడు.
13 కొన్ని రోజులు గడిచిన తరువాత ఫేస్తస్‌ను దర్శించడానికి రాజైన అగ్రిప్ప✽ బెర్నీకేతోపాటు సీజరియకు వచ్చాడు. 14 వారు అక్కడ చాలా రోజులు ఉండిపోయారు. అప్పుడు ఫేస్తస్ పౌలు సంగతి రాజుకు ఈ విధంగా తెలియజేశాడు: “ఫేలిక్స్ విడిచి పెట్టిపోయిన ఖైదీ ఒకడు ఇక్కడ ఉన్నాడు. 15 నేను జెరుసలంలో ఉన్నప్పుడు ప్రధానయాజులూ యూదుల పెద్దలూ అతడి విషయం తెలియజేస్తూ నేను అతడికి శిక్ష విధించాలని కోరారు. 16 వారికి నేనిచ్చిన జవాబేమిటంటే, ‘ముద్దాయి ఎవరైనా సరే తనమీద నేరం మోపిన వారికి ముఖా ముఖిగా నిలబడి తన మీద మోపిన నేరాన్ని గురించి సంజాయిషీ చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతకుముందు అతణ్ణి నాశనానికి అప్పగించడం రోమ్వారి విధానం కాదు.’
17 “వారు ఇక్కడ సమకూడినప్పుడు నేనేమీ ఆలస్యం చేయలేదు. మరునాడే న్యాయపీఠంమీద కూర్చుని ఆ మనిషిని తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. 18 నేరం మోపినవారు నిలబడ్డప్పుడు నేననుకొన్న నేరాలలో ఒక్కటి కూడా అతనిమీద మోపారు కారు. 19 ✽అయితే తమ మతం గురించి, చనిపోయిన యేసు అనే వ్యక్తిని గురించి మాత్రమే అతనితో వారికి కొన్ని వివాదాలున్నాయి. ఆ యేసు బతికి ఉన్నాడని పౌలు చెప్పాడు. 20 అలాంటి వివాదాల గురించి నాకు అనుమానంగా ఉంది గనుక జెరుసలంకు వెళ్ళి అక్కడ ఈ సంగతులను గురించి విచారణకు గురి కావడానికి అతనికి సమ్మతి ఉందో లేదో అని అతణ్ణి అడిగాను. 21 అయితే చక్రవర్తి ఎదుట తీర్పు జరిగేంతవరకు తనను కావలిలో ఉంచాలని పౌలు చెప్పుకొన్నాడు గనుక నేనతణ్ణి సీజర్ దగ్గరికి పంపేవరకు కావలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాను.”
22 అప్పుడు అగ్రిప్ప “ఆ మనిషి చెప్పేది నాక్కూడా వినాలని ఉంది” అని ఫేస్తస్‌తో అన్నాడు. అందుకతడు “రేపు వింటారు” అన్నాడు.
23 ఆ మరునాడే అగ్రిప్ప, బెర్నీకే గొప్ప ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతో నగర ప్రముఖులతో సభామంటపంలో ప్రవేశించారు. ఫేస్తస్ ఆజ్ఞ ఇయ్యగా పౌలును లోపలికి తేవడం జరిగింది.
24 ✝అప్పుడు ఫేస్తస్ అన్నాడు “అగ్రిప్పరాజా! ఇక్కడ మాతో ఉన్నవారలారా! మీరంతా ఈ మనిషిని చూస్తూ ఉన్నారు. జెరుసలంలోనూ ఇక్కడ కూడా యూదులంతా ఇతడు ఇక బతకతగడని కేకలు వేస్తూ అతని గురించి నాతో మనవి చేశారు. 25 అయితే ఇతడు మరణ శిక్షకు తగినది ఏదీ చేయలేదని గ్రహించాను. చక్రవర్తి ఎదుటే చెప్పుకొంటానని ఇతడు చెప్పినందుచేత ఇతణ్ణి పంపాలని నిర్ణయానికి వచ్చాను. 26 అయినా నేను నా ఏలినవారికి రాయడానికి ఇతని గురించి నిశ్చయమైనది ఏదీ లేదు. కాబట్టి, ఈ విచారణ ఫలితంగా రాయగలిగేదేదైనా దొరకవచ్చునని మీ అందరి ఎదుటికీ, ముఖ్యంగా, అగ్రిప్పరాజా, మీ ఎదుటికి ఇతణ్ణి రప్పించాను. 27 ఖైదీమీద మోపిన నేరాలేవో సూచించక, అతణ్ణి అలాగే పంపడం తెలివి లేని పని అని నాకు తోస్తుంది.”