24
1 ✝అయిదు రోజులైన తరువాత ప్రముఖయాజి అననీయ, పెద్దలు, తెర్తుల్లస్ అనే వక్త సీజరియకు వచ్చి పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు పాలకుడికి తెలియజేశారు. 2 తెర్తుల్లస్‌ను మాట్లాడమని పిలవగా అతడు నిందారోపణ చేయడం మొదలుపెట్టి ఇలా అన్నాడు: “మహా ఘనులైన ఫేలిక్స్‌గారు, మీవల్ల మేము ఎంతో నెమ్మది అనుభవిస్తూ ఉన్నామనీ మీ దూరదృష్టివల్ల ఈ దేశ ప్రజలకు సౌభాగ్యం కలుగుతూ ఉందనీ 3 మేము అన్ని విధాలుగా అన్ని స్థలాలలో సంపూర్ణ కృతజ్ఞతతో ఒప్పుకొంటూ ఉన్నాం. 4 మీకు ఎక్కువ ఆయాసం కలిగించకుండా మేము చెప్పే కొన్ని మాటలు మీరు దయ చూపి వినాలని మిమ్ములను ప్రాధేయపడుతున్నాను.5 “మేము కనిపెట్టినదేమిటంటే, ఈ మనిషి చీడ పురుగులాంటివాడు✽, లోకమంతటా యూదులందరినీ కలహానికి రేపేవాడు, నజరేయుల మతశాఖ✽కు నాయకుడు. 6 ఇంతేగాక, దేవాలయాన్ని అపవిత్రం చేయడానికి పూనుకొన్నాడు. మేము వాణ్ణి పట్టుకొన్నాం. 7 మా ధర్మశాస్త్రం ప్రకారం వాడికి తీర్పు తీర్చాలని ఆశించాం గాని సహస్రాధిపతి లూసియస్ వచ్చి చాలా బలాత్కారంతో మా చేతులలోనుంచి వాణ్ణి తీసుకుపోయి 8 వాడిమీద నేరం మోపేవారిని మీ దగ్గరకు రావాలని ఆజ్ఞ జారీ చేశాడు. మీరు వాణ్ణి విచారణ చేయడం మూలాన మేము వాడిమీద మోపే నేరాలన్నీ మీకే తెలుస్తాయి.”
9 అతనితో యూదులు సమ్మతిస్తూ ఈ మాటలు నిజమే అన్నారు.
10 అప్పుడు మాట్లాడుమని పాలకుడు పౌలుకు సైగ చేశాడు గనుక అతడు ఇలా జవాబిచ్చాడు: “అనేక సంవత్సరాలనుంచి మీరు ఈ దేశ ప్రజలకు న్యాయమూర్తులని నాకు తెలుసు గనుక నేను మరెక్కువ సంతోషంతో సంజాయిషీ చెప్పుకొంటున్నాను. 11 ఆరాధనకోసం నేను జెరుసలం వెళ్ళి పన్నెండు రోజులు మాత్రమే అయిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు. 12 దేవాలయంలో గానీ యూద సమాజకేంద్రాలలో గానీ నగరంలో గానీ ఎవరితోనైనా నేను వాదించడం, ప్రజలమధ్య అల్లరి రేపడం వీరు చూడలేదు. 13 వీరు ఇప్పుడు నా మీద మోపే నేరాలను రుజువు చేయలేరు.
14 “అయితే మీ ఎదుట ఒక సంగతి ఒప్పుకొంటున్నాను – వీరు మతశాఖ అని చెప్పే ఈ మార్గం✽ ప్రకారం మా పూర్వీకుల దేవునికి సేవ చేస్తున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల లేఖనాలలో రాసి ఉన్నదంతా నమ్ముతూ ఉన్నాను. 15 చనిపోయిన న్యాయవంతులేమీ దుర్మార్గులేమీ లేస్తారని✽ వీరికి✽ ఆశాభావం ఉన్నట్టే దేవుని మూలంగా నాకూ ఉంది. 16 ✝ఇందుచేత దేవుని ఎదుట, మనుషుల ఎదుట నాకు నిందారహితమైన అంతర్వాణి ఎప్పుడూ ఉండేలా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
17 ✝“నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలయిన తరువాత నా స్వప్రజలకు దానధర్మాలు, కానుకలు తేవడానికి వచ్చాను. 18 ✝ఈ సందర్భంలో శుద్ధి చేసుకొని దేవాలయంలో ఉంటే ఆసియానుంచి వచ్చిన యూదులు కొందరు నన్ను చూశారు. నాతో గుంపు లేదు, అల్లరీ లేదు. 19 నన్ను గురించి ప్రతికూలమైనది ఏదైనా వారికి ఉంటే వారే నా మీద నేరం మోపడానికి మీ ఎదుట ఉండి ఉండాలి. 20 ✝పోనీ, నేను యూద సమాలోచన సభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏమైన నేరం వారికి కనిపించి ఉంటే ఇక్కడున్న వీరైనా చెప్పాలి. 21 వీరికి నేరంగా అనిపించినది ఈ ఒకే విషయం కావచ్చు: నేను వారిమధ్య నిలుచుండి బిగ్గరగా ఇలా అన్నాను: ‘చనిపోయిన వారు సజీవంగా లేవడం గురించి ఈవేళ మీ ఎదుట విచారణకు గురి అయ్యాను’.”
22 ✽ఈ మార్గాన్ని గురించి ఫేలిక్స్‌కు బాగా తెలుసు గనుక “సహస్రాధిపతి అయిన లూసియస్ వచ్చాక మీ సంగతిని నిర్ణయిస్తాను” అని చెప్పి తీర్పు వాయిదా వేశాడు. 23 పౌలుకు కొంత స్వేచ్ఛ ఇస్తూ అతణ్ణి కావలిలో ఉంచాలనీ స్నేహితులెవరైనా అతని అక్కరలను తీర్చకుండా అతణ్ణి దర్శించకుండా అడ్డగించకూడదనీ శతాధిపతికి ఆజ్ఞ జారీ చేశాడు.
24 ✽కొన్ని రోజులయిన తరువాత ఫేలిక్స్ ద్రుసిల్ల అనే తన భార్యతో కూడా వచ్చాడు. ఆమె యూదురాలు. ఫేలిక్స్ పౌలును పిలిపించి అతడు క్రీస్తు మీది నమ్మకాన్ని గురించి చెప్పినది విన్నాడు. 25 ✽అతడు న్యాయం, ఆశానిగ్రహం, భవిష్యత్తులో జరిగే దేవుని తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటే, ఫేలిక్స్ భయకంపితుడై, “ఇప్పటికి వెళ్ళు. నాకు వీలైనప్పుడు నిన్ను పిలవనంపిస్తాను” అన్నాడు. 26 ✽తాను పౌలును విడుదల చేయడానికి అతడు తనకు డబ్బు ఇస్తాడేమో అని ఆశిస్తూ పదేపదే అతణ్ణి పిలిపించి అతనితో సంభాషించాడు. 27 ✽రెండు సంవత్సరాలు గడిచిన తరువాత ఫేలిక్స్ స్థానానికి పోర్కియస్ ఫేస్తస్ వచ్చాడు. అప్పుడు ఫేలిక్స్ యూదులకు దయ చూపాలని పౌలును ఖైదీగానే ఉంచి వెళ్ళిపోయాడు.