23
1 పౌలు ఆ సమాలోచన సభవైపు తేరి చూస్తూ “అయ్యలారా, సోదరులారా, నేను నేటివరకు దేవుని ఎదుట పూర్తిగా మంచి అంతర్వాణితో బ్రతికాను” అన్నాడు.
2 అందుకు ప్రముఖయాజి అననీయ “వాడి నోటిమీద కొట్టండి” అని అతని దగ్గర నిలుచున్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు. 3 పౌలు అతనితో “వెల్ల వేసిన గోడా! దేవుడే నిన్ను కొడతాడు. ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చుని ఉండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నన్ను కొట్టాలని ఆజ్ఞ ఇస్తున్నావా?” అన్నాడు.
4 దగ్గర నిలుచున్నవారు “దేవుని ప్రముఖయాజిని దూషిస్తున్నావేమిటి!” అన్నారు.
5 అందుకు పౌలు “సోదరులారా, అతడు ఉన్నతయాజి అని నాకు తెలియలేదు. ‘మీ ప్రజల అధికారులలో ఎవరినీ నిందించకూడదు’ అని రాసి ఉంది” అన్నాడు. 6 వారిలో కొందరు సద్దూకయ్యులు, మరికొందరు పరిసయ్యులు అని పౌలు తెలుసుకొన్నప్పుడు సభలో ఇలా బిగ్గరగా చెప్పాడు: “అయ్యలారా, సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుడి కొడుకును. చనిపోయినవారు సజీవంగా లేస్తారనే దాని గురించి, వారి ఆశాభావాన్ని గురించి ఈ విచారణకు గురి అయ్యాను.”
7 అతడా మాట చెప్పినప్పుడు పరిసయ్యులకూ సద్దూకయ్యులకూ మధ్య కలహం పుట్టింది. సమావేశం రెండు పక్షాలయింది. 8 ఎందుకంటే చనిపోయినవారు లేవడం, దేవదూత, ఆత్మ అనేవి లేవనీ సద్దూకయ్యులంటారు. ఇవన్నీ ఉన్నాయని పరిసయ్యులంటారు. 9 కనుక పెద్ద అలజడి రేగింది. పరిసయ్యుల శాఖలో ధర్మశాస్త్ర పండితులు నిలబడి గట్టిగా వాదిస్తూ ఇలా అన్నారు: “ఈ మనిషిలో దుర్మార్గత అంటూ మాకు ఏమీ కనిపించడం లేదు. ఒక వేళ అతనితో ఏదైనా ఆత్మ గానీ, ఒక దేవదూత గానీ మాట్లాడి ఉంటే, మనం దేవునికి విరుద్ధంగా పోట్లాడకూడదు.” 10 జగడం అధికంగా పెరిగిపోయింది. వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడి “వెళ్ళి వాళ్ళ మధ్యనుంచి అతణ్ణి బలవంతంగా తీసుకొని కోటలోకి తేవాలి” అని అతడు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
11 ఆ రాత్రి పౌలు దగ్గర ప్రభువు నిలుచుండి “పౌలు, ధైర్యంగా ఉండు. జెరుసలంలో నన్ను గురించి నీవెలా సాక్ష్యం చెప్పావో అలాగే రోమ్‌లో కూడా సాక్ష్యం చెప్పాలి” అన్నాడు.
12 ఉదయమైనప్పుడు యూదులు కొందరు కుట్ర పన్ని తాము పౌలును చంపేవరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టు పెట్టుకొన్నారు.
13 కుట్రలో చేరినవారి సంఖ్య నలభై కంటే ఎక్కువ. 14 వారు ప్రధాన యాజుల దగ్గరకు, పెద్దలదగ్గరకు వెళ్ళి ఇలా అన్నారు: “పౌలును చంపేవరకు దేనినీ తినమని గంబీరంగా ఒట్టు పెట్టుకొన్నాం. 15 గనుక మీరూ సమాలోచన సభవారూ అతడి గురించి ఇంకా ఖచ్చితంగా విచారణ చేయవలసి ఉన్నట్టు రేపు అతణ్ణి మీ దగ్గరికి తీసుకురమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. వాడు ఈ స్థలం దగ్గరికి రాకముందే అతణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నాం.”
16 అయితే వారు అలా పొంచి ఉంటారని పౌలు మేనల్లుడు విని కోటలోకి వచ్చి పౌలుకు తెలియజేశాడు. 17 పౌలు శతాధిపతులలో ఒకణ్ణి తన దగ్గరకు పిలిచి “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు తీసుకువెళ్ళండి. ఇతడు అతనితో చెప్పుకోవలసినది ఒకటి ఉంది” అన్నాడు.
18 అలాగే శతాధిపతి ఆ పై అధిపతి దగ్గరకు అతణ్ణి తీసుకువెళ్ళి “ఖైదీ పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరికి తీసుకువెళ్ళమని అడిగాడు. మీతో ఇతడు ఏదో చెప్పుకోవాలని ఉన్నాడు” అన్నాడు.
19 సహస్రాధిపతి యువకుడి చేయి పట్టుకొని అవతలకు తీసుకువెళ్ళి “నీవు నాతో చెప్పాలి అనుకొన్నదేమిటి?” అని ఏకాంతంగా అడిగాడు.
20 అందుకతడు “యూదులు పౌలును గురించి ఇంకా ఖచ్చితంగా విచారించవలసి ఉన్నట్టు రేపు అతణ్ణి తమ సమాలోచన సభ దగ్గరికి తీసుకురమ్మని మిమ్ముల్ని అడగడానికి సమ్మతించారు. 21 వారి మాటకు లొంగిపోకండి! ఎందుకంటే, వారిలో నలభైకంటే ఎక్కువమంది అతనికోసం పొంచి ఉన్నారు. ఆ మనుషులు కుట్రపన్ని అతణ్ణి చంపేవరకు అన్నపానాలు తీసుకోమని ఒట్టుపెట్టుకొన్నారు. ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉండి మీ మాటకోసం ఎదురుచూస్తూ ఉన్నారు” అన్నాడు.
22 అందుకు సహస్రాధిపతి “ఈ సంగతి నాకు తెలియజేశావని ఎవరితో అనకు” అని ఆదేశించి ఆ యువకుణ్ణి పంపివేశాడు.
23 తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని పిలిచి “సీజరియకు రాత్రి తొమ్మిది గంటలకు వెళ్ళడానికి రెండు వందలమంది సైనికులను, డెబ్భైమంది రౌతులను, రెండు వందలమంది ఈటెలవారిని సిద్ధం చేయండి. 24 పౌలును పాలకుడైన ఫేలిక్స్ దగ్గరకు భద్రంగా తీసుకుపోయేందుకు అతణ్ణి ఎక్కించడానికి గుర్రాలను కూడా సిద్ధం చేయండి” అన్నాడు.
25 అప్పుడతడు ఈ లేఖ వ్రాశాడు:
26 “మహా ఘనులైన పాలకుడు ఫేలిక్స్‌కు క్లౌదియస్ లూసియస్ అభివందనాలు. 27 ఈ మనిషిని యూదులు పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమ్ పౌరుడని విని నేను సైనికులతో వచ్చి అతణ్ణి తప్పించాను. 28 వారు అతనిమీద మోపిన నేరమేమో తెలుసుకోవాలని వారి సమాలోచన సభ దగ్గరికి అతణ్ణి తీసుకువెళ్ళాను. 29 నేను కనుగొన్నదేమిటంటే, తమ ధర్మశాస్త్ర వివాదాలను గురించి వారు అతని మీద నేరారోపణ చేసినా మరణశిక్షకు గానీ ఖైదుకు గానీ తగిన నేరం మోపలేదు. 30 ఈ మనిషి కోసం యూదులు పొంచి ఉన్నారని నాకు తెలియవచ్చింది గనుక వెంటనే అతణ్ణి మీ దగ్గరికి పంపించాను. అతని మీద నేరం మోపినవారు మీ ఎదుటే అతనిమీద నేరారోపణ చేయాలని ఆజ్ఞ జారీ చేశాను. ఇంతే సంగతులు.
31 అందుచేత తమకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం సైనికులు రాత్రివేళ పౌలును అంతిపత్రిస్‌కు తీసుకువెళ్ళారు. 32 మరునాడు అతనితోకూడా వెళ్ళడానికి రౌతులను వదిలివేసి వారు కోటకు తిరిగి వెళ్ళారు. 33 రౌతులు సీజరియకు వెళ్ళి పాలకుడికి ఆ లేఖ అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలబెట్టారు. 34 పాలకుడు ఆ లేఖ చదివి “ఇతడు ఏ ప్రదేశంవాడు?” అని అడిగి, కిలికియ ప్రదేశమని తెలుసుకొన్నాడు. 35 అప్పుడతడు “నీమీద నేరం మోపేవారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి విచారణ చేస్తాను” అని చెప్పి హేరోదు భవనంలో అతణ్ణి కావలిలో ఉంచాలని ఆజ్ఞ జారీ చేశాడు.