22
1 ✝“సోదరులారా! తండ్రులారా! నేనిప్పుడు మీ ఎదుట చెప్పే సమాధానం వినండి.”2 అతడు తమతో హీబ్రూ భాషలో మాట్లాడడం విని వారు ఇంకా మౌనం వహించారు. అప్పుడతడు ఇలా అన్నాడు:
3 “నేను యూదుణ్ణి. నా జన్మస్థలం కిలికియలో ఉన్న తార్సు, గాని ఈ నగరంలోనే గమలీయేల్✽ పాదాల దగ్గర నన్ను పెంచడం జరిగింది. మన పూర్వీకుల ధర్మశాస్త్రానికి అనుగుణమైన ఖచ్చితమైన విధానంలోనే తర్బీతు పొంది, మీరంతా ఈవేళ ఉన్నట్టే నేనూ దేవునిపట్ల ఆసక్తిపరుడుగా✽ ఉండేవాణ్ణి. 4 ✝యేసు మార్గాన్ని అనుసరించినవారిని మరణమయ్యేంతవరకు హింసిస్తూ, పురుషులనూ స్త్రీలనూ బంధించి చెరసాలలో వేయిస్తూ వచ్చాను. 5 దీనికి ప్రముఖయాజి, యూద సభ పెద్దలంతా సాక్ష్యం చెపుతారు. వారు దమస్కులో ఉన్న సోదరులకు లేఖలు రాసి నాకిచ్చారు. దమస్కులో ఈ మార్గాన్ని అనుసరించిన వారిని కూడా ఖైదు చేసి దండనకోసం జెరుసలంకు తీసుకురావాలని అక్కడికి తరలివెళ్ళాను.
6 ✽ “నేను ప్రయాణం చేస్తూ సుమారు మధ్యాహ్న కాలంలో దమస్కు దగ్గరకు చేరాను. ఉన్నట్టుండి ఆకాశంనుంచి గొప్ప వెలుగు నా చుట్టూ మెరిసింది. 7 నేను నేలమీద పడి ఒక స్వరం నాతో ఇలా మాట్లాడడం విన్నాను: ‘సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?’ 8 ‘ప్రభూ! మీరెవరు?’ అని నేను అడిగినప్పుడు ఆయన నాతో ‘నీవు హింసిస్తున్న నజరేతువాడైన యేసునే నేను’ అన్నాడు.
9 “నాతో ఉన్నవారు ఆ వెలుగు చూచి భయపడ్డారు గాని నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు. 10 ‘ప్రభూ! నేనేమి చేయాలి?’ అన్నాను. అందుకు ప్రభువు నాతో ఇలా అన్నాడు: ‘లేచి దమస్కులోకి వెళ్ళు. చేయడానికి నీకు నియమించినదంతా అక్కడ నీకు తెలపడం జరుగుతుంది.’
11 “ఆ కాంతి తేజస్సు కారణంగా నేను ఏమీ చూడలేకపోయాను గనుక నాతో ఉన్నవారు చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ ఉంటే నేను దమస్కులోకి వెళ్ళాను.
12 “అక్కడ అననీయ అనే వ్యక్తి నా దగ్గరకి వచ్చాడు. అతడు ధర్మశాస్త్రానికి అనుగుణంగా భయభక్తులున్నవాడు, అక్కడ నివసించే యూదులందరి మధ్య మంచి పేరు గడించినవాడు. 13 అతడు నా దగ్గర నిలుచుండి ‘సోదరుడా! సౌలూ! దృష్టి పొందండి!’ అన్నాడు. వెంటనే దృష్టి వచ్చి అతణ్ణి చూశాను.
14 ✽“అప్పుడతడు అన్నాడు ‘తన సంకల్పం తెలుసు కోవడానికీ, ఆ న్యాయవంతుణ్ణి✽ చూడడానికీ, ఆయన నోటి మాట వినడానికీ మన పూర్వీకుల దేవుడు మిమ్ముల్ని ఎన్నుకొన్నాడు. 15 ✝ఎందుకంటే, మీరు చూచినవీ విన్నవీ చెపుతూ సర్వ ప్రజలకు ఆయన సాక్షిగా ఉంటారు. 16 ✽అయితే మీరింకా ఆలస్యం చేయడం దేనికి? లేచి బాప్తిసం పొందండి. ఆయన పేర ప్రార్థన చేస్తూ మీ పాపాలు కడిగివేసుకోండి.’
17 ✽“తరువాత నేను జెరుసలంకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరవశుణ్ణయి ప్రభువును చూశాను. 18 ఆయన ‘త్వరపడి జెరుసలం విడిచి శీఘ్రంగా వెళ్ళు. నా విషయం నీవు చెప్పే సాక్ష్యాన్ని వారు అంగీకరించరు’ అని నాతో చెప్పాడు.
19 “అందుకు నేను, ‘ప్రభూ! ప్రతి సమాజ కేంద్రంలో నీమీద నమ్మకం ఉంచినవారిని నేను చెరసాలలో వేయిస్తూ, కొడుతూ ఉండేవాణ్ణని వారికి బాగా తెలుసు. 20 ✝అంతేగాక, నీ సాక్షి అయిన స్తెఫను రక్తం చిందించబడ్డ సమయంలో నేను కూడా అక్కడే నిలుచుండి అతని మరణానికి సమ్మతిస్తూ అతణ్ణి హతమారుస్తున్నవారి పై వస్త్రాలకు కావలి ఉన్నాను’ అన్నాను.
21 ✝“అప్పుడు ఆయన నాతో అన్నాడు ‘వెళ్ళు, దూరంగా ఇతర ప్రజల దగ్గరకు నిన్ను పంపుతున్నాను’.”
22 ఆ మాట✽వరకు అతడు చెప్పినది వారు వింటూ ఉన్నారు. ఇప్పుడైతే “ఇలాంటివాడు బతకతగడు! భూమిమీద ఉండకుండా వాణ్ణి చంపెయ్యండి!” అని కేకలు పెట్టారు. 23 వారు అరుస్తూ తమ పైబట్టలు తీసి పారవేస్తూ ఆకాశంవైపు దుమ్మెత్తి పోస్తూ ఉండగా, 24 అతణ్ణి కోటలోకి తీసుకుపోవాలని సహస్రాధిపతి ఆజ్ఞ జారీ చేశాడు. ప్రజలు అతనికి వ్యతిరేకంగా ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసుకోవడానికి అతణ్ణి కొరడాలతో కొట్టి✽ విచారణ చేయాలని కూడా చెప్పాడు.
25 ✽ వారు పౌలును తోలు వారులతో కట్టివేస్తూ ఉన్నప్పుడు అతడు తనదగ్గర నిలుచున్న శతాధిపతితో “సంగతి విచారణలోకి రాకముందే రోమ్ పౌరుణ్ణి మీరు కొరడా దెబ్బలు కొట్టడం ధర్మమా?” అన్నాడు.
26 అది విని శతాధిపతి సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి “మీరు చేయబోతున్న దాని గురించి జాగ్రత్త! ఈ మనిషి రోమ్ పౌరుడు!” అన్నాడు.
27 అప్పుడు ఆ అధిపతి వచ్చి పౌలుతో “నీవు రోమ్ పౌరుడివా? నాకు చెప్పు” అన్నాడు. అతడు “అవును” అన్నాడు. 28 ✽అధిపతి “చాలా డబ్బిచ్చి ఈ పౌరత్వం సంపాదించు కొన్నాను” అన్నాడు. అందుకు పౌలు “నేనైతే పుట్టుకతోనే రోమ్ పౌరుణ్ణి” అన్నాడు.
29 అందుచేత అతణ్ణి ప్రశ్నించబోయేవారు వెంటనే వెనక్కు తగ్గారు. అతడు రోమ్ పౌరుడని తెలుసుకొన్నప్పుడు అతణ్ణి బంధించిన కారణంగా సహస్రాధిపతికి కూడా భయం వేసింది. 30 మరునాడు, యూదులు పౌలుమీద మోపే నేరమేమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆ అధిపతి అతని సంకెళ్ళు తీసివేసి ప్రధానయాజులూ యూద సమాలోచన సభ✽వారూ అంతా హాజరు కావాలని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు పౌలును తీసుకువచ్చి వారిముందు నిలబెట్టాడు.