21
1 మేము వారిని విడవలేక విడిచి ఓడ ఎక్కి ప్రయాణమై తిన్నగా కోస్ ద్వీపం వెళ్ళాం. మరునాడు రోద్స్ ద్వీపం చేరి అక్కడనుంచి పతర రేవుకు వెళ్ళాం. 2 అక్కడ ఫీనీకే దేశం వెళ్ళే ఓడను చూచి దానిని ఎక్కి ప్రయాణమయ్యాం. 3 సైప్రస్ కనబడ్డప్పుడు ఎడమ వైపున దానిని దాటిపోయి సిరియాకు వెళ్ళాం. తూరు నగరం ఓడ సరకులు దించవలసిన స్థలం గనుక అక్కడ దిగాం. 4 శిష్యులను కనుక్కొని ఏడు రోజులు అక్కడ గడిపాం. వారు పౌలును జెరుసలం వెళ్ళవద్దని ఆత్మమూలంగా చెప్పారు. 5 ఆ రోజులు గడిపిన తరువాత మేము ప్రయాణమై బయలుదేరినప్పుడు వారంతా భార్యలతో పిల్లలతో కూడా పట్టణం బయటికి మమ్ములను సాగనంపడానికి వచ్చారు. సముద్రం ఒడ్డున మేమంతా మోకాళ్ళూని ప్రార్థన చేసి ఒకరినొకరం విడిపోయాం. 6 మేము ఓడ ఎక్కాం, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళారు.
7 మేము తూరునుంచి ప్రయాణం ముగించి తొలెమాయి చేరుకొన్నాం. అక్కడి సోదరులను కుశలం అడిగి వారి దగ్గర ఒక రోజు గడిపాం. 8 మరునాడు పౌలు సహచరులైన మేము బయలుదేరి సీజరియకు చేరి శుభవార్త ప్రచారకుడైన ఫిలిప్పు ఇంటికి వెళ్ళి అతనిదగ్గర ఉండిపోయాం. అతడు ఆ ఏడుగురిలో ఒకడు. 9 అతనికి నలుగురు కూతుళ్ళు ఉన్నారు. వారు కన్యలు, దేవునిమూలంగా పలికేవారు.
10 మేము అక్కడ కొన్ని రోజులున్న తరువాత ఒక ప్రవక్త యూదయ నుంచి వచ్చాడు. అతని పేరు అగబు. 11 అతడు మాదగ్గరకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన కాళ్ళుచేతులు కట్టి ఇలా అన్నాడు: “ఈ నడికట్టు ఎవరిదో ఆ మనిషిని జెరుసలంలోని యూదులు ఈ విధంగా కట్టి ఇతర ప్రజ చేతికి అప్పగిస్తారని పవిత్రాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని మేము, అక్కడివారు కూడా జెరుసలం వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొన్నాం. 13 అయితే పౌలు ఇలా జవాబిచ్చాడు: “మీరు ఇలా ఏడుస్తూ నా గుండె బ్రద్దలు చేస్తున్నారెందుకు? ప్రభువైన యేసు పేరుకోసం జెరుసలంలో బంధకాలపాలు కావడానికి మాత్రమే గాక, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.”
14 అతడు ఒప్పించబడలేదు గనుక “ప్రభు చిత్తం జరుగుతుంది గాక” అని చెప్పి మేము ఊరుకొన్నాం.
15 ఆ రోజులైన తరువాత సామాను సర్దుకొని జెరుసలం వెళ్ళాం. 16 సీజరియనుంచి కొందరు శిష్యులు మాతో వచ్చి సైప్రస్‌వాడైన మనాసోన్‌ను తమతోకూడా తీసుకువచ్చారు. అతని ఇంట్లో మేము బస చేయాలని ఏర్పాటైంది. మొదటి నుంచి అతడు శిష్యుడు.
17 మేము జెరుసలం చేరినప్పుడు సోదరులు ఆనందంతో మమ్ములను చేర్చుకొన్నారు. 18 మరునాడు పౌలు, మేము యాకోబు దగ్గరకు వెళ్ళాం. పెద్దలందరూ అక్కడ ఉన్నారు. 19 అతడు వారిని కుశలమడిగి తన సేవద్వారా ఇతర ప్రజలలో దేవుడు చేసినవాటిని వివరంగా చెప్పాడు.
20 అది విని వారు ప్రభువును స్తుతించారు, అప్పుడు అతనితో ఇలా అన్నారు: “సోదరుడా! యూదులలో ఎన్ని వేలమంది విశ్వాసులయ్యారో నీకు కనిపిస్తూ ఉంది గదా. ధర్మశాస్త్రం అంటే వారందరికీ ఆసక్తి. 21 వారు నిన్ను గురించి విన్న కబురేమిటంటే, ఇతర ప్రజలలో ఉన్న యూదులందరికీ మోషే ఉపదేశాన్ని విడిచి తమ పిల్లలకు సున్నతి చేయకూడదనీ, మన ఆచారాల ప్రకారం నడుచుకోకూడదనీ నేర్పుతున్నావట. 22 అయితే ఏం? సంఘం తప్పక సమావేశం అవుతుంది. ఎందుకంటే నీవు వచ్చిన సంగతి వారు వింటారు. 23 అందుచేత మేము నీకు చెప్పినట్టు చెయ్యి. మొక్కుబడి చెల్లించవలసిన పురుషులు నలుగురు మా దగ్గర ఉన్నారు. 24 నీవు వారిని తీసుకువెళ్ళి వారితోకూడా శుద్ధి కార్యంలో పాల్గొను. వారి తలవెంట్రుకలు గొరిగించుకొనే ఖర్చులు పెట్టుకో. అప్పుడు నీ గురించి వారు విన్న వదంతులలో సత్యమేమీ లేదనీ నీవు ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ యథాక్రమంగా నడుచుకొంటున్నావనీ అందరూ తెలుసుకొంటారు. 25  ఇతర ప్రజలలో నమ్ముకొన్నవారి విషయం చెప్పాలంటే, వారు అలాంటి దాన్ని ఆచరించకూడదనీ విగ్రహాలకు అర్పితమైన వాటినుంచి రక్తంనుంచి గొంతు పిసికి చంపిన దానినుంచి వ్యభిచారం నుంచి తమను దూరంగా ఉంచుకోవాలని మాత్రం మేము నిర్ణయించి వారికి రాశాం.”
26 మరునాడు పౌలు ఆ మనుషులను తీసుకువెళ్ళి వారితోపాటు శుద్ధికార్యంలో పాల్గొని దేవాలయంలోకి వెళ్ళి శుద్ధి గడువు తీరి వారిలో ఒక్కొక్కరికోసం కానుక అర్పించబోయే రోజు తెలియజేశాడు.
27 ఆ ఏడు రోజులు కావచ్చినప్పుడు ఆసియా రాష్ట్రం నుంచి వచ్చిన యూదులు అతణ్ణి దేవాలయంలో చూశారు. అక్కడి సమూహమంతటినీ వారు పురికొలిపి అతణ్ణి పట్టుకొని ఇలా కేకలు పెట్టారు: 28 “ఇస్రాయేల్ మనుషులారా, సహాయం చేయండి! మన ప్రజలకూ ధర్మశాస్త్రానికీ ఈ స్థలానికీ వ్యతిరేకంగా అందరికీ అంతటా బోధించేవాడు ఈ మనిషే! అంతేగాక, గ్రీసు దేశస్థులను దేవాలయంలోకి తీసుకువచ్చి ఈ పవిత్ర స్థానాన్ని అశుద్ధం చేశాడు!”
29 అంతకుముందు ఎఫెసు నివాసి త్రోఫిమస్ అతనితో నగరంలో ఉండడం వారు చూచినందుచేత పౌలు అతణ్ణి దేవాలయంలోకి తీసుకువచ్చాడని అనుకొన్నారు. 30 నగర మంతా రెచ్చిపోయింది. ప్రజలు ఒకటిగా పరుగెత్తుకువచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలోనుంచి బయటికి ఈడ్చుకుపోయారు. వెంటనే తలుపులు మూయడం జరిగింది. 31 వారు అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటే జెరుసలమంతా అల్లరిగా ఉందని రోమ్ పటాలం అధిపతికి కబురు అందింది.
32 తక్షణమే అతడు సైనికులనూ శతాధిపతులనూ వెంటబెట్టుకొని వారి దగ్గరకు పరుగెత్తుకువచ్చాడు. ఆ సహస్రాధిపతినీ సైనికులనూ చూచి వారు పౌలును కొట్టడం మానారు. 33 సహస్రాధిపతి దగ్గరకు వచ్చి అతణ్ణి పట్టుకొని రెండు సంకెళ్ళతో బంధించాలని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు “వీడెవడు? ఏం చేశాడు?” అని అడిగాడు. 34 గుంపులో కొంతమంది అలా, కొంతమంది ఇలా కేకలు పెట్టారు. అల్లరిగా ఉండడంచేత నిజం తెలుసుకోలేక అతడు పౌలును కోటలోకి తీసుకుపోవాలని ఆజ్ఞ జారీ చేశాడు. 35 మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు అల్లరిమూక బలాత్కారం కారణంగా సైనికులు పౌలును మోసుకుపోవలసి వచ్చింది. 36 ఎందుకంటే “వాణ్ణి చంపెయ్యండి” అని అరుస్తూ జనసమూహం వెంటబడుతూ ఉంది.
37 పౌలును కోటలోకి తీసుకుపోతూ ఉంటే అతడు “మీతో ఒక మాట చెప్పవచ్చా?” అని సహస్రాధిపతిని అడిగాడు. 38 అతడు “గ్రీకు భాష నీకు వస్తుందా? కొంతకాలం కిందట తిరుగుబాటు రేపి నాలుగు వేలమంది హంతకులను ఎడారికి తీసుకుపోయిన ఈజిప్ట్ మనిషివి కావా నీవు?” అని అడిగాడు.
39 అందుకు పౌలు “నేను యూదుణ్ణి, కిలికియలోని తార్సువాణ్ణి, ఆ అసాధారణమైన పట్టణం పౌరుణ్ణి. ప్రజలతో మాట్లాడడానికి దయచేసి నాకు అనుమతి ఇవ్వండి” అన్నాడు. 40 అతడు అనుమతి ఇచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలుచుండి ప్రజలకు చేసైగ చేశాడు. అంతటా గొప్ప నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడతడు వారితో హీబ్రూ భాషలో ఇలా అన్నాడు: