20
1 ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను పిలువనంపి వారిని కౌగిలించి మాసిదోనియకు బయలుదేరి వెళ్ళాడు. 2 ఆ ప్రాంతంలో సంచారం చేస్తూ అక్కడివారిని అనేక మాటలతో ప్రోత్సహిస్తూ గ్రీసు దేశం చేరాడు. 3 అక్కడ మూడు నెలలు గడిపాడు. అతడు సిరియాకు ఓడ ప్రయాణం చేయబోతూ ఉంటే, యూదులు అతనిమీద కుట్ర పన్నినందుచేత తిరిగి మాసిదోనియ గుండా వెళ్ళాలని నిశ్చయించుకొన్నాడు. 4 అతనితోకూడా ఆసియాకు వెళ్ళినవారు బెరియ గ్రామస్థుడైన సోపత్రు, అరిస్తర్కస్, తెస్సలొనీక పట్టణస్థుడైన సెకుందస్, దెర్బే పట్టణస్థుడైన గాయియస్, తిమోతి, ఆసియా రాష్ట్రం వారైన తుకికస్, త్రోఫిమస్. 5 వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మాకోసం చూస్తూ ఉన్నారు. 6 పొంగని రొట్టెల రోజులయిన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ నుంచి బయలుదేరి అయిదు రోజులలో త్రోయకు వారి దగ్గరకి చేరుకొన్నాం. అక్కడ ఏడు రోజులు గడిపాం.
7 ఆదివారం నాడు శిష్యులు రొట్టె విరవడానికి సమకూడారు. మర్నాడు వెళ్ళాలని పౌలు ఉద్దేశపడి వారితో మాట్లాడుతూ మధ్యరాత్రివరకు తన సందేశం ముగించకుండా మాట్లాడుతూ ఉన్నాడు. 8 వారు సమకూడిన మేడగదిలో అనేక దీపాలు ఉన్నాయి. 9 ఒక కిటికీలో యుతుకస్ అనే యువకుడు కూర్చుని ఉన్నాడు. అతనికి గాఢ నిద్ర ముంచుకు వస్తూ ఉంది. పౌలు ఇంకా ఇంకా మాట్లాడుతూ ఉంటే అతడు బాగా నిద్రపోయి మూడో అంతస్తు నుంచి క్రింద పడిచనిపోయాడు. ఆ చనిపోయినవాణ్ణి ఎత్తి పట్టుకొన్నారు. 10 అయితే పౌలు క్రిందికి వెళ్ళి అతనిమీద సాష్టాంగపడి కౌగలించుకొని “కంగారుపడకండి. ఇతనిలో ప్రాణం ఉంది” అన్నాడు. 11 అతడు మళ్ళీ పైకి వెళ్ళి రొట్టె విరిచి తిన్నాడు. చాలా సేపు – ప్రొద్దు పొడిచేవరకూ – వారితో మాట్లాడిన తరువాత వెళ్ళిపోయాడు. 12 వారు ఆ యువకుణ్ణి సజీవంగా లోపలికి తీసుకువచ్చి ఎంతో ఆదరణ పొందారు.
13 మేము ముందుగా సాగిపోయి ఓడ ఎక్కి అస్సొసుకు వెళ్ళాం. అక్కడ పౌలును ఓడ ఎక్కించుకోవాలని మా ఉద్దేశం. పౌలు తానే అలా ఏర్పాటు చేశాడు. అతడు కాలి నడకన వెళ్ళాలనుకొన్నాడు. 14 అస్సొసులో మమ్ములను కలసినప్పుడు మేము అతణ్ణి ఓడ ఎక్కించుకొని మితులేనేకు వెళ్ళాం. 15 అక్కడనుంచి బయలుదేరి మరునాడు కీయొసుకు ఎదురుగా వెళ్ళాం. మరుసటి రోజు సమొసు ద్వీపం చేరి త్రొగిల్లియంలో ఆ రాత్రి గడిపాం. ఆ మరుసటి రోజు మిలేతస్ చేరుకొన్నాం. 16 ఆసియా రాష్ట్రంలో కాలం గడపకుండా ఎఫెసును దాటిపోవాలని పౌలు నిశ్చయించుకొన్నాడు. ఎందుకంటే సాధ్యమైతే పెంతెకొస్తు రోజు జెరుసలంలో ఉండాలని అతడు ఆతురతతో ఉన్నాడు. 17 మిలేతస్ నుంచి అతడు ఎఫెసుకు కబురంపి సంఘం పెద్దలను పిలిపించాడు. 18 వారు తన దగ్గరకు వచ్చినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు:
“నేను ఆసియాలో అడుగు పెట్టిన ఆ మొదటి రోజునుంచి ఇప్పటిదాకా మీమధ్య ఏ విధంగా ఉన్నానో మీకే తెలుసు. 19 యూదుల కుట్రలవల్ల నాకు విషమ పరీక్షలు కలిగినా, కన్నీళ్ళు విడుస్తూ పూర్ణ వినయభావంతో ప్రభువుకు సేవ చేశాను. 20 మీకు మేలు కలిగించేదేదీ చెప్పకుండా వెనక్కు తీయలేదు గాని దాన్ని ప్రకటిస్తూ బహిరంగంగా, ఇంటింటా మీకు ఉపదేశిస్తూ వచ్చాను. 21 దేవునిపట్ల పశ్చాత్తాపపడి మన ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం ఉంచాలని యూదులకూ గ్రీసు దేశస్థులకూ విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ వచ్చాను. ఇదంతా మీకు తెలుసు.
22 “ఇదిగో వినండి, ఇప్పుడు నేను ఆత్మ నిర్బంధంవల్ల జెరుసలం వెళ్తున్నాను. అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో తెలియదు. 23 ఒక సంగతి మాత్రమే తెలుసు. సంకెళ్ళూ బాధలూ నాకోసం కాచుకొని ఉన్నాయని పవిత్రాత్మ ప్రతి పట్టణంలో విధ్యుక్తంగా సాక్ష్యం చెపుతూ ఉన్నాడు. 24 అయితే ఈ విషయాల్లో ఏదీ నన్ను కదిలించదు. నా జీవితం నాకు ప్రియమని ఎంచుకోవడం లేదు. నా లక్ష్యాన్ని ఆనందంతో పూర్తిగా నెరవేర్చాలనీ, యేసుప్రభువు నాకిచ్చిన సేవను, అంటే నేను సాక్షిగా దేవుని కృప శుభవార్త తెలియజేయడం అనే సేవను తుదముట్టించాలనీ ఉన్నాను.
25 “ఇదిగో వినండి, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ నేను మీ మధ్య సంచరిస్తూ వచ్చాను గాని ఇకమీదట మీలో ఎవరూ నా ముఖం చూడరని నాకు తెలుసు. 26  కనుక నేను అందరి రక్తం విషయంలో నిర్దోషినని ఈవేళ మీతో సాక్షిగా చెపుతున్నాను. 27 ఎందుకంటే దేవుని సంకల్పమంతా మీకు తెలియజేయడంలో నేనేమీ వెనక్కు తీయలేదు.
28 “దేవుడు తన సొంత రక్తమిచ్చి సంపాదించుకొన్న ఆయన సంఘానికి మీరు కాపరులుగా ఉండాలని పవిత్రాత్మ మిమ్మల్ని నాయకులుగా చేశాడు. అందువల్ల మిమ్మల్ని గురించీ మంద అంతటిని గురించీ జాగ్రత్తగా ఉండండి. 29 నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళలాంటివారు మీమధ్యలో ప్రవేశిస్తారని నాకు తెలుసు. వారు మంద మీద ఏమీ జాలి చూపరు. 30 అంతేగాక, శిష్యులను తమ వెంట లాక్కుపోవాలని మీలోనే మనుషులు తలెత్తి కుటిలమైన మాటలు చెపుతారు. 31  కాబట్టి మెళకువగా ఉండండి! నేను మూడేళ్ళు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ప్రతి ఒక్కరినీ హెచ్చరించడం మానలేదని జ్ఞాపకం ఉంచుకోండి.
32 “ఇప్పుడు సోదరులారా, దేవునికీ ఆయన కృపవాక్కుకూ మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీకు క్షేమాభివృద్ధి కలిగించి పవిత్రులైన వారందరితో కూడా వారసత్వం అనుగ్రహించడానికి ఆయన సమర్థుడు. 33 నేను ఎవరి వెండి గానీ బంగారం గానీ వస్త్రాలు గానీ ఆశించలేదు. 34 అసలు, నా అక్కరలు, నాతో ఉన్నవారి అక్కరలు తీర్చడానికి ఈ చేతులు పని చేశాయి అని మీకే తెలుసు. 35 ఇలా శ్రమిస్తూ మీరూ కష్టపడి బలహీనులకు సహాయం చేయాలని నేను అన్ని విషయాలలో మీకు మాదిరి చూపాను. ‘తీసుకోవడంకంటే ఇవ్వడమే ధన్యం’ అని యేసుప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకముంచుకోండి.”
36 అతడు ఇలా చెప్పి, వారందరితోపాటు మోకాళ్ళూని ప్రార్థన చేశాడు. 37 అప్పుడు వారంతా బాగా ఏడ్చి పౌలును కౌగలించుకొని ముద్దుపెట్టుకొన్నారు. 38 వారు తన ముఖం ఇకమీదట చూడరని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించారు. తరువాత ఓడ వరకు అతణ్ణి సాగనంపారు.