19
1 ✽ అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఎత్తయిన ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఎఫెసుకు వెళ్ళాడు. అక్కడ కొందరు శిష్యులను చూచి 2 “మీరు నమ్ముకొన్నప్పుడు పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.అందుకు వారు “పవిత్రాత్మ ఉన్న విషయమే మేము వినలేదు” అని అతనితో చెప్పారు.
3 అప్పుడతడు “అయితే మీరు దేనిలోకి బాప్తిసం పొందారు?” అని వారిని అడిగాడు.
వారు “యోహాను బాప్తిసం✽లోకి” అన్నారు.
4 ✝అందుకు పౌలు ఇలా అన్నాడు: “యోహాను పశ్చాత్తాపాన్ని గురించిన బాప్తిసం ఇచ్చాడు. తన వెనుక వచ్చేవానిమీద, అంటే క్రీస్తు యేసు మీద నమ్మకం ఉంచాలని అతడు ప్రజలతో చెప్పాడు.”
5 ✽ ఇది విని వారు యేసు పేరులోకి✽ బాప్తిసం పొందారు.
6 పౌలు వారిమీద చేతులుంచినప్పుడు✽ పవిత్రాత్మ వారిమీదికి వచ్చాడు. వారు వేరే భాషలలో✽ మాట్లాడారు, దేవునిమూలంగా✽ పలికారు. 7 అంతా కలిసి వారు దాదాపు పన్నెండుగురు పురుషులు.
8 ✝తరువాత అతడు యూద సమాజకేంద్రానికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతూ, దేవుని రాజ్యాన్ని గురించి ఒప్పించే విధంగా తర్కిస్తూ ఉన్నాడు. ఇలా మూడు నెలలు గడిపాడు. 9 ✝అయితే కొందరు కఠిన హృదయులై, నమ్మడానికి నిరాకరించి, ప్రజల గుంపుల ముందు ప్రభు మార్గాన్ని దూషించారు. అప్పుడు అతడు వారిని విడిచి శిష్యులను తీసుకువెళ్ళి తరన్నస్ ప్రసంగశాలలో ప్రతి రోజూ తర్కించాడు. 10 ✽రెండు సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉండడంచేత ఆసియా రాష్ట్రంలో కాపురమున్న యూదులేమీ గ్రీసు దేశస్థులేమీ అందరూ ప్రభు వాక్కు విన్నారు.
11 ✽పౌలుచేత దేవుడు అసాధారణ అద్భుతాలు చేయించాడు – 12 అతని శరీరానికి తగిలిన చేతి రుమాళ్ళు గానీ నడికట్లు గానీ రోగుల దగ్గరకు తెచ్చినప్పుడు రోగాలు వారిని విడిచాయి. దయ్యాలు వారిలో నుంచి వెళ్ళాయి.
13 ✽అప్పుడు, దేశసంచారం చేస్తూ దయ్యాలను వెళ్ళగొట్టే యూదులు కొందరు, దయ్యాలు పట్టిన వారిపై “పౌలు ప్రకటించే యేసు పేర ఆజ్ఞాపిస్తున్నాం” అని యేసుప్రభువు పేరు చెప్పడానికి పూనుకొన్నారు. 14 యూద ప్రధానయాజి ఒకడైన స్కెవ కొడుకులు ఏడుగురు అలా చేశారు. 15 ఆ దయ్యం వారితో “యేసంటే నాకు తెలుసు. పౌలు కూడా తెలుసు గానీ మీరెవరు?” అంది. 16 అప్పుడు దయ్యం ఎవరిలో ఉన్నదో అతడు వారిమీద ఎగిరి దూకి వారిని అణచివేసి ఓడగొట్టాడు గనుక గాయాలు తగిలి వారు దిగంబరంగా ఆ ఇంటినుంచి పారిపోయారు.
17 ✽ఈ సంగతి ఎఫెసు నగరవాసులైన యూదులకూ గ్రీసు దేశస్థులకూ అందరికీ తెలిసింది. అందరినీ భయం ఆవరించింది. ప్రభువైన యేసు పేరుకు ఘనత కలిగింది. 18 ✝విశ్వాసులనేకులు వచ్చి తాము చేసిన చెడు క్రియాకలాపాలు తెలియజేసి ఒప్పుకొన్నారు. 19 ✽అంతేగాక మంత్రవిద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకాలు✽ తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వాటి వెల లెక్కించారు – ఆ మొత్తం యాభై వేల వెండి నాణేలు. 20 ఇలా ప్రభు వాక్కు ప్రభావంతో అధికం అవుతూ వ్యాపిస్తూ ఉంది.
21 ✽ఇలా జరిగిన తరువాత పౌలు మాసిదోనియ, అకయల గుండా ప్రయాణం చేస్తూ జెరుసలంకు వెళ్ళాలని ఆత్మలో నిశ్చయించుకొన్నాడు. “అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ కూడా చూడాలి” అన్నాడు. 22 కనుక తనకు సహాయం చేసేవారిలో ఇద్దరిని మాసిదోనియకు పంపాడు. వారు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియాలో ఇంకా కొంత కాలం ఉండిపోయాడు.
23 ఆ కాలంలో క్రీస్తు మార్గాన్ని గురించి చాలా కల్లోలం పుట్టింది. 24 ✽దేమేత్రియస్ అనే కంసాలి అర్తెమిదేవికి వెండి గర్భగుళ్ళ నమూనాలను చేయిస్తూ ఆ పనివారికి చాలా లాభం కలిగించేవాడు. 25 అతడు వారినీ అలాంటి పని చేసే ఇతరులనూ పోగుచేసి ఇలా అన్నాడు: “అయ్యలారా, ఈ వ్యాపారంవల్ల మనకు బాగా జీవనం జరుగుతూ ఉందని మీకు తెలుసు. 26 ✝అంతే కాదు. చేతులతో చేసిన దేవతలు దేవతలే కావని ఈ పౌలు చెప్తూ ఎఫెసులో మాత్రమే గాక దాదాపు ఆసియా రాష్ట్రం అంతటా ప్రజలనేకులను ఒప్పించి తిప్పివేశాడు. ఈ సంగతి మీరు విన్నారు, చూశారు. 27 ఇప్పుడు అపాయం ఉంది– ఈ మన వృత్తికి చెడ్డ పేరు వస్తుందేమో. ఇంతే గాక, అర్తెమి మహా దేవి గుడి తృణీకారానికి గురి అయి ఆసియా అంతటా, లోకమంతటా పూజలందు కుంటున్న ఈమె దివ్యత్వం నాశనం అవుతుందేమో.”
28 ✽ఇది విని వారు కోపోద్రేకంతో నిండిపోయి “ఎఫెసువారి అర్తెమి గొప్పది!” అని కేకలు పెట్టసాగారు. 29 నగరమంతా గందరగోళం అయిపోయింది. వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియవారైన గాయియసును అరిస్తర్కసును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడ్డారు. 30 పౌలు ప్రజల దగ్గరకు వెళ్ళాలని కోరాడు గాని శిష్యులు అతణ్ణి వెళ్ళనివ్వలేదు. 31 ఆసియా రాష్ట్రాధికారులలో కొందరు అతనికి స్నేహితులు. వారు కూడా “నాటకశాలలోకి వెళ్ళవద్ద”ని వేడుకొంటూ అతనికి కబురు పంపారు.
32 ఆ సభ గందరగోళంగా ఉండడం కారణంగా కొందరు ఇలా, మరికొందరు అలా కేకలు వేస్తూ వచ్చారు. ఎక్కువమంది అసలు తాము ఎందుకు గుమికూడారో తెలుసుకోలేదు. 33 యూదులు అలెగ్జాండర్‌ను ముందుకు తోస్తే, ఆ సమూహంలో కొందరు అతణ్ణి సభ ఎదుటికి తెచ్చారు. ప్రజలతో ప్రతివాదన చెప్పుకోవాలని అలెగ్జాండర్ చేసైగ చేశాడు. 34 ✽కానీ అతడు యూదుడని అప్పుడు వారు గుర్తించి ఏక కంఠంతో సుమారు రెండు గంటల సేపు “ఎఫెసువారి అర్తెమి గొప్పది!” అని అరిచారు.
35 ✽ఆ తరువాత కరణం ఆ గుంపును శాంతపరచి ఇలా అన్నాడు: “ఎఫెసు మనుషులారా! మహా దేవి అర్తెమి గుడికీ ఆకాశంనుంచి పడ్డ శిలకూ ధర్మకర్తగా ఉన్నది ఎఫెసు నగరమే అని తెలియనివారెవరు? 36 ఈ విషయాలు ఎవరూ కాదనలేరు గనుక మీరు శాంతం వహించి దుడుకుగా ఏమీ చేయకూడదు. 37 మీరు ఈ మనుషులను తీసుకువచ్చారు. వీరు గుళ్ళు దోచుకొనేవారు కారు, మీ దేవిని దూషించినవారూ కారు. 38 అందుచేత దేమేత్రియస్, అతనితో ఉన్న చేతిపనివారు ఎవరైన ఒక వ్యక్తిమీద ఫిర్యాదు చేయాలని ఉంటే వారు ఒకరితో ఒకరు వ్యాజ్యెమాడవచ్చు – న్యాయసభలు సమావేశమైవున్నాయి, రాష్ట్రాధికారులూ ఉన్నారు. 39 మీరు ఇంకా వేరే విచారణ ఏదైనా చేయాలని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారం కావాలి. 40 ఈ రోజు అల్లరి గురించి మనమీద నేరం మోపడం జరుగుతుందేమో అనే ప్రమాదంలో ఉన్నాం. అలాంటప్పుడు ఇలా దొమ్మిగా కూడినందుకు తగిన కారణం చెప్పలేము.”
41 ఇలా చెప్పి అతడు సమకూడినవారిని పంపివేశాడు.