18
1 ఆ తరువాత పౌలు ఏథెన్సును విడిచి కొరింతు వెళ్ళాడు. 2 అక్కడ అతడు అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. అకుల పొంతు రాష్ట్రంలో జన్మించినవాడు. రోమ్ నగరం విడిచి వెళ్ళాలని క్లౌదియ యూదులందరికీ ఆజ్ఞ జారీ చేశాడు గనుక అతడు, అతని భార్య ప్రిస్కిల్ల ఇటలీ నుంచి క్రొత్తగా వచ్చినవారు. పౌలు వారిని దర్శించాడు. 3  వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. అతనిది కూడా అదే వృత్తి గనుక అతడు వారి ఇంట్లో ఉంటూ పని చేశాడు. 4 ప్రతి విశ్రాంతి దినమూ యూద సమాజ కేంద్రంలో తర్కిస్తూ యూదులను గ్రీసుదేశస్థులను ఒప్పించాడు.
5 సైలసు తిమోతిలు మాసిదోనియనుంచి వచ్చిన తరువాత పౌలు దేవుని ఆత్మ ఒత్తిడివల్ల యేసే అభిషిక్తుడు అని యూదులకు గట్టిగా సాక్ష్యమిస్తూ వచ్చాడు. 6  వారు అతనికి ఎదురాడి దూషించినప్పుడు తన బట్టలు దులుపుకొని అతడు వారితో అన్నాడు “మీ రక్తం మీ తలమీదే ఉంటుంది గాక. నా బాధ్యత తీరిపోయింది. ఇప్పటినుంచి నేను ఇతర ప్రజలదగ్గరకు వెళ్తాను.”
7 అప్పుడతడు అక్కడనుంచి బయలుదేరి యూస్తస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆ వ్యక్తికి దేవుడంటే భయభక్తులు. అతని ఇల్లు యూద సమాజకేంద్రం ప్రక్కనే ఉంది. 8 సమాజకేంద్రం అధికారి అయిన క్రిస్పస్, అతని ఇంటివారందరితో కూడా ప్రభువుమీద నమ్మకం ఉంచాడు. శుభవార్త విని కొరింతువారు అనేకులు నమ్మి బాప్తిసం పొందారు.
9 రాత్రి వేళ ప్రభువు పౌలుతో స్వప్న దర్శనంలో ఇలా అన్నాడు: “నిర్భయంగా ఉండి మాట్లాడుతూ ఉండు. ఊరుకోబోకు. 10 నీతో నేను ఉన్నాను. ఈ పట్టణంలో నా జనం అనేకులు గనుక ఎవరూ నీమీద పడి హాని చేయరు.” 11 అందుచేత అతడు వారిమధ్య దేవుని వాక్కు ఉపదేశిస్తూ సంవత్సరంన్నర అక్కడ ఉండిపోయాడు.
12 గల్లియొ అకయ రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు యూదులు ఒక్కుమ్మడిగా పౌలుమీదికి లేచి న్యాయస్థానానికి అతణ్ణి తీసుకువెళ్ళి, 13 “ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించడానికి వీడు ప్రజలను పురికొలుపుతూ ఉన్నాడు” అన్నారు.
14 మాట్లాడడానికి పౌలు నోరు తెరవబోతే గల్లియొ యూదులతో ఇలా అన్నాడు: “యూదులారా! ఒకవేళ ఇది అక్రమ కార్యమూ చెడు నేరాలూ గనుక అయితే నేను మిమ్మల్ని సహించేందుకు కారణం ఉంటుంది. 15 కానీ ఈ సమస్య మాటలనూ పేర్లనూ గురించీ మీ ధర్మశాస్త్రాన్ని గురించీ అయితే మీరే దానిని చూచుకోండి. ఇలాంటివాటిని విచారణ చేయడానికి నాకిష్టం లేదు.”
16 అప్పుడతడు వారిని న్యాయస్థానంలో నుంచి వెళ్ళగొట్టాడు. 17 గ్రీసు వారంతా యూద సమాజకేంద్రం అధికారి అయిన సోస్తెనేసును పట్టుకొని న్యాయస్థానానికి ఎదురుగానే కొట్టారు. అయితే గల్లియొ వీటిలో దేనినీ పట్టించుకోలేదు.
18 పౌలు ఇంకా అనేక రోజులు కొరింతులో ఉండిపోయాడు. తరువాత సోదరుల దగ్గర సెలవు తీసుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. అతనితో కూడా ప్రిస్కిల్ల, అకుల వెళ్ళారు. తనకు మొక్కుబడి ఉన్నందుచేత కెంక్రేయలో పౌలు తల వెంట్రుకలు కత్తిరించుకొన్నాడు. 19 అతడు ఎఫెసు చేరినప్పుడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రం యూద సమాజకేంద్రానికి వెళ్ళి యూదులతో చర్చించాడు. 20 వారతణ్ణి ఇంకా కొంతకాలం ఉండమని కోరారు గాని అతడు ఒప్పుకోక, 21 “నేను జెరుసలంలో రానై ఉన్న పండుగను తప్పక ఆచరించాలి. దేవుని చిత్తమైతే మీ దగ్గరకు తిరిగి వస్తాను” అని చెప్పి వారిదగ్గర సెలవు తీసుకొన్నాడు. అప్పుడు ఓడ ఎక్కి ఎఫెసునుంచి బయలుదేరాడు. 22 సీజరియలో ఓడ దిగి జెరుసలంకు వెళ్ళి సంఘంవారిని కుశలమడిగాడు. తరువాత అంతియొకయకు వెళ్ళాడు.
23 అక్కడ కొంతకాలం గడిపి మళ్ళీ బయలుదేరి గలతీయ, ఫ్రుగియ ప్రాంతాలలో సంచారం చేస్తూ శిష్యులందరినీ స్థిరపరస్తూ ఉన్నాడు.
24  అంతలో అపొల్లో అనే పేరున్న యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు అలెగ్జాండ్రియాలో పుట్టినవాడు. అతడు విద్వాంసుడు, లేఖనాలలో ఆరితేరినవాడు, 25 ప్రభు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. అతడు అత్యాసక్తిపరుడై ప్రభువైన యేసు సంగతులు ఉన్నవి ఉన్నట్టు చెపుతూ ఉపదేశిస్తూ ఉన్నాడు. అయితే యోహాను ఇచ్చిన బాప్తిసం మాత్రమే అతనికి తెలుసు. 26 అతడు యూద సమాజకేంద్రంలో ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతడు చెప్పేది విని అకుల, ప్రిస్కిల్ల అతణ్ణి తీసుకువెళ్ళి దేవుని మార్గాన్ని ఇంకా ఖచ్చితంగా వివరించారు. 27 తరువాత అతడు అకయకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. సోదరులు అతణ్ణి చేర్చుకోవాలని అక్కడి శిష్యులకు వ్రాసి వారిని ప్రోత్సహించారు. అతడు అక్కడ చేరి దేవుని కృపచేత నమ్మకం కలిగినవారికి ఎంతో తోడ్పడ్డాడు. 28 ఎలాగంటే యేసే అభిషిక్తుడు అని లేఖనాల ద్వారా రుజువు చేస్తూ బహిరంగంగానే యూదుల వాదాలను వమ్ము చేశాడు.