17
1 వారు అంఫిపొలి, అపొల్లోనియ గ్రామాల గుండా వెళ్ళి తెస్సలొనీక చేరారు. అక్కడ యూదుల సమాజ కేంద్రం ఒకటి ఉంది. 2 తన అలవాటు ప్రకారం పౌలు వారి సభకు వెళ్ళాడు. మూడు విశ్రాంతి దినాలు లేఖనాలలో నుంచి విషయాలెత్తి వారితో తర్కించాడు. 3 అభిషిక్తుడు బాధలు అనుభవించి చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అని వివరించి నిరూపించాడు. “మీకు నేను ప్రకటించే యేసే అభిషిక్తుడు” అన్నాడు.
4 వారిలో కొందరు, భక్తిపరులైన గ్రీసు దేశస్థులలో చాలామంది, ఘనులైన స్త్రీలు అనేకులు దానికి ఒప్పుకొని పౌలు సైలసుల సహవాసంలో చేరారు. 5 ఒప్పుకోని యూదులైతే అసూయపడ్డారు. కనుక పనీ పాటా లేక బజారులో తిరిగే కొందరు పోకిరీవాళ్ళను పోగుచేసి వెంటబెట్టుకువెళ్ళి పట్టణమంతా అలజడి చేశారు. పౌలు సైలసులను జన సమూహం దగ్గరకు పట్టుకుపోవాలని యాసోను అనే వ్యక్తి ఇంటిమీద పడ్డారు. 6  అక్కడ వారు దొరకపోవడం చేత వీరు యాసోనునూ కొంతమంది సోదరులనూ పట్టణం అధికారుల దగ్గరకు ఈడ్చుకుపోయి కంఠమెత్తి ఇలా అన్నారు: “లోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు. 7 యాసోను వాళ్ళను తన ఇంట్లో చేర్చుకొన్నాడు. చక్రవర్తి గాక యేసు అనే మరో రాజు ఉన్నాడని చెప్పి వాళ్ళంతా చక్రవర్తి శాసనాలకు వ్యతిరేకంగా మసలుకొంటున్నారు.”
8 ఈ మాటలు విని ఆ గుంపు, పట్టణం అధికారులు కలత చెందారు. 9 యాసోను దగ్గర, మిగిలినవారి దగ్గర జామీను తీసుకొన్న తరువాత వారిని విడుదల చేశారు. 10 వెంటనే, చీకటి పడగానే సోదరులు పౌలు సైలసులను బెరియకు పంపివేశారు.
వీరు అక్కడ చేరి యూదుల సమాజ కేంద్రానికి వెళ్ళారు. 11 యూదులు తెస్సలొనీకవారికంటే శ్రేష్ఠ బుద్ధిగలవారు గనుక వాక్కును అత్యాసక్తితో అంగీకరించి పౌలు చెప్పినది సత్యమో కాదో అని ప్రతి రోజూ లేఖనాలు పరిశోధిస్తూ వచ్చారు. 12 అందుచేత వారిలో అనేకులు నమ్మారు. ఘనత వహించిన గ్రీసు దేశస్థులైన స్త్రీ పురుషులు అనేకులు కూడా నమ్మారు. 13  అయితే బెరియలో పౌలు దేవుని వాక్కు ప్రకటించిన సంగతి తెస్సలొనీక యూదులు తెలుసుకొని అక్కడికి కూడా వచ్చి ప్రజలను రేపి కదిలించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్రం ఒడ్డు దగ్గరకు పంపారు. అయితే సైలసు, తిమోతి అక్కడే ఉండిపోయారు. 15 పౌలును సాగనంపడానికి వెళ్ళినవారు ఏథెన్సు వరకు అతణ్ణి తీసుకువెళ్ళారు, సైలసు తిమోతిలు సాధ్యమైనంత త్వరలో తన దగ్గరకు రావాలని పౌలు ఆదేశం ఇవ్వగా విని వారు బయలుదేరి వెళ్ళారు.
16 ఏథెన్సులో పౌలు వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నగరం విగ్రహాలమయంగా ఉండడం చూచి అతడు ఆత్మలో తీవ్ర భావావేశం చెందాడు. 17 అందుచేత అతడు సమాజ కేంద్రంలో యూదులతో, భక్తిపరులైన యూదేతరులతో, బజారులో ప్రతి రోజూ దగ్గరికి వచ్చిన వారితో చర్చిస్తూ వచ్చాడు. 18 కొందరు తత్వజ్ఞానులు అతనికి ఎదురుపడ్డారు. వారు ఎపికూరియన్, స్తోయిక్ శాఖలకు చెందినవారు. కొందరు “ఈ వదరుబోతు ఏం చెప్పాలని ఉన్నాడో!” అని చెప్పుకొన్నారు. అతడు యేసును గురించీ పునర్జీవితాన్ని గురించీ ప్రకటించినందుచేత మరికొందరు “వీడు విదేశీ చిల్లర దేవుళ్ళను ప్రచారం చేస్తున్నట్టున్నాడు” అన్నారు.
19 అప్పుడు వారు అతణ్ణి అరేయొపగస్ సభ దగ్గరకు తీసుకువెళ్ళారు. “మీరు చెపుతున్న ఈ కొత్త ఉపదేశమేమిటో మేము తెలుసుకోవచ్చునా? 20 మీరు కొన్ని వింతైన సంగతులు మా చెవులకు వినిపిస్తున్నారు గనుక వాటి భావమేమిటో తెలుసుకోవాలని ఉన్నాం” అన్నారు. 21 ఏథెన్సువారంతా, అక్కడ నివసించే విదేశీయులు కూడా ఏదైనా కొత్త సంగతి చెప్పడంలోను వినడంలోను మాత్రమే తమ కాలం వెల్లబుచ్చేవారు.
22 అరేయోపగస్ సభలో నిలుచుండి పౌలు ఇలా అన్నాడు: “ఏథెన్సువారలారా, అన్ని విధాల మత విషయాల్లో మీరు భక్తిపరులని గమనిస్తున్నాను. 23 నేను అటూ ఇటూ నడుస్తూ ఉంటే మీరు పూజించే వాటిని చూస్తూ ఉన్నప్పుడు దైవపీఠం ఒకటి నాకు కనబడింది. ‘తెలియబడని దేవునికి’ అని దానిమీద రాసి ఉంది. కాబట్టి మీరు తెలియక పూజించేదెవరో ఆయననే మీకు ప్రకటిస్తున్నాను. 24 జగత్తునూ అందులో సమస్తాన్నీ సృజించిన దేవుడు భూలోకానికీ పరలోకానికీ ప్రభువు గనుక మనిషి చేతులతో చేసిన ఆలయాలలో నివసించడు. 25 తనకు ఏదో కొరత ఉన్నట్టు మనుషుల చేతుల సేవలు అందుకోడు. ఆయనే అందరికీ జీవితాన్నీ ఊపిరినీ సమస్తమైన వాటినీ ప్రసాదిస్తున్నాడు.
26 “భూతలమంతటిమీదా నివసించడానికి ఆయన ఒకే రక్త సంబంధం నుంచి మానవ జాతులన్నిటినీ కలగజేశాడు. వాటికి కాలాలు, నివాస స్థలాల సరిహద్దులు ముందుగానే నిర్ణయించాడు. 27 వారు ప్రభువును వెదకాలని – తడవులాడి ఆయనను కనుక్కోవాలని దేవుడు అలా చేశాడు. అయితే వాస్తవంగా ఆయన మనలో ఎవరికీ దూరంగా లేడు. 28 ఆయనలో మన జీవితం, చలనం, ఉనికి ఉన్నాయి. మీ కవులలో కొందరు చెప్పినట్టు ‘మనం ఆయన సంతానం.’ 29 మనం గనుక దేవుని సంతానమైతే దేవుని స్వభావం బంగారం, వెండి, రాయిలాంటిదని – మనుషులు తమ ఊహ ప్రకారం నేర్పుతో చెక్కిన దానిలాంటిదని మనం తలంచ కూడదు.
30 “జ్ఞానం లేని అలాంటి కాలాలను దేవుడు చూచీ చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే పశ్చాత్తాపపడాలని అంతటా మనుషులందరికీ ఆజ్ఞ ఇస్తున్నాడు. 31 ఎందుకంటే తాను నియమించిన మానవుని ద్వారా తాను ఈ లోకానికి న్యాయంతో తీర్పు తీర్చబోయే రోజును నిర్ణయించాడు. ఆ మానవుణ్ణి చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపడంవల్ల దీని గురించి మనుషులందరికీ విశ్వాస ఆధారమిచ్చాడు.”
32 చనిపోయినవారు సజీవంగా లేవడం గురించి విని కొంతమంది వేళాకోళం చేశారు. మరికొందరైతే “దీన్ని గురించి మీరు చెప్పేది ఇంకో సారి వింటాం” అన్నారు.
33 అప్పుడు పౌలు వారిమధ్య నుంచి వెళ్ళిపోయాడు. 34 అయితే కొందరు అతని సహవాసంలో చేరి విశ్వాసులయ్యారు. వారిలో అరేయొపగస్ సభ్యుడైన దియొనూసియస్, దమరి అనే స్త్రీ, వారితో మరికొందరు ఉన్నారు.