16
1  పౌలు దెర్బేకు, తరువాత లుస్త్రకు వెళ్ళాడు. అక్కడ తిమోతి అనే శిష్యుడు ఉన్నాడు. అతని తల్లి క్రీస్తును నమ్మిన యూదురాలు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. 2 తిమోతి లుస్త్రలో, ఈకొనియలో ఉన్న సోదరులవల్ల మంచి పేరు పొందినవాడు. 3 అతడు తనతో ప్రయాణం చేయాలని పౌలు కోరాడు, గనుక ఆ ప్రాంతం యూదుల కారణంగా అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని వారందరికీ తెలుసు.
4 వారు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ప్రయాణం చేస్తూ పాటించడానికి ఏ నియమాలు జెరుసలంలో ఉన్న క్రీస్తురాయబారులూ పెద్దలూ నిర్ణయించారో వాటిని సంఘాలకు అందజేశారు. 5 కనుక సంఘాలు విశ్వాసంలో స్థిరపడ్డాయి, ప్రతి రోజూ సంఖ్యలో వృద్ధి చెందాయి.
6 వారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతం గుండా వెళ్ళిన తరువాత వారిని పవిత్రాత్మ ఆసియాలో వాక్కు ఉపదేశించ కుండా చేశాడు. 7 ముసియ సరిహద్దులకు చేరినప్పుడు బితూనియలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గాని యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. 8 అందుచేత వారు ముసియను దాటిపోయి త్రోయకు వెళ్ళారు.
9 అక్కడ రాత్రివేళ పౌలుకు స్వప్న దర్శనం కలిగింది. అందులో మాసిదోనియ దేశస్థుడొకడు నిలుచుండి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని అతణ్ణి వేడుకొంటూ పిలిచాడు. 10 అతనికి ఆ దృశ్యం కలిగినప్పుడు, వారికి శుభవార్త ప్రకటించడానికి ప్రభువు మమ్ములను పిలిచాడని మేము నిశ్చయించుకొన్నాం. వెంటనే మాసిదోనియకు వెళ్ళడానికి పూనుకొన్నాం. 11 త్రోయలో ఓడ ఎక్కి ప్రయాణమై తిన్నగా సమొత్రాకే దగ్గరకు వెళ్ళి మరునాడు నెయపొలి చేరుకొన్నాం. 12 అక్కడనుంచి ఫిలిప్పీకి ప్రయాణం చేశాం. మాసిదోనియలోని ఆ ప్రాంతానికి ఫిలిప్పీ ముఖ్య పట్టణం, రోమ్ వారి వలస స్థలం కూడా. ఆ పట్టణంలో మేము కొన్ని రోజులు గడిపాం.
13 పట్టణం బయట నది ఒడ్డున ప్రార్థన స్థలం ఉంటుందనుకొన్నాం గనుక విశ్రాంతి దినాన మేము అక్కడికి వెళ్ళి కూర్చుని అక్కడ సమకూడిన స్త్రీలతో మాట్లాడడం మొదలు పెట్టాం. 14 లూదియ అనే స్త్రీ వింటూ ఉంది. ఆమె తుయతైర పట్టణస్థురాలు, ఊదా రంగు పొడి అమ్మే వర్తకురాలు, దేవుణ్ణి ఆరాధించే స్త్రీ. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినడానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. 15 ఆమె తన ఇంటివారితోపాటు బాప్తిసం పొందిన తరువాత మమ్ములను ఒత్తిడి చేస్తూ “నేను ప్రభువుకు విశ్వాసపాత్రనని మీరనుకొంటే నా ఇంటికి వచ్చి బస చేయండి” అంటూ మమ్ములను ఒప్పించింది.
16 ఒకప్పుడు మేము ప్రార్థన స్థలానికి వెళ్తూ ఉంటే, సోదె చెప్పే దయ్యం పట్టిన బానిస పిల్ల ఒకతె మాకు ఎదురుపడింది. సోదె చెప్పడం మూలంగా ఆమె తన యజమానులకు చాలా లాభం సంపాదించేది. 17 పౌలునూ మమ్ములనూ వెంబడిస్తూ ఆమె ఇలా అరచింది: “ఈ మనుషులు సర్వాతీతుడైన దేవుని దాసులు! ముక్తిమార్గం మనకు ప్రకటిస్తున్నారు!”
18 ఆమె ఇలా అనేక రోజులు చేస్తూ వచ్చింది గనుక పౌలుకు చాలా బాధ అనిపించింది. అతడు ఆమె వైపు తిరిగి, ఆ దయ్యంతో “ఆమెలో నుంచి బయటికి రా! యేసు క్రీస్తు పేర నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అన్నాడు. ఆ ఘడియలోనే అది బయటికి వచ్చింది.
19 ఆమె యజమానులు తమ లాభసాధనం పోయిందని గ్రహించి పౌలు సైలసులను పట్టుకొని ఊరు చావడిలోకి అధికారుల దగ్గరికి ఈడ్చుకుపోయారు. 20 న్యాయాధ్యక్షుల ఎదుటికి వారిని తీసుకుపోయి ఇలా అన్నారు: “ఈ మనుషులు మన పట్టణాన్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. 21 యూదులై ఉండి రోమ్వారమైన మనం అంగీకరించకూడని, పాటించకూడని ఆచారాలు ప్రకటిస్తున్నారు.”
22 జనసమూహం ఒక్కుమ్మడిగా పౌలు సైలసులకు వ్యతిరేకంగా లేచారు. న్యాయాధ్యక్షులు వారి బట్టలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞ జారీ చేశారు. 23 అనేక దెబ్బలు కొట్టించి వారిని చెరసాలలో వేయించారు. వారిని భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞ ఇచ్చారు. 24 అలాంటి ఆజ్ఞ విని అతడు వారిని చెరసాల లోపలి గదిలోకి త్రోసివేసి వారి కాళ్ళు కొయ్యబొండల్లో బిగించాడు.
25 అయితే మధ్యరాత్రి వేళ పౌలు సైలసులు దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిపాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. 26 హఠాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే తలుపులన్నీ తెరచుకొన్నాయి. అందరి సంకెళ్ళూ ఊడిపోయాయి. 27 అప్పుడు చెరసాల అధికారి నిద్ర లేచి చెరసాల తలుపులు తీసి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి ఆత్మహత్య చేసుకోబోయాడు.
28 అప్పుడు పౌలు “ఏ హానీ చేసుకోకు! మేమంతా ఇక్కడే ఉన్నాం” అని కేక వేశాడు.
29 చెరసాల అధికారి దీపం తెమ్మని చెప్పి లోపలికి చొరబడి వణికిపోతూ పౌలు సైలసుల ముందు సాగిలపడ్డాడు. 30 అప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి “అయ్యలారా! పాపవిముక్తి నాకు కలిగేలా నేనేం చేయాలి?” అని అడిగాడు.
31 అందుకు వారు “ప్రభువైన యేసు క్రీస్తు మీద నమ్మకం పెట్టు. అప్పుడు నీకు పాపవిముక్తి కలుగుతుంది. నీకు, నీ ఇంటివారికి కూడా కలుగుతుంది” అని చెప్పారు.
32 అప్పుడు వారు అతనికీ అతని ఇంట్లో వారందరికీ ప్రభు వాక్కు బోధించారు. 33 ఆ రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగాడు. ఆ తరువాతే అతడు, అతని ఇంటివారంతా బాప్తిసం పొందారు. 34 పౌలు సైలసులను తన ఇంటికి వెంటబెట్టుకు వచ్చి వారి ఎదుట భోజనం పెట్టాడు. తనూ తన ఇంటివారంతా దేవుని మీద నమ్మకం ఉంచినందుచేత ఆనందించాడు.
35 ఉదయమైనప్పుడు న్యాయాధ్యక్షులు “ఆ మనుషులను విడుదల చెయ్యి” అని చెప్పడానికి భటులను పంపారు.
36 చెరసాల అధికారి “మిమ్మల్ని విడుదల చేయాలని న్యాయాధ్యక్షులు చెప్పి పంపారు గనుక మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని పౌలుతో చెప్పాడు.
37 అయితే పౌలు వారితో అన్నాడు “రోమ్ పౌరులైన మమ్మల్ని వారు న్యాయ విచారణ చేయకుండా బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించారు. ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా తోసివేస్తారా? అలా కాదు. వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుపోవాలి.”
38 భటులు ఆ మాటలు న్యాయాధ్యక్షులకు తెలియజేశారు. పౌలు సైలసులు రోమ్ పౌరులని విని వారు భయపడ్డారు. 39 వారు వచ్చి వారిని బతిమాలుకొని బయటికి తీసుకువెళ్ళి పట్టణం విడిచి వెళ్ళండని ప్రాధేయపడ్డారు. 40 పౌలు సైలసులు చెరసాలనుంచి లూదియ ఇంటికి వెళ్ళారు. అక్కడ సోదరులను చూచి ప్రోత్సాహపరచిన తరువాత వెళ్ళిపోయారు.