15
1 ✽కొంతమంది యూదయ నుంచి వచ్చి సోదరులకు ఇలా ఉపదేశించారు. “మోషే నియమించిన ఆచారం ప్రకారం సున్నతి పొందకపోతే మీకు పాపవిముక్తి కలగదు.”2 ✽పౌలు బర్నబాలకూ వారికీ మధ్య జరిగిన కలహం, వివాదం ఇంతంత కాదు. అప్పుడు ఈ సమస్యను గురించి పౌలు బర్నబాలూ అక్కడివారిలో మరి కొందరూ జెరుసలంకు క్రీస్తురాయబారుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళాలని నిర్ణయం అయింది. 3 సంఘం వారిని సాగనంపింది. వారు ఫేనీకే, సమరయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యూదేతరులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియజేస్తూ సోదరులందరికీ మహా సంతోషం కలిగించారు. 4 ✝జెరుసలం చేరినప్పుడు వారికి సంఘం, రాయబారులు, పెద్దలు స్వాగతం చెప్పారు. దేవుడు తమచేత జరిగించినదంతా పౌలు బర్నబాలు తెలియజేశారు.
5 ✽ అప్పుడు పరిసయ్యుల✽ తెగలో విశ్వాసులు కొందరు నిలబడి “యూదేతరులకు సున్నతి సంస్కారం చేయించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలని వారిని ఆదేశించాలి” అన్నారు. 6 ఈ సంగతి విచారించడానికి క్రీస్తు రాయబారులూ పెద్దలూ సమకూడారు. 7 ✝దీర్ఘ చర్చ జరిగిన తరువాత పేతురు నిలబడి వారితో ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా! యూదులు కానివారు నా నోటిద్వారా శుభవార్త సందేశం విని నమ్ముకొనేలా కొంతకాలం క్రిందట దేవుడు మనలో నన్ను ఎన్నుకొన్నాడు. ఇది మీకు తెలుసు. 8 ✝✽హృదయాలను ఎరిగిన దేవుడు మనకు పవిత్రాత్మను ప్రసాదించినట్టే వారికీ ప్రసాదించి తద్వారా వారిని స్వీకరించినట్టు సాక్ష్యమిచ్చాడు. 9 ✽మనకూ వారికీ భేదమేమీ చూపకుండా వారి హృదయాలను విశ్వాసంచేత శుద్ధి చేశాడు✽. 10 అయితే, మన పూర్వీకులు గానీ మనం గానీ మోయలేని కాడిని✽ ఆ శిష్యుల మెడమీద పెట్టడం ద్వారా మీరెందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు✽? 11 ✽ప్రభువైన యేసు క్రీస్తు కృపవల్లే వారికి పాపవిముక్తి లభించినట్టే మనకూ లభిస్తుందని నమ్ముతున్నాం.”
12 ✽అక్కడివారంతా మౌనం వహించి బర్నబా పౌలులు యూదేతరులమధ్య తమద్వారా దేవుడు చేసిన వింతలూ సూచనకోసమైన అద్భుతాలూ వివరించి చెప్పగా విన్నారు. 13 వీరు చెప్పడం ముగించిన తరువాత యాకోబు✽ ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా, నేను చెప్పేది వినండి! 14 దేవుడు తన పేరుకోసం ఇతర ప్రజలలోనుంచి జనాన్ని తీసుకోవడానికి✽ వారిని ఏ విధంగా మొదట్లో కటాక్షించాడో సుమెయోను✽ వివరించి చెప్పాడు. 15 ✽ఇందుకు ప్రవక్తల మాటలు సమ్మతిస్తున్నాయి. లేఖనాలలో ఇలా ఉంది గదా: 16 ఆ తరువాత నేను తిరిగి వచ్చి కూలిపోయిన దావీదు నివాసాన్ని మళ్ళీ నిర్మిస్తాను. దాని శిథిలాలను కట్టి, అది మునుపు ఉన్నట్టు దాన్ని మళ్ళీ చేస్తాను. 17 దానివల్ల మనుషులలో మిగిలినవారికి నా పేరు ధరించిన ఇతర జనాలన్నిటికీ ప్రభువును వెదకడానికి వీలుంటుందని ఇవన్నీ జరిగించే ప్రభువు అంటున్నాడు. 18 అనాది కాలంనుంచి దేవునికి తన పనులన్నీ తెలుసు.
19 ✽“కాబట్టి నా నిర్ణయం ఏమిటంటే, ఇతర ప్రజలలో దేవునివైపు తిరిగేవారిని మనం కష్టపెట్టకూడదు. 20 ✽కానీ వారు విగ్రహాలవల్ల అపవిత్రమైనవాటిని,✽ వ్యభిచారాన్ని నిరాకరించాలనీ గొంతు పిసికి చంపినదానిని, రక్తాన్ని తినకూడదనీ వారికి లేఖలు రాసి పంపుదాం. 21 ఎందుకంటే, అనేక తరాలనుంచి మోషే ధర్మశాస్త్రం ప్రకటించేవారు ప్రతి పట్టణంలో ఉన్నారు. దానిని చదవడం ప్రతి విశ్రాంతి దినాన జరుగుతూ ఉంది గదా.”
22 అప్పుడు క్రీస్తు రాయబారులూ పెద్దలూ సంఘమంతటితో కూడా తమలో కొంతమందిని ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియొకయకు పంపడం మంచిదని భావించుకొన్నారు. వారు బర్‌సబ్బా అనే మారు పేరుగల యూదానూ, సైలసు✽నూ ఎన్నుకొన్నారు. వీరు సోదరులలో నాయకులు. 23 ✽వీరిచేత వారు ఈ లేఖ రాసి పంపించారు: “అంతియొకయలో, సిరియాలో, కిలికియలో ఉన్న యూదేతరులైన సోదరులకు క్రీస్తురాయబారులూ పెద్దలూ సోదరులూ అభివందనాలు చెప్పి రాసేదేమిటంటే, 24 ✽మామధ్య నుంచి కొంతమంది వెళ్ళి ‘మీరు సున్నతి సంస్కారం పొంది ధర్మశాస్త్రాన్ని పాటించాలి’ అంటూ తమ మాటలవల్ల మీకు కంగారు కలిగించి మీ మనసులను ఆందోళన పరిచారని విన్నాం. వారికి మేము అలా చేయాలని ఆదేశమివ్వలేదు. 25 అందుచేత ఏకమనసుతో సమకూడి మనుషులను ఎన్నుకొని, 26 మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకోసం తమ ప్రాణాలను తెగించిన మన ప్రియమైన బర్నబా పౌలులతో కూడా మీ దగ్గరకు పంపడం మంచిదని మేము భావించుకొన్నాం. 27 గనుక యూదానూ సైలసునూ పంపుతున్నాం. వారు నోటి మాటలతో ఈ విషయాలు వివరించి చెపుతారు. 28 విగ్రహాలకు అర్పించినవాటిని మీరు నిరాకరించాలి. రక్తాన్నీ గొంతు పిసికి చంపినదానినీ తినకూడదు. వ్యభిచారం చేయకూడదు – 29 ✽ఈ ముఖ్యమైన వాటికి మించి మరే భారమూ మీమీద మోపకపోవడం మంచిదని పవిత్రాత్మకూ మాకూ అనిపించింది. మిమ్మల్ని మీరు వీటికి దూరంగా ఉంచుకొంటే మీకు క్షేమం. మీకందరికీ శుభం.”
30 అప్పుడు వారు పంపబడి అంతియొకయకు వెళ్ళి సంఘాన్ని సమకూర్చి లేఖ అందజేశారు. 31 అక్కడివారు దానిని చదివి దాని ప్రోత్సాహకరమైన✽ మాటలకు ఆనందించారు. 32 యూదా, సైలసు కూడా ప్రవక్తలు✽. వారు చాలా సేపు మాట్లాడి సోదరులకు ప్రోత్సాహం, ధైర్యం కలిగించారు. 33 అక్కడ కొంత కాలం గడిపిన తరువాత, అక్కడి సోదరులు క్రీస్తు రాయబారుల దగ్గరకు అభివందనాలతో వారిని పంపారు. 34 అయితే అక్కడే ఉండిపోవడం సైలసుకు మంచిదనిపించింది. 35 ✽పౌలు బర్నబాలు కూడా అంతియొకయలో ఉండి ఇంకా చాలమందితోకూడా ప్రభు వాక్కు ఉపదేశిస్తూ ప్రకటిస్తూ వచ్చారు.
36 ✽కొన్ని రోజులైన తరువాత పౌలు బర్నబాతో ఇలా అన్నాడు: “మనం ప్రభు వాక్కు ప్రకటించిన పట్టణాలన్నిటికీ తిరిగి వెళ్ళి వాటిలో ఉన్న సోదరులు ఎలా ఉన్నారో చూద్దాం.”
37 ✽ మార్కు అనే మరో పేరుగల యోహానును వెంటబెట్టుకొని వెళ్ళాలని బర్నబా పట్టుదలతో కోరాడు. 38 అయితే మునుపు తమతో సేవ చేయడానికి సాగిపోక పంఫూలియాలో తమను విడిచి వెళ్ళినవాణ్ణి తీసుకుపోవడం తగదని పౌలు నొక్కి చెప్పాడు. 39 ✽వారి మధ్య ఎంత తీవ్ర వివాదం కలిగిందంటే వారిద్దరూ వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి సైప్రస్‌కు వెళ్ళాడు. 40 ✽పౌలు సైలసును ఎన్నుకొన్నాడు. సోదరులు వారిని దేవుని కృపకు అప్పచెప్పిన తరువాత, 41 అతడు బయలుదేరి సిరియా, కిలికియ గుండా సంచరిస్తూ సంఘాలను స్థిరపరుస్తూ ఉన్నాడు.