14
1 ✝ఈకొనియలో ఇలా జరిగింది. వారు కలిసి యూదుల సమాజ కేంద్రంలోకి వెళ్ళి ఏ విధంగా మాట్లాడారంటే పెద్ద సమూహంగా ఉన్న యూదులూ గ్రీసుదేశస్థులూ యేసుప్రభువును నమ్మారు. 2 ✝కానీ నమ్మని యూదులు యూదేతరులను పురికొలిపి వారి మనసులో సోదరులమీద వ్యతిరేక భావం కలిగించారు. 3 ✽అందుచేత పౌలు బర్నబాలు ప్రభు సహాయం ద్వారా ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిచేత సూచకమైన అద్భుతాలూ వింతలూ✽ జరిగించడం మూలంగా తన కృపమయమైన వాక్కు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 4 ✝ఆ పట్టణం జన సమూహాలమధ్య పరస్పర భేదాలు కలిగాయి. కొంతమంది యూదుల పక్షం వహించారు, మరి కొంతమంది అయితే క్రీస్తు రాయబారుల పక్షం వహించారు. 5 ✽యూదులూ, యూదులు కానివారూ తమ అధికారులతోపాటు వారిపై దౌర్జన్యం చేసి రాళ్ళు రువ్వి చంపడానికి పూనుకొన్నారు. 6 ఆ సంగతి తెలిసి వారు లుకయొనియలో ఉన్న లుస్త్ర, దెర్బే అనే పట్టణాలకూ వాటి చుట్టుపట్ల ఉన్న ప్రాంతానికీ తప్పించుకు వెళ్ళారు. 7 అక్కడ కూడా వారు శుభవార్త ప్రకటిస్తూ ఉన్నారు.8 ✽లుస్త్రలో పుట్టు కుంటివాడొకడు కూర్చుని ఉన్నాడు. కాళ్ళలో సత్తువ లేక అతడు ఎన్నడూ నడవలేదు. 9 ✽పౌలు మాట్లాడుతూ ఉంటే అతడు విన్నాడు. పౌలు అతనివైపు తేరి చూచి స్వస్థత పొందడానికి అతనికి నమ్మకం ఉందని గ్రహించి 10 “లేచి చక్కగా నిలబడు!” అని బిగ్గరగా చెప్పాడు. అతడు తటాలున లేచి నడవడం మొదలు పెట్టాడు.
11 ✽ పౌలు చేసినది ప్రజా సమూహాలు చూచి కంఠమెత్తి లుకయొనియ భాషలో ఇలా అన్నారు: “దేవుళ్ళు మానవ రూపం దాల్చి మనదగ్గరికి దిగివచ్చారు.” 12 వారు బర్నబాను “జూస్” అన్నారు, పౌలు ముఖ్య ప్రసంగికుడు కావడంచేత అతణ్ణి “హెర్మిస్” అన్నారు. 13 ✽ జూస్ గుడి ఒకటి ఆ పట్టణానికి ముందుగా ఉంది. దాని పూజారి ఎద్దులనూ పూదండలనూ నగర ద్వారాలకు తీసుకువచ్చాడు. అతడు ప్రజల గుంపులతో కూడా వారికి బలి అర్పించాలని కోరాడు.
14 ఈ సంగతి విని రాయబారులైన పౌలు బర్నబాలు తమ బట్టలు చింపుకొని గుంపులలోకి చొరబడి బిగ్గరగా ఇలా అన్నారు: 15 ✽ “అయ్యలారా! మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మనుషులమే! మీ స్వభావం, మా స్వభావం ఒక్కటే! మీరు ఉపయోగం లేని ఇలాంటి వాటిని విడిచిపెట్టి ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన సజీవుడైన దేవునివైపు తిరగాలని మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. 16 ✽గత కాలాలలో ఆయన అన్ని జాతులవారిని తమ తమ మార్గాలలో నడవనిచ్చాడు. 17 ✽అయినా ఆయన తనను గురించిన సాక్ష్యం లేకుండా చేయలేదు. ఎలాగంటే మనకు ఆకాశంనుంచి వానలూ ఫలవంతమైన రుతువులూ ప్రసాదిస్తూ ఆహారంతోనూ ఉల్లాసంతోనూ మన హృదయాలను తృప్తిపరుస్తూ మంచి చేస్తూ వచ్చాడు.”
18 ✽వారు ఇలా చెప్పినా తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం కష్టసాధ్యమైంది.
19 తరువాత అంతియొకయ నుంచీ ఈకొనియ నుంచీ కొంతమంది యూదులు వచ్చి ఆ గుంపులను ప్రేరేపించారు. పౌలుమీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడనుకొని అతణ్ణి పట్టణం వెలుపలికి ఈడ్చుకుపోయారు. 20 ✽అయితే అతని చుట్టూరా శిష్యులు గుమికూడినప్పుడు అతడు లేచి పట్టణంలో ప్రవేశించాడు. మర్నాడు బర్నబాతో దెర్బేకు వెళ్ళాడు.
21 ఆ పట్టణంలో వారు శుభవార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారు. ఆ తరువాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వెళ్ళి, 22 ✽శిష్యులను స్థిరపరచి విశ్వాసంలో నిలకడగా ఉండాలని ప్రోత్సహించారు. “అనేక బాధలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి” అన్నారు.
23 ✝వారు ప్రతి సంఘంలో వారికోసం పెద్దలను✽ నియమించారు, ఉపవాసముండి ప్రార్థన చేస్తూ వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు. 24 ✽ తరువాత పిసిదియ గుండా ప్రయాణం చేసి పంఫూలియ చేరారు. 25 పెర్గేలో వాక్కు ప్రకటించిన తరువాత అత్తాలియకు వెళ్ళారు. 26 ✝అక్కడ ఓడ ఎక్కి తాము ఇప్పుడు నెరవేర్చిన పనికోసం ఏ అంతియొకయలో దేవుని కృపకు తమను అప్పగించడం జరిగిందో ఆ అంతియొకయకు తిరిగి వెళ్ళారు. 27 ✽అక్కడ చేరినప్పుడు వారు క్రీస్తు సంఘాన్ని సమకూర్చి దేవుడు తమచేత జరిగించినదంతటినీ ఇతర ప్రజలకు ఆయన విశ్వాస ద్వారం తెరిచిన సంగతినీ వివరించి చెప్పారు. 28 తరువాత వారు శిష్యుల దగ్గర చాలా కాలం గడిపారు.