13
1 అప్పుడు అంతియొకయలో ఉన్న క్రీస్తు సంఘంలో కొంతమంది ప్రవక్తలూ ఉపదేశకులూ ఉన్నారు – బర్నబా, నిగెర్ అనే మరో పేరుగల సుమెయోను, కురేనె దేశస్థుడైన లూకియ, రాష్ట్రాధికారి హేరోదుతో పెంచబడ్డ మనయేను, సౌలు. 2 ఒకసారి వారు ప్రభువుకోసం సేవ చేస్తూ ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు పవిత్రాత్మ ఇలా అన్నాడు: “నేను బర్నబానూ సౌలునూ పిలిచిన పనికోసం వారిని నాకు ప్రత్యేకించండి.” 3 వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపారు.
4 పవిత్రాత్మ పంపగా వారు బయలుదేరి సెలూకయకు వెళ్ళారు. అక్కడ ఓడ ఎక్కి సైప్రస్ ప్రయాణం చేశారు. 5 సలమీకి చేరుకొని అక్కడి యూదుల సమాజకేంద్రాలలో దేవుని వాక్కు బోధించారు. యోహాను వారికి సహాయం చేసేవాడు. 6 వారు ఆ ద్వీపం పొడుగున పాఫు వరకు సంచారం చేశారు. అక్కడ మాంత్రికుడూ కపటప్రవక్తా అయిన ఒక యూదుడు కనిపించాడు. పేరు బర్‌యేసు. 7 అతడు సెర్గి పౌలు అనే ప్రాంతీయాధికారితో ఉన్నాడు. సెర్గి పౌలు తెలివైనవాడు. అతడు దేవుని వాక్కు వినడానికి కోరుతూ బర్నబా సౌలులను పిలిపించాడు. 8 అయితే ఆ అధికారిని విశ్వాసంనుంచి తొలగించడానికి ఈ ‘ఎలుమ’ ప్రయత్నం చేస్తూ వారిని ఎదిరించాడు (‘ఎలుమ’ అనే పేరుకు మాంత్రికుడని అర్థం).
9 అప్పుడు సౌలు అతడు పౌలు కూడా అనబడ్డవాడు, పవిత్రాత్మతో నిండినవాడై అతనివైపు తేరి చూస్తూ ఇలా అన్నాడు: 10 “అపనింద పిశాచం కొడుకా! సమస్త నీతిన్యాయాలకు విరోధీ! అన్ని రకాల కపటంతో, మోసంతో నిండినవాడా, ప్రభువుయొక్క తిన్నని మార్గాలు వక్రంగా త్రిప్పడం మానుకోవా? 11 ఇదిగో విను! ప్రభువు నీమీద చెయ్యి ఎత్తాడు. నీవు కొంత కాలం గుడ్డివాడివై సూర్యకాంతిని చూడకుండా ఉంటావు.”
అప్పటికప్పుడే నల్లని పొగమంచు అతని మీదికి దిగి వచ్చింది. ఎవరైనా తన చేయి పట్టుకొని నడిపించాలని అతడు దేవులాడుతూ తిరగసాగాడు. 12 జరిగినది చూచినప్పుడు ఆ ప్రాంతీయాధికారి ప్రభు ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడి నమ్ముకొన్నాడు.
13 తరువాత పౌలూ అతనితో ఉన్నవారూ ఓడ ఎక్కి పాఫునుంచి బయలుదేరి పంఫూలియాలో ఉన్న పెర్గే చేరారు. అప్పుడు యోహాను వారిని విడిచిపెట్టి జెరుసలంకు తిరిగి వెళ్ళాడు. 14 వారైతే పెర్గేనుంచి పిసిదియలోని అంతియొకయకు వెళ్ళారు. విశ్రాంతి దినాన యూద సమాజ కేంద్రానికి వెళ్ళి కూర్చున్నారు. 15  ధర్మశాస్త్రంలో ఒక భాగం, ప్రవక్తల లేఖనాలలో ఒక భాగం చదవడం జరిగిన తరువాత సమాజ కేంద్రం అధికారులు వారికి ఈ మాట పంపారు: “అయ్యలారా, సోదరులారా! ప్రజలకోసం మీకు ప్రోత్సాహ వాక్కేదైనా ఉంటే చెప్పండి.”
16 అప్పుడు పౌలు నిలబడి చేసైగ చేసి ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ మనుషులారా! దేవుడంటే భయభక్తులు ఉన్నవారలారా! వినండి! 17 ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మన పూర్వీకులను ఎన్నుకొన్నాడు. ఈ ప్రజలు ఈజిప్ట్‌దేశంలో విదేశీయులుగా ఉన్న కాలంలో ఆయన వారిని ఉన్నత స్థితికి హెచ్చించి పైకెత్తిన హస్తంతో అక్కడనుంచి తీసుకువచ్చాడు. 18 ఎడారిలో సుమారు నలభై ఏండ్లు వారిని ఓర్చుకొన్నాడు. 19 కనాను దేశంలో ఆయన ఏడు జాతులను నాశనం చేసి వాటి దేశాన్ని వీరికి వారసత్వంగా పంచి ఇచ్చాడు.
20 “ఆ తరువాత ఆయన సుమారు నాలుగు వందల యాభై ఏళ్ళుగా ప్రవక్త అయిన సమూయేలు వరకు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. 21 అప్పుడు రాజు కావాలని వారు కోరారు. బెన్యామీను గోత్రికుడూ కీషు కొడుకూ అయిన సౌలును దేవుడు వారికి నియమించాడు. అతడు నలభై ఏళ్ళు పరిపాలించాడు. 22 అతణ్ణి తొలగించిన తరువాత ఆయన దావీదును వారికి రాజుగా హెచ్చించాడు, అతని విషయం ఇలా సాక్ష్యమిస్తూ చెప్పాడు: ‘యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా హృదయానికి అనుగుణంగా ఉన్నవాడు, నా సంకల్పమంతా నెరవేరుస్తాడు.’
23 “అతని సంతానంలో నుంచి దేవుడు తన వాగ్దానం ప్రకారం ఇస్రాయేల్‌కు ఒక రక్షకుణ్ణి హెచ్చించాడు. ఆయనే యేసు. 24 ఆయన రాకముందు యోహాను ఇస్రాయేల్ ప్రజలందరికీ పశ్చాత్తాపం విషయమైన బాప్తిసం మొదట ప్రకటించాడు. 25 యోహాను తన సేవ ముగిస్తూ ‘నేను ఎవరిననుకొంటున్నారు? నేను ఆయనను కాను. ఇదిగో వినండి, నా తరువాత ఒకరు వస్తున్నారు. ఆయన కాళ్ళకు ఉన్న చెప్పులు విప్పడానికి కూడా నేను తగను’ అన్నాడు.
26 “అయ్యలారా, సోదరులారా! అబ్రాహాము వంశీయులారా! మీ మధ్య దేవుడంటే భయభక్తులున్నవారలారా! ఈ రక్షణ సందేశం మీకు పంపబడి ఉంది. 27  జెరుసలం నివాసులూ వారి అధికారులూ ఆయనను గుర్తించలేదు. ప్రతి విశ్రాంతి దినమూ చదివే ప్రవక్తల పలుకులను కూడా గ్రహించలేదు. అందుచేతే ఆయనకు శిక్ష విధించడం ద్వారా వారు ఆ పలుకులను నెరవేర్చారు. 28 మరణశిక్షకు తగిన కారణం దొరకకపోయినా ఆయనను చంపించాలని పిలాతును ప్రాధేయపడ్డారు. 29 ఆయన విషయం రాసి ఉన్నదంతా వారు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుంచి దింపి సమాధిలో పెట్టారు.
30 “అయితే దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి సజీవంగా లేపాడు. 31 తరువాత ఆయన, తనతో గలలీనుంచి జెరుసలంకు వచ్చినవారికి అనేక దినాలు కనిపిస్తూ వచ్చాడు. ఇప్పుడు మన ప్రజలకు వారు ఆయన సాక్షులు. 32 మేము మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. ఏమంటే, దేవుడు యేసును లేపి మన పూర్వీకులకు చేసిన వాగ్దానం వారి సంతానమైన మనకోసం నేరవేర్చాడు. 33 దీనికి అనుగుణంగా రెండో కీర్తనలో ఇలా రాసి ఉంది: ‘నీవు నా కుమారుడవు. ఈ రోజు నిన్ను కన్నాను’.
34 “ఆయన శరీరం ఎన్నడూ కుళ్ళిపోకుండా ఆయనను చనిపోయినవారిలో నుంచి దేవుడు ఆయనను లేపిన సంగతిని గురించి ఇలా అన్నాడు: ‘దావీదు గురించిన నిశ్చయమైన దీవెనలు నీకిస్తాను.’
35 “అందుచేత మరో కీర్తనలో ఆయన ఇలా అన్నాడు: ‘నీ పవిత్రుణ్ణి కుళ్ళు పట్టనియ్యవు.’
36 “దావీదు దేవుని సంకల్పం ప్రకారం తన తరంవారికి సేవ చేసి కన్ను మూశాడు. తన పూర్వీకుల దగ్గర పూడ్చి పెట్టబడి కుళ్ళిపోయాడు. 37 అయితే దేవుడు లేపినవాడు మాత్రం కుళ్ళిపోలేదు.
38 “అందుచేత, సోదరులారా, ఈ విషయం మీకు అర్థం కావాలని కోరుతున్నాంయేసుద్వారానే మీకు పాపక్షమాపణ దొరుకుతుందని ప్రకటిస్తున్నాం. 39 మోషే ధర్మశాస్త్రం ద్వారా మీరు ఏ విషయాలలో నిర్దోషులుగా ఎంచబడలేకపోయారో ఆ విషయాలన్నిటిలో, యేసును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన ద్వారా నిర్దోషుల లెక్కలోకి వస్తారు.
40 “కనుక ప్రవక్తల లేఖనాలలో చెప్పినది మీమీదికి రాకుండా చూచుకోండి. 41 అదేమిటంటే, ‘ఇదిగో వినండి తిరస్కరించే వారలారా! ఆశ్చర్యపడి నశించండి! మీ రోజులలో నేను ఒక పని చేస్తాను. ఆ పని గురించి మీకు ఎవరైనా చెపితే మీరు నమ్మేవారు కారు.”
42 యూదులు సమాజ కేంద్రంలోనుంచి వెళ్ళిపోతూవుంటే, ఈ సంగతులు మరుసటి విశ్రాంతి దినాన ఈ మాటలు తమతో బోధించాలని యూదులు కాని ప్రజలు వేడుకొన్నారు. 43 సమాజకేంద్రంలో సభ ముగిసిన తరువాత చాలామంది యూదులూ యూద మతంలో ప్రవేశించిన భక్తిపరులూ పౌలు బర్నబాల వెంట వెళ్ళారు. వీరు వారితో మాట్లాడుతూ దేవుని అనుగ్రహంలో నిలిచి ఉండాలని వారిని ఒప్పించారు.
44 మరుసటి విశ్రాంతి దినాన దాదాపు ఆ పట్టణం అంతా దేవుని వాక్కు వినడానికి సమకూడింది. 45  అయితే ఆ గుంపుల్ని చూచి యూదులు అసూయతో నిండిపోయారు. పౌలు చెప్పినదానిని కాదంటూ దూషిస్తూ వ్యతిరేకించారు. 46  అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా ఇలా అన్నారు:
“దేవుని వాక్కు మొట్టమొదట మీకు చెప్పడం తప్పనిసరి. మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే శాశ్వత జీవానికి అయోగ్యులుగా పరిగణించుకొంటున్నారు, గనుక ఇదిగో వినండి, మేమిప్పుడు యూదులు కానివారి వైపుకు తిరుగుతాం. 47 ఎందుకంటే, ప్రభువు మాకు ఇలా ఆదేశించాడు. నీవు రక్షణగా భూమి కొనలవరకు ఉండేలా నిన్ను ఇతర జనాలకు వెలుగుగా చేశాను.”
48 ఇది విని యూదులు కాని ప్రజలు సంతోషించి ప్రభు వాక్కును గౌరవించారు. శాశ్వత జీవానికి నిర్ణయించబడ్డ వారందరూ నమ్మారు.
49 ప్రభు వాక్కు ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. 50 కానీ యూదులు భక్తిమర్యాదలు గల ముఖ్య స్త్రీలనూ ఆ పట్టణం ప్రముఖులనూ పురికొలిపి పౌలు బర్నబాలకు హింస కలిగించి వారిని తమ ప్రాంతంనుంచి బయటికి వెళ్ళగొట్టారు. 51  వీరు తమ కాళ్ళ దుమ్ము వారికి ఎదురుగా దులిపివేసి ఈకొనియకు వెళ్ళారు. 52 ఆ శిష్యులు ఆనందంతో, పవిత్రాత్మతో నిండిపోయారు.