12
1 సుమారుగా ఆ కాలంలోనే హేరోదురాజు క్రీస్తు సంఘంలో కొందరిని హింసించడానికి చేయి చాచాడు. 2 యోహాను తోబుట్టువైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. 3 అది యూదులకు నచ్చిందని గ్రహించి పేతురును కూడా ఖైదు చేశాడు. అవి పొంగని రొట్టెల పండుగ రోజులు. 4 అతణ్ణి ఖైదు చేసి చెరసాలలో వేయించి నలుగురు సైనికులున్న నాలుగు గుంపులు కావలి కాసేలా అతణ్ణి వారికి అప్పగించాడు. పస్కాపండుగ తరువాత తీర్పుకోసం ప్రజల ఎదుటికి అతణ్ణి తేవాలని హేరోదు ఆశయం.
5 పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు, సంఘమైతే అతని కోసం దేవునికి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. 6 హేరోదు అతణ్ణి బయటికి తీసుకురాబోతూ ఉంటే అదే రాత్రి పేతురు ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. రెండు సంకెళ్ళతో బంధించబడి ఉన్నాడు. బయటి తలుపు దగ్గర కాపలాదారులు చెరసాలను కావలి కాస్తూ ఉన్నారు.
7  హఠాత్తుగా ప్రభు దూత ఒకడు అతని దగ్గర నిలుచుండడం కనిపించాడు. చెరసాలలో వెలుగు ప్రకాశించింది. ఆయన పేతురు ప్రక్కను తట్టి “త్వరగా లే!” అని చెప్పి అతణ్ణి లేపాడు. సంకెళ్ళు అతని చేతులనుంచి ఊడిపడ్డాయి. 8 ప్రభు దూత “నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో!” అని అతనితో అన్నాడు. అతడు అలా చేశాడు. అప్పుడు ప్రభు దూత “నీ పైవస్త్రం వేసుకొని నా వెంట రా!” అని అతనితో చెప్పాడు. 9 అతడు ఆయనను అనుసరిస్తూ బయటికి వెళ్ళాడు, అయితే ప్రభు దూత జరిగిస్తున్నది వాస్తవంగా జరుగుతున్నట్టు అతడు గ్రహించలేదు. తనకు స్వప్న దర్శనం కలిగింది అనుకొన్నాడు. 10 వారు మొదటి కావలిని, రెండో కావలిని దాటిపోయి నగరానికి పోయే ద్వారంలో ఉన్న ఇనుప తలుపు దగ్గరకు వచ్చారు. వారి కోసం ఆ తలుపు దానంతట అదే తెరచుకొంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటేవరకు నడిచిన వెంటనే దేవదూత అతణ్ణి విడిచివెళ్ళాడు.
11 అప్పుడు పేతురుకు తెలివి వచ్చింది. “ప్రభువు నిజంగా తన దూతను పంపాడు! హేరోదు చేతిలోనుంచి, యూదప్రజలు ఎదురు చూచిన వాటన్నిటినుంచీ తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకొన్నాడు. 12  ఈ విధంగా తలపోసుకొంటూ అతడు మరియ ఇంటికి వెళ్ళాడు. ఈ మరియ మార్కు అనే మారు పేరుగల యోహానుకు తల్లి. అక్కడ చాలామంది సమకూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 13 అతడు తలవాకిటి తలుపు తట్టినప్పుడు రొదే అనే పిల్ల తలుపు తీయడానికి వచ్చింది. 14 ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి అమిత సంతోషంతో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తివెళ్ళి “పేతురు తలుపు ముందు నిలుచున్నాడు” అని చెప్పింది.
15 అందుకు వారు ఆమెతో “నీకు మతి తప్పింది!” అన్నారు. అయితే తానన్నది నిజమని ఆమె నొక్కి నొక్కి చెప్పింది. అప్పుడు వారు “అతని దేవదూత ఉన్నాడు అక్కడ” అన్నారు.
16 ఈలోగా పేతురు తలుపు ఇంకా తట్టుతూనే ఉన్నాడు. వారు తలుపు తీసి అతణ్ణి చూచి ఎంతో ఆశ్చర్యపోయారు. 17 ఊరుకోండని అతడు వారికి చేసైగ చేసి తనను చెరసాలనుంచి ప్రభువు ఎలా తప్పించాడో వివరించి చెప్పాడు. “వెళ్ళి యాకోబుకూ సోదరులకూ ఈ సంగతులు తెలియజేయండి” అని చెప్పి బయలుదేరి వేరే చోటికి వెళ్ళాడు.
18 పగలైనప్పుడు “పేతురు ఏమైనట్టు?” అని సైనికులలో కలిగిన గాబరా అంతింత కాదు. 19 హేరోదు అతని కోసం గాలించాడు. అతడు ఎక్కడా కనిపించక పోయినందుచేత కావలివారిని విచారణ చేసి చంపాలని ఆజ్ఞ జారీ చేశాడు. తరువాత హేరోదు యూదయనుంచి సీజరియకు వెళ్ళి అక్కడ ఉండిపోయాడు.
20 హేరోదు తూరు సీదోనులవారి మీద తీవ్ర కోపంతో మండిపడ్డాడు. ఆహారం విషయంలో వారి దేశానికి ఆధారం హేరోదురాజు దేశమే గనుక వారు ఏక మనసుతో అతని దగ్గరకు వచ్చారు. వారు రాజు సన్నిహిత సేవకుడైన బ్లాస్తును తమ పక్షంగా చేసుకొని సమాధానపడాలని అతణ్ణి ప్రాధేయ పడ్డారు. 21 నిర్ణయమైన రోజున హేరోదు రాజవస్త్రాలు తొడుక్కొని తన సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసం చేయసాగాడు. 22 ప్రజలు “ఇది ఒక దేవుడి స్వరమే గాని మనిషిది కాదు!” అని కేకలు పెట్టారు. 23 తక్షణమే ప్రభు దేవదూతల్లో ఒకడు అతణ్ణి మొత్తాడు. ఎందుకంటే అతడు మహిమ దేవునికర్పించలేదు. అతడు పురుగులు పడి చచ్చాడు.
24 దేవుని వాక్కైతే అంతకంతకు వ్యాపిస్తూ విస్తరిల్లుతూ ఉంది.
25  బర్నబా సౌలులు తమ సేవ ముగించి జెరుసలంనుంచి తిరిగి వెళ్ళారు. మార్కు అనే మారుపేరుగల యోహానును వెంటబెట్టుకువెళ్ళారు.