11
1 యూదులు కానివారు కూడా దేవుని వాక్కు అంగీకరించారని క్రీస్తు రాయబారులూ యూదయలో ఉన్న సోదరులూ విన్నారు. 2 ✽పేతురు జెరుసలంకు వచ్చినప్పుడు సున్నతి గలవారు అతనితో వాదం పెట్టుకొని, 3 ✽ “సున్నతి పొందనివారి దగ్గరికి వెళ్ళి వారితో భోజనం చేశావు!” అన్నారు.4 అందుకు పేతురు మొదటినుంచి జరిగిన విషయమంతా వరుసగా వారికిలా వివరించి చెప్పాడు: 5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేస్తూ ఉంటే పారవశ్యంలో నాకు దర్శనం కలిగింది. పెద్ద దుప్పటి లాంటిదానిని దాని నాలుగు చెంగులు పట్టి ఆకాశం నుంచి దించడం చూశాను. అది నా దగ్గరికే వచ్చింది. 6 నేను దానిలోకి పరిశీలనగా తేరిచూస్తూ ఉంటే నాలుగు కాళ్ళున్న భూజంతువులూ అడవి మృగాలూ ప్రాకే ప్రాణులూ గాలిలో ఎగిరే పక్షులూ కనిపించాయి.
7 “అప్పుడు ‘పేతురూ! లే! చంపుకొని తిను!’ అని నాతో చెప్పిన స్వరం వినిపించింది. 8 అందుకు నేను అన్నాను, ‘అలా కాదు, ప్రభూ! నిషిద్ధమైనది, అశుద్ధమైనది ఏదీ నా నోట ఎన్నడూ పడలేదు’. 9 రెండోసారి పరలోకంనుంచి ఆ వాణి వినిపించింది, ‘దేవుడు శుద్ధం చేసినవాటిని నీవు నిషిద్ధం అనకూడదు’. 10 ముమ్మారు ఈ విధంగా సంభవించింది. అప్పుడు అదంతా ఆకాశానికి ఎత్తడం జరిగింది.
11 “వెంటనే సీజరియనుంచి నా దగ్గరకు పంపిన ముగ్గురు మనుషులు నేనున్న ఇంటి ఎదుట చేరి నిలిచారు. 12 సందేహించక వారితో వెళ్ళిపొమ్మని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. ఈ ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేము ఆ మనిషి ఇంట్లో ప్రవేశించాం. 13 అతడు మాకు తెలియజేసినది ఏమిటంటే, తన ఇంట్లో నిలుచున్న ఒక దేవదూతను చూశాడు. దేవదూత ఇలా అన్నాడు: ‘యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరుగల సీమోనును పిలిపించుకో. 14 ✽ అతడు మీతో చెప్పే మాటలద్వారా నీకూ నీ ఇంటివారికీ పాపవిముక్తి కలుగుతుంది.’
15 ✝“నేను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు పవిత్రాత్మ ఆరంభంలో మనమీదికి దిగివచ్చినట్లే వారిమీదికి దిగివచ్చాడు. 16 ✝‘యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు గాని మీరు పవిత్రాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నాకు గుర్తుకు వచ్చింది. 17 ✝ప్రభువైన యేసు క్రీస్తుమీద నమ్మకం ఉంచిన మనకు అనుగ్రహించిన ఉచిత వరమే దేవుడు వారికి కూడా అనుగ్రహించాడంటే దేవుణ్ణి అడ్డగించడానికి నేనేపాటివాణ్ణి?”
18 ✽ఈ మాటలు విని వారు మరేమీ అభ్యంతరం చెప్పక “అలాగైతే జీవానికి దారితీసే పశ్చాత్తాపం దేవుడు ఇతర ప్రజలకు కూడా దయ చేశాడు” అంటూ దేవుణ్ణి స్తుతించారు.
19 ✝స్తెఫను విషయంలో కలిగిన హింస కారణంగా చెదరిపోయినవారు ఫీనీకే✽, సైప్రస్✽, అంతియొకయ✽ ప్రదేశాలవరకు వెళ్ళిపోతూ వాక్కు యూదులకు మాత్రమే చెపుతూ ఉన్నారు. 20 ✽అయితే వారిలో కొంతమంది సైప్రస్ పౌరులు, కురేనె పౌరులు. వారు అంతియొకయకు వెళ్ళి గ్రీసు దేశస్తులతో కూడా మాట్లాడుతూ యేసుప్రభువును ప్రకటించారు. 21 ✽ప్రభు హస్తం వారికి తోడై ఉంది గనుక అనేకులు నమ్మి ప్రభువు వైపుకు మళ్ళారు.
22 ఈ విషయాల గురించిన మాట జెరుసలంలోని సంఘానికి వినవచ్చింది. వారు బర్నబా✽ను అంతియొకయ వరకు వెళ్ళాలని పంపారు. 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి✽ ఆనందించాడు, ప్రభువుతో హృదయపూర్వకంగా స్థిరంగా నిలిచివుండాలని వారందరినీ ప్రోత్సహించాడు.
24 ✽అతడు మంచివాడు. పవిత్రాత్మతోను విశ్వాసంతోను నిండి ఉన్నవాడు గనుక చాలామంది ప్రభువు పక్షం చేరారు.
25 తరువాత బర్నబా పౌలును వెదకడానికి తార్సుకు వెళ్ళాడు. 26 అతణ్ణి కనుగొని అతణ్ణి అంతియొకయకు తీసుకువచ్చాడు. ఒక సంవత్సరమంతా వారు సంఘం✽తో కలుసుకొంటూ అనేకులకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. అంతియొకయలోనే మొదటిసారిగా శిష్యులను “క్రైస్తవులు” అనడం జరిగింది.
27 ✽ఆ రోజులలో ప్రవక్తలు కొందరు జెరుసలంనుంచి అంతియొకయకు వచ్చారు. 28 ✽వారిలో ఒకడైన అగబు అనేవాడు నిలబడి లోకమంతటికీ గొప్ప కరవు వస్తుందని దేవుని ఆత్మమూలంగా సూచించాడు. అది క్లౌదియ✽ సీజర్ పరిపాలన కాలంలో జరిగింది. 29 ✽అప్పుడు శిష్యులు తమలో ప్రతి ఒక్కరూ శక్తికొలది ఇచ్చి యూదయలో కాపురమున్న సోదరుల సహాయంకోసం పంపాలని నిశ్చయించుకొన్నారు. 30 ✽వారు అలా చేసి బర్నబా సౌలుల చేతుల్లో ఉంచి ఆ సొమ్మును అక్కడి పెద్దల దగ్గరకు పంపించారు.