10
1 సీజరియలో కొర్నేలి అనే మనిషి ఉండేవాడు. అతడు ఇటలీ దళానికి చెందిన శతాధిపతి. 2 అతడు భక్తిపరుడు. దేవుడంటే అతనికీ అతని ఇంటివారందరికీ భయభక్తులు. అతడు ప్రజలకు ధారాళంగా దానధర్మాలు చేసేవాడు, దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. 3 ఒకప్పుడు పగలు సుమారు మూడు గంటలకు దర్శనంలో ఒక దేవదూత అతనికి తేటగా కనిపించాడు. ఆ దూత లోపలికి వచ్చి “కొర్నేలీ!” అని అతణ్ణి పిలిచాడు.
4 అతడు దూతవైపు తేరిచూస్తూ హడలిపోయి “ఏమిటి ప్రభూ!” అన్నాడు. దేవదూత అతనితో ఇలా అన్నాడు: “నీ ప్రార్థనలూ నీ దానధర్మాలూ దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థంగా చేరాయి. 5 ఇప్పుడు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరు గల సీమోనును పిలిపించుకో. 6 సముద్ర తీరాన చర్మకారుడైన సీమోను ఇంట్లో అతడు బస చేస్తున్నాడు. నీవు ఏమి చేయాలో అతడు చెపుతాడు.”
7 అతనితో మాట్లాడిన దేవదూత వెళ్ళిపోయిన తరువాత కొర్నేలి తన ఇంటి పని మనుషులలో ఇద్దరిని, తనకు ఎప్పుడూ సేవ చేసే సైనికులలో భక్తిపరుడొకణ్ణి పిలిచాడు, 8 విషయాలన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు.
9 మరుసటి రోజు వారు ప్రయాణం చేస్తూ పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలకు ప్రార్థన చేయడానికి పేతురు ఇంటి పైకప్పు మీదికి వెళ్ళాడు. 10 అతనికి చాలా ఆకలి వేసి భోజనం చేయాలనిపించింది. అయితే ఇంటివారు సిద్ధం చేస్తూవుంటే అతడు పరవశుడు అయ్యాడు. 11 ఆకాశం తెరచుకొని పెద్ద దుప్పటిలాంటి దానిని దాని నాలుగు చెంగులు పట్టి తనవైపుకు భూమి మీదికి దించడం జరిగినట్లుగా చూశాడు. 12 దానిలో నాలుగు కాళ్ళున్న అన్ని రకాల భూజంతువులూ ప్రాకే ప్రాణులూ గాలిలో ఎగిరే పక్షులూ ఉన్నాయి.
13 అప్పుడు అతనికి ఒక వాణి ఇలా వినిపించింది: “పేతురూ, లే! చంపుకొని తిను!”
14 అందుకు పేతురు “అలా కాదు, ప్రభూ! నిషిద్ధమైనది, అశుద్ధమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు” అన్నాడు.
15  “దేవుడు శుద్ధం చేసినవాటిని నీవు నిషిద్ధం అనకూడదు” అని మళ్ళీ రెండో సారి ఆ స్వరం అతనికి వినిపించింది. 16 ఈ విధంగా మూడు సార్లు జరిగింది. వెంటనే ఆ దుప్పటిలాంటిదానిని ఆకాశానికి ఎత్తడం జరిగింది.
17 తాను చూచిన దర్శన భావం ఏమిటో అని పేతురు కలవరపడుతూ ఉండగానే కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని అడిగి తెలుసుకొని గుమ్మం దగ్గర నిలబడుతూ 18 ఇంటి వారిని పిలిచి “పేతురు అనే మారు పేరు గల సీమోను ఇక్కడ బస చేస్తున్నాడా?” అని అడిగారు.
19 పేతురు ఆ దర్శనాన్ని గురించి తలపోసుకొంటూవుంటే, దేవుని ఆత్మ అతనితో ఇలా అన్నాడు: “ఇదిగో విను! ముగ్గురు మనుషులు నిన్ను వెదకుతున్నారు. 20 వారిని పంపినది నేనే గనుక లేచి క్రిందికి దిగి అనుమానమేమీ లేకుండా వారితో వెళ్ళు.”
21 పేతురు క్రిందికి దిగి తన దగ్గరకు కొర్నేలి పంపగా వచ్చిన ఆ మనుషుల దగ్గరకు వెళ్ళి “మీరు వెతుకుతున్నది నేనే. మీరు వచ్చిన కారణం ఏమిటి?” అన్నాడు.
22 అందుకు వారు “కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులున్న మనిషి, యూద ప్రజలందరిలో మంచి పేరు గడించినవాడు. మిమ్మల్ని తన ఇంటికి పిలిచి మీరు చెప్పే మాటలు వినాలని పవిత్ర దేవదూత ద్వారా అతనికి దైవాజ్ఞ వచ్చింది” అన్నారు.
23 అప్పుడతడు వారిని లోపలికి పిలిచి అతిథి మర్యాదలు చేశాడు. మరుసటి రోజు అతడు వారితో వెళ్ళాడు. యొప్పేనుంచి కొంతమంది సోదరులు కూడా అతనితో వెళ్ళారు. 24 మరుసటి రోజు వారు సీజరియకు చేరారు. అప్పటికి కొర్నేలి వారికోసం చూస్తూ తన చుట్టాలనూ ప్రాణ స్నేహితులనూ పిలిచాడు. 25 పేతురు ముంగిటిలోకి రాగానే కొర్నేలి అతణ్ణి కలుసుకొని అతని పాదాల దగ్గర పడి నమస్కారం చేశాడు. 26 అయితే పేతురు అతణ్ణి లేవనెత్తుతూ “లేచి నిలబడు! నేను కూడా మనిషినే!” అన్నాడు.
27 అతనితో మాట్లాడుతూ ఇంటి లోపలికి వెళ్ళి చాలామంది సమకూడి ఉండడం చూశాడు. 28  అప్పుడతడు వారితో ఇలా అన్నాడు: “యూదుడు కాని మనిషితో సాంగత్యం చేయడం గానీ అలాంటివాణ్ణి సందర్శించడం గానీ యూదుడికి ఎంత శాసనవిరుద్ధమో మీకు తెలుసు. కాని, ఎవరినీ నిషిద్ధమైనవారనీ అశుద్ధులనీ అనకూడదని నాకు దేవుడు వెల్లడి చేశాడు. 29 అందుచేతే నన్ను పిలిచినవెంటనే అభ్యంతరమేమీ చెప్పక వచ్చాను. ఇంతకూ నన్నెందుకు పిలిపించినట్టు? అదీ నేనడిగేది.”
30 అందుకు కొర్నేలి ఇలా అన్నాడు: “నాలుగు రోజుల క్రిందట ఇదేవేళ వరకు ఉపవాసమున్నాను. పగలు మూడు గంటల సమయంలో ఇంట్లో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే వస్త్రాలు తొడుక్కొన్న వ్యక్తి నా ఎదుట నిలుచున్నాడు. 31 ఆయన అన్నాడు: ‘కొర్నేలీ! నీ ప్రార్థనలు దేవుని సన్నిధానంలో వినబడ్డాయి. నీ దానధర్మాలు జ్ఞాపకంలో ఉన్నాయి. 32 కనుక యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే మారు పేరుగల సీమోనును పిలిపించుకో. సముద్ర తీరాన చర్మకారుడైన సీమోను ఇంట్లో అతడు బస చేస్తున్నాడు. అతడు వచ్చినప్పుడు నీతో మాట్లాడుతాడు.’ 33 వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు వచ్చినది మంచిది. చెప్పమని దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలన్నీ వినడానికి ఇప్పుడు మేమంతా ఇక్కడ దేవుని ఎదుట సమకూడి ఉన్నాం.”
34  అందుకు పేతురు నోరు తెరచి ఇలా మాట్లాడసాగాడు: “దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు నాకు రూఢిగా అర్థం అయింది. 35 ప్రతి జనంలోనూ తనమీద భయభక్తులు ఉంచి న్యాయంగా నడుచుకొనేవారిని ఆయన స్వీకరిస్తాడని గ్రహిస్తున్నాను.
36 “యేసు క్రీస్తు సమస్తానికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి శుభవార్త బోధిస్తూ ఇస్రాయేల్‌ప్రజలకు సందేశం పంపాడు. 37 ఆ సందేశం మీకు తెలుసు. యోహాను బోధించిన బాప్తిసం తరువాత గలలీలో ఆరంభమై యూదయలో అంతటా ఆ సందేశం ప్రకటించడం జరిగింది. 38 అంటే, దేవుడు నజరేతువాడైన యేసును పవిత్రాత్మతో బలప్రభావాలతో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడైవున్నాడు గనుక ఆయన మేలు చేస్తూ, అపనింద పిశాచం పీడించిన వారందరిని బాగు చేస్తూ సంచరిస్తూ ఉన్నాడు. 39 యూదుల దేశంలో, జెరుసలంలో ఆయన చేసినవాటన్నిటికీ మేము సాక్షులం. ఆయనను వారు మ్రానుకు వ్రేలాడదీసి చంపారు.
40 “మూడో రోజున దేవుడు ఆయనను సజీవంగా లేపి స్పష్టంగా కనబడేలా చేశాడు – 41 ప్రజలందరికీ కాదు గాని సాక్షులుగా ఉండాలని దేవుడు మునుపు ఎన్నుకొన్న మాకే. చనిపోయిన వారిలోనుంచి ఆయన లేచిన తరువాత ఆయనతో మేము అన్నపానాలు పుచ్చుకొన్నాం. 42 ప్రజలకు శుభవార్త ప్రకటించాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. బ్రతికివున్న వారికీ చనిపోయినవారికీ దేవుడు ఈయననే న్యాయాధిపతిగా నియమించిన సంగతిని గురించి మేము సాక్షులుగా హెచ్చరించాలని కూడా ఆజ్ఞాపించాడు. 43 ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరికీ ఆయన పేరు మూలంగా పాపక్షమాపణ దొరుకుతుందని ఆయనను గురించి ప్రవక్తలందరూ సాక్ష్యం చెప్పేవారు.”
44 పేతురు ఈ మాటలు చెపుతూ ఉండగానే సందేశం విన్నవారందరి మీదికి పవిత్రాత్మ దిగి వచ్చాడు. 45 పవిత్రాత్మ అనే ఉచిత వరాన్ని ఇతర ప్రజలమీద కూడా కుమ్మరించడం చూచి పేతురుతో వచ్చిన సున్నతి గల విశ్వాసులంతా విస్మయం చెందారు. 46 ఎందుకంటే వారు భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడం విన్నారు.
47 అప్పుడు పేతురు “మనలాగే వీరు పవిత్రాత్మను పొందారు. వీరు నీళ్ళ బాప్తిసం పొందకుండా ఆటంకపెట్టగల వారెవరైనా ఉన్నారా?” అన్నాడు. 48 ప్రభువు పేర బాప్తిసం పొందాలని వారికి ఆజ్ఞాపించాడు. తరువాత కొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతణ్ణి వేడుకొన్నారు.