9
1 ఈలోగా సౌలు ప్రభు శిష్యులను వధిస్తానని బెదిరిస్తూ బుసలు కొడతూ ప్రముఖయాజి దగ్గరకు వెళ్లి 2 దమస్కులో ఉన్న యూద సమాజ కేంద్రాలవారికి లేఖలు వ్రాసి ఇవ్వాలని కోరాడు. యేసు మార్గాన్ని అనుసరించిన స్త్రీ పురుషులు ఎవరైనా కనిపిస్తే వారిని ఖైదు చేసి జెరుసలం తీసుకురావాలని అతని ఉద్దేశం.
3 అతడు ప్రయాణం చేసి దమస్కు సమీపానికి చేరాడు. ఉన్నట్టుండి ఆకాశంనుంచి అతని చుట్టూ వెలుగు ప్రకాశించింది. 4 అతడు నేలమీద కూలిపోయి తనతో ఒక స్వరం ఇలా మాట్లాడడం విన్నాడు: “సౌలూ! సౌలూ! నీవు నన్ను ఎందుకు హింసిస్తూ ఉన్నావు?”
5 అతడు “ప్రభూ! నీవెవరవు?” అని అడిగాడు. అందుకు ఆయన “నీవు హింసిస్తున్న యేసునే నేను. ములుకోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం.” 6 అతడు వణకుతూ విస్మయం చెందుతూ “ప్రభూ, నేనేమి చేయాలని కోరుతున్నావు?” అన్నాడు. అప్పుడు “లేచి నగరంలోకి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ నీకు తెలియజేయబడుతుంది” అని ప్రభువు అతనితో అన్నాడు.
7 అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు గాని ఎవరినీ చూడలేదు. నోట మాట రాక వారు అక్కడ నిలుచున్నారు. 8 సౌలు నేలమీదనుంచి లేచి కండ్లు తెరచినప్పుడు ఏమీ చూడలేకపోయాడు. వారు అతని చేయి పట్టుకొని దమస్కులోకి నడిపిస్తూ తీసుకుపోయారు. 9 అతడు మూడు రోజులు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, త్రాగలేదు.
10 దమస్కులో అననీయ అనే శిష్యుడు ఉన్నాడు. దర్శనంలో ప్రభువు “అననీయా!” అని అతణ్ణి పిలిచాడు. అతడు “ఇదిగో నేను, ప్రభూ!” అన్నాడు.
11 అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “లేచి ‘తిన్ననిది’ అనే వీధిలో ఉన్న యూదా ఇంటికి వెళ్ళి తార్సు పట్టణస్తుడైన సౌలు అనే మనిషికోసం విచారించు. ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12 తనకు చూపు కలిగేలా, అననీయ అనేవాడు లోపలికి వచ్చి తనమీద చేయి ఉంచడం అతడు దర్శనంలో చూశాడు.”
13 అందుకు అననీయ “ప్రభూ! ఆ మనిషిని గురించి జెరుసలంలో ఉన్న నీ పవిత్రులకు ఎంతో హాని చేశాడని అనేకులు చెప్పగా విన్నాను. 14 ఇక్కడ కూడా నీ పేర ప్రార్థన చేసేవారందరినీ నిర్బంధించడానికి అతడు ప్రముఖ యాజుల చేత అధికారం పొందాడు” అని జవాబిచ్చాడు.
15 అయితే ప్రభువు అతనితో ఇలా అన్నాడు: “వెళ్ళు! నేను అతణ్ణి పాత్రగా ఎన్నుకొన్నాను. ఇస్రాయేల్ ప్రజల ఎదుట, ఇతర ప్రజల ఎదుట, రాజుల ఎదుట అతడు నా పేరు భరిస్తాడు. 16 నా పేరుకోసం అతడు ఎన్ని బాధలు అనుభవించాలో నేనతనికి చూపిస్తాను.”
17 అననీయ వెళ్ళి ఆ ఇంట్లో ప్రవేశించి అతనిమీద చేతులుంచి “సౌలూ! సోదరుడా! మీరు చూపు పొంది పవిత్రాత్మతో నిండిపోయేలా, మీరు వచ్చిన దారిన మీకు కనిపించిన యేసుప్రభువు నన్ను పంపాడు” అన్నాడు.
18 వెంటనే అతని కండ్లనుంచి పొరల్లాంటివి రాలాయి. తక్షణమే అతనికి చూపు వచ్చింది, అతడు లేచి బాప్తిసం పొందాడు. 19 భోజనం చేసిన తరువాత అతనికి బలం వచ్చింది. అప్పుడు సౌలు దమస్కులో శిష్యులతో కొన్ని రోజులు గడిపాడు. 20 వెంటనే “క్రీస్తు దేవుని కుమారుడు” అంటూ యూద సమాజ కేంద్రాలలో ఆయనను గురించి ప్రకటించడం మొదలు పెట్టాడు.
21 అతని మాటలు విన్నవారంతా ఆశ్చర్యచకితులై “జెరుసలంలో ఈ పేర ప్రార్థన చేసేవారిని నష్టపరచినవాడు ఇతడేగా! అలాంటివారిని నిర్బంధించి ప్రధాన యాజుల దగ్గరికి తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాడు గదా!” అన్నారు. 22 అయితే సౌలుకు బలప్రభావాలు అంతకంతకు అధికమయ్యాయి. యేసే అభిషిక్తుడు అని రుజువు చేస్తూ, దమస్కులోని యూదులను కలవరపెట్టాడు. 23  చాలా రోజుల తరువాత యూదులు అతణ్ణి చంపడానికి దురాలోచన చేశారు. 24 అయితే వారి కుట్ర సౌలుకు తెలియవచ్చింది. అతణ్ణి చంపడానికి రాత్రింబగళ్ళు వారు నగరద్వారాల దగ్గర కావలి కాస్తూ ఉన్నారు. 25 కనుక శిష్యులు రాత్రివేళ అతణ్ణి తీసుకువెళ్ళి గంపలో ఉంచి గోడలో కిటికీ గుండా క్రిందికి దించారు.
26  సౌలు జెరుసలంకు వచ్చి శిష్యులను చేరడానికి ప్రయత్నం చేశాడు గానీ అతడు శిష్యుడని నమ్మక వారంతా అతనికి భయపడ్డారు. 27 అయితే బర్నబా అతణ్ణి చేరదీసి క్రీస్తురాయబారుల దగ్గరికి తోడుకువెళ్ళాడు. అతడు త్రోవలో ప్రభువును చూశాడనీ ప్రభువు అతనితో మాట్లాడాడనీ అతడు దమస్కులో యేసు పేర ధైర్యంగా బోధించాడనీ వారికి వివరించి చెప్పాడు. 28 కాబట్టి సౌలు జెరుసలంలో వారితోకూడా వస్తూ పోతూ ఉన్నాడు. 29 అతడు ప్రభు నామాన ధైర్యంగా బోధిస్తూ గ్రీకు భాష మాట్లాడే యూదులతో తర్కిస్తూ ఉన్నాడు గాని వారతణ్ణి చంపడానికి కంకణం కట్టుకొన్నారు. 30 ఇది తెలుసుకొని సోదరులు అతణ్ణి సీజరియకు తీసుకువెళ్ళి తార్సుకు పంపారు. 31 అప్పుడు యూదయ, గలలీ, సమరయలలో అంతటా క్రీస్తు సంఘాలన్నీ ప్రశాంతత అనుభవిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ప్రభువు మీది భయభక్తులతో, పవిత్రాత్మ ప్రసాదించే ఆదరణతో సాగిపోతూ విస్తరిల్లుతూ ఉన్నాయి.
32 పేతురు నలుదిక్కులకు దేశ సంచారం చేస్తూ ఉంటే లుద్దలో కాపురం ఉన్న పవిత్రులదగ్గరికి కూడా వెళ్ళాడు. 33 అక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం పట్టి ఉన్న పక్షవాత రోగి అతనికి కనబడ్డాడు. ఆ మనిషి పేరు ఐనెయస్. 34 అతనితో పేతురు ఇలా అన్నాడు: “ఐనెయసూ! యేసు క్రీస్తు నిన్ను బాగు చేస్తున్నాడు. లేచి నీ పరుపు సర్దుకో.” తక్షణమే అతడు లేచాడు. 35 లుద్దలో, షారోనులో కాపురమున్న వారంతా అతణ్ణి చూచి ప్రభువువైపుకు తిరిగారు.
36 యొప్పేలో ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరు తబితా (గ్రీకు అనువాదం ‘దొర్కస్’). ఆమె జీవితం ఆమె చేసిన మంచి పనులతో ఉదార చర్యలతో నిండి ఉండేది. 37 ఆ రోజుల్లో ఆమె జబ్బు చేసి చనిపోయింది. ఆమె దేహాన్ని కడిగి మేడ గదిలో ఉంచారు. 38 లుద్దకు యొప్పే దగ్గరే గనుక లుద్దలో పేతురు ఉన్నాడని విని శిష్యులు ఇద్దరిని అతని దగ్గరకు పంపి అతడు ఆలస్యం చేయక తమవద్దకు రావాలని ప్రాధేయపడ్డారు.
39 పేతురు లేచి వారితో వెళ్ళాడు. అతడక్కడ చేరినప్పుడు వారతణ్ణి ఆ మేడగదిలోకి తీసుకువెళ్ళారు. విధవరాండ్రంతా అతని దగ్గర నిలుచుండి ఏడుస్తూ, దొర్కస్ తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలూ వేరే వస్త్రాలూ చూపుతూ ఉన్నారు. 40  అయితే పేతురు అందరినీ బయటికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేశాడు. అప్పుడు మృత దేహం వైపుకు తిరిగి “తబితా, లే!” అన్నాడు. ఆమె కండ్లు తెరచింది, పేతురును చూచి కూర్చుంది. 41 అతడు ఆమెకు చేయి చాపి ఆమెను లేవనెత్తి పవిత్రులనూ విధవరాండ్రనూ పిలిచి సజీవంగా ఉన్న ఆమెను వారికి అప్పగించాడు.
42 ఈ సంగతి యొప్పే అంతటా తెలిసి పోయింది. అక్కడ చాలామంది ప్రభువుమీద నమ్మకం ఉంచారు. 43 పేతురు యొప్పేలో సీమోను అనే చర్మకారుని దగ్గర అనేక రోజులు గడిపాడు.