8
1 ✽అతని చావుకు సౌలు సమ్మతించాడు. ఆ కాలంలో జెరుసలంలో క్రీస్తు సంఘానికి గొప్ప హింస కలిగింది. క్రీస్తురాయబారులు తప్ప అందరూ యూదయ, సమరయ ప్రాంతాలలో అంతటా చెదరిపోయారు. 2 కొందరు భక్తిపరులైన మనుషులు స్తెఫనును పాతిపెట్టి అతని విషయం అధికంగా విలపించారు. 3 సౌలు అయితే ఆ సంఘం పట్ల దౌర్జన్య చర్యలు చేస్తూ ఉన్నాడు. ఇంటింట✽ చొరబడుతూ పురుషులనూ స్త్రీలనూ ఈడ్చుకుపోయి చెరసాలలో వేయించాడు.4 ✽చెదరిపోయినవారైతే అక్కడక్కడకు వెళ్ళిపోతూ దేవుని వాక్కు ప్రకటిస్తూ ఉన్నారు. 5 ✽ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి వారికి క్రీస్తును ప్రకటించాడు. 6 ఫిలిప్పు చేసిన సూచకమైన✽ అద్భుతాలు విని, చూచి అక్కడి జన సమూహాలు ఏకగ్రీవంగా అతడు చెప్పిన విషయాలు శ్రద్ధతో విన్నారు. 7 ✽చాలామందికి పట్టిన మలిన పిశాచాలు పెడ బొబ్బలు పెట్టి వారిలోనుంచి బయటికి వెళ్ళాయి. పక్షవాత రోగులూ కుంటివారూ అనేకులు పూర్తిగా నయమయ్యారు. 8 అందుచేత ఆ పట్టణంలో ఎంతో సంతోషం కలిగింది.
9 ✽ఆ పట్టణంలో సీమోను అనేవాడు ఉన్నాడు. అదివరకు అతడు మంత్ర విద్య ప్రయోగిస్తూ తానొక గొప్పవాణ్ణని చెప్పుకొంటూ సమరయ ప్రజలను ఆశ్చర్యంలో ముంచేవాడు. 10 అందరూ – అల్పులు గానీ గొప్పవారు గానీ – “ఇతడే ‘దేవుని మహా శక్తి’” అంటూ అతడి మాటలు శ్రద్ధతో విన్నారు. 11 అతడు చాలా కాలం తన మంత్ర విద్యలతో వారికి ఆశ్చర్యం కలిగించినందుచేతే వారు అతడి మాటలు శ్రద్ధతో విన్నారు. 12 ✽అయితే ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గురించీ యేసు క్రీస్తు పేరును గురించీ ప్రకటించినప్పుడు వారు అతణ్ణి నమ్మారు, పురుషులూ స్త్రీలూ బాప్తిసం పొందారు. 13 ✽సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. సూచనకోసమైన అద్భుతాలూ మహా వింతలూ జరగడం చూచి ఆశ్చర్యపోతూ ఫిలిప్పుతో ఉండిపోయాడు.
14 ✽సమరయవారు దేవుని వాక్కు అంగీకరించారని విని జెరుసలంలో క్రీస్తురాయబారులు వారిదగ్గరకు పేతురు యోహానులను పంపారు. 15 ✽వీరు వచ్చి వారు పవిత్రాత్మను పొందేలా వారికోసం ప్రార్థన చేశారు. 16 అంతకుముందు పవిత్రాత్మ వారిలో ఎవరిమీదికి రాలేదు. వారు యేసుప్రభువు పేర బాప్తిసం పొందారు అంతే. 17 అప్పుడు పేతురు యోహానులు వారిమీద చేతులుంచారు, వారు పవిత్రాత్మను పొందారు.
18 ✽క్రీస్తురాయబారులు చేతులుంచడం ద్వారా పవిత్రాత్మను ప్రసాదించడం జరిగిందని చూచి సీమోను వారికి డబ్బు ఇవ్వజూపి ఇలా అన్నాడు: 19 “నేను ఎవరిమీద చేతులుంచుతానో వారు పవిత్రాత్మను పొందేలా నాకు కూడా ఈ అధికారం ఇవ్వండి.”
20 ✽అతడితో పేతురు ఈ విధంగా అన్నాడు: “నీ డబ్బు నీతోకూడా నశిస్తుంది గాక! ఎందుకంటే ద్రవ్యమిచ్చి దేవుని ఉచిత వరాన్ని కొనుక్కోవచ్చు అనుకొన్నావు నీవు! 21 దేవుని ఎదుట నీ హృదయం సరైన స్థితిలో లేదు గనుక ఈ విషయంలో నీకు పాలుపంపులు లేవు. 22 కాబట్టి ఈ నీ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడి దేవుణ్ణి ప్రార్థించు. ఒకవేళ నీ హృదయాలోచనకు క్షమాపణ దొరకవచ్చునేమో. 23 నీ సంగతి గ్రహించాను – నీ నిలువెల్లా చేదైన విషమే! దుర్మార్గానికి కట్టుబడి ఉన్నావు.”
24 ✽అందుకు “మీరు చెప్పినవాటిలో ఏదీ నామీదికి రాకుండా నాకోసం ప్రభువును ప్రార్థించండి” అని సీమోను జవాబిచ్చాడు.
25 ✽ వారు సాక్ష్యం చెప్పి ప్రభు వాక్కు ప్రకటించిన తరువాత జెరుసలంకు బయలుదేరి సమరయవారి అనేక గ్రామాలలో శుభవార్త ప్రకటిస్తూ వెళ్ళారు.
26 అప్పుడు ప్రభు దేవదూత✽ ఒకడు “నీవు లేచి జెరుసలంనుంచి గాజాకు ఎడారిలో పోయే దారికి దక్షిణంగా వెళ్ళు” అని ఫిలిప్పుతో చెప్పాడు. 27 ✽అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు ఇతియొపియ దేశస్థుడైన ఒక నపుంసకుడు దారిలో కనిపించాడు. ఇతియొపియ రాణి అయిన కందాకే క్రింద అతడు గొప్ప అధికారం గలవాడు. ఆమె ధనాగారమంతా అతని అదుపులో ఉండేది. అతడు ఆరాధన కోసం జెరుసలంకు వచ్చాడు. 28 ✽ఇప్పుడతడు తిరుగు ప్రయాణంలో ఉన్నాడు. తన రథంలో కూర్చుని ఉండి యెషయాప్రవక్త గ్రంథం చదువుతూ ఉన్నాడు.
29 ✽అప్పుడు దేవుని ఆత్మ ఫిలిప్పుతో “ఆ రథం దగ్గరకు వెళ్ళి దానిని కలుసుకో!” అన్నాడు.
30 ఫిలిప్పు దాని దగ్గరకు పరుగెత్తి ఆ మనిషి యెషయా ప్రవక్త గ్రంథం చదవడం విని “మీరు చదువుతున్నది అర్థం అవుతూ ఉందా?” అని అడిగాడు.
31 ✽అందుకతడు “ఎవరైనా నాకు సలహా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది?” అని చెప్పి రథమెక్కి తనతో కూర్చోమని ఫిలిప్పును వేడుకొన్నాడు.
32 ✽ అతడు చదువుతున్న లేఖన భాగమిది: వారు ఆయనను గొర్రెలాగా వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించేవాడి ఎదుట గొర్రెపిల్ల ఊరుకొన్నట్టే ఆయన నోరు తెరవలేదు. 33 ఆయన దీనస్థితినిబట్టి ఆయనకు తీర్చవలసిన న్యాయం తొలగించబడింది. భూలోకంలో ఉండకుండా ఆయన ప్రాణం తీయడం జరిగింది గనుక ఆయన సంతానాన్ని గురించి ఎవరు ఏమని చెప్పగలరు?
34 ✽ఆ నపుంసకుడు ఫిలిప్పును ఈ విధంగా అడిగాడు: “ప్రవక్త ఇలా చెప్పేది ఎవరి విషయం? తన విషయమా? మరొకరి విషయమా? నేను నిన్ను అడిగేది ఇదే.”
35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనంతోనే ఆరంభించి యేసును అతనికి బోధించాడు.
36 ✽వారు దారిలో సాగిపోతూ ఉంటే నీళ్ళున్న చోటికి వచ్చారు. “ఇవిగో నీళ్ళు! నేను బాప్తిసం పొందడానికి ఆటంకమేమిటి?” అని నపుంసకుడు అన్నాడు. 37 “నీవు హృదయపూర్వకంగా నమ్మితే బాప్తిసం పొందవచ్చు” అని ఫిలిప్పు చెప్పినప్పుడు అతడు “యేసు క్రీస్తే దేవుని కుమారుడని నమ్ముతున్నాను” అని జవాబిచ్చాడు. 38 అప్పుడు రథం ఆపమని ఆజ్ఞ జారీ చేశాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. 39 ✽వారు నీళ్ళలోనుంచి బయటికి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును తీసుకువెళ్ళాడు. నపుంసకుడు అతణ్ణి మరెన్నడూ చూడలేదు. అయినా అతడు ఆనందిస్తూ తన దారిన వెళ్ళాడు.
40 అయితే ఫిలిప్పు అజోతు పట్టణంలో కనబడ్డాడు. అక్కడనుంచి ముందుకు వెళ్ళిపోతూ సీజరియకు చేరేవరకు అతడు అన్ని గ్రామాలలో శుభవార్త ప్రకటిస్తూ వచ్చాడు.