7
1 ✽ప్రముఖ యాజి “ఈ విషయాలు నిజమేనా?” అని అడిగాడు. 2 అందుకు స్తెఫను ఇలా చెప్పాడు: “సోదరులారా! తండ్రులారా! వినండి. మన పూర్వీకుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు, మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ స్వరూపియైన దేవుడు✽ అతనికి సాక్షాత్కరించాడు, 3 అతనితో ఇలా అన్నాడు: ‘నీ దేశంనుంచీ నీ బంధువుల దగ్గరనుంచీ బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళిపో!’4 “అప్పుడతడు కల్దీయవారి దేశం విడిచివెళ్ళి హారానులో కాపురమేర్పరచుకొన్నాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడనుంచి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశానికి దేవుడు అతణ్ణి తీసుకువచ్చాడు. 5 ✝అయితే ఆయన ఇందులో అతనికి వారసత్వమేమీ ఇవ్వలేదు – ఒక్క అడుగు మోపేటంత భూమి కూడా ఇవ్వలేదు. కాని, అతనికి సంతానం లేని ఆ సమయంలో దీనిని అతనికీ అతని తరువాత అతని సంతతివారికి సొత్తుగా ఇస్తానని వాగ్దానం చేశాడు.
6 ✝“అయితే దేవుడు ఈ విధంగా చెప్పాడు: ‘అతని సంతతివారు వేరే దేశంలో విదేశీయులవుతారు, ఆ దేశం వారు నాలుగు వందల ఏళ్ళు వారిని దాసత్వానికీ బాధలకూ గురి చేస్తారు. 7 వారు ఏ జనానికి దాసత్వంలో ఉంటారో ఆ జనానికి తీర్పు తీరుస్తాను. ఆ తరువాత వారు వచ్చి ఈ స్థలంలో నాకు సేవ చేస్తార’ని దేవుడు అన్నాడు.
8 ✝“ఆయన అతనికి సున్నతితో కూడిన ఒడంబడిక ప్రసాదించాడు. అతడు ఇస్సాకుకు తండ్రి అయి ఎనిమిదో రోజున అతనికి సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబుకు తండ్రి అయ్యాడు. యాకోబు పన్నెండుమంది గోత్రకర్తలకు తండ్రి అయ్యాడు.
9 ✝“ఆ గోత్రకర్తలు యోసేపు విషయం అసూయపడి అతణ్ణి ఈజిప్ట్‌కు వెళ్ళేలా అమ్మేశారు. అయినా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. 10 ✝అతని బాధలన్నిటిలోనుంచి అతణ్ణి తప్పించాడు. ఈజిప్ట్ చక్రవర్తి అయిన ఫరోయెదుట అతనికి జ్ఞానాన్నీ దయనూ ప్రసాదించాడు, గనుక ఫరో ఈజిప్ట్ మీద, రాజభవనమంతటి మీదా అతణ్ణి అధికారిగా నియమించాడు.
11 ✝“తరువాత ఈజిప్ట్ దేశమంతటికీ, కనాను దేశమంతటికీ కరవు, దానితో మహా బాధలు వచ్చాయి, గనుక మన పూర్వీకులకు ఆహారం దొరకలేదు. 12 ఈజిప్ట్‌లో ధాన్యం ఉందని విని యాకోబు మన పూర్వీకులను అక్కడికి మొదటి సారి పంపాడు. 13 ✝వారు రెండో సారి వెళ్ళినప్పుడు యోసేపు ఎవరో అతని తోబుట్టువులకు తెలిసిపోయింది. అప్పుడు ఫరోకు యోసేపు కుటుంబం పరిచయమయింది. 14 ✽ అప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును, తన చుట్టాలందరినీ పిలవనంపించాడు. వారు డెబ్భై అయిదు మంది. 15 ✝యాకోబు ఈజిప్ట్‌కు వెళ్ళాడు. అక్కడ అతడూ మన పూర్వీకులూ చనిపోయారు. 16 ✝వారిని అక్కడనుంచి షెకెంకు తీసుకురావడం, షెకెంలో హమోరు కొడుకుల దగ్గర అబ్రాహాము వెల యిచ్చి కొనుక్కొన్న సమాధిలో ఉంచడం జరిగింది.
17 ✝“దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం నెరవేర్పు దగ్గరపడ్డప్పుడు ఈజిప్ట్‌లో ఇస్రాయేల్ ప్రజల సంఖ్య వృద్ధి చెంది అధికమైపోయింది. 18 యోసేపు అంటే ఎవరో తెలియని వేరే చక్రవర్తి అధికారానికి వచ్చే వరకు అలా జరిగింది. 19 అతడు మన జాతిపట్ల యుక్తిగా వ్యవహరించాడు. వారి శిశువులు బతకకుండా వారిని బయట ఉంచాలని మన పూర్వీకులను బలవంతం చేసి బాధించాడు.
20 ✝“ఆ కాలంలో మోషే జన్మించాడు. అతడు దేవునికి సుందరుడు. అతని తండ్రి ఇంటిలో అతణ్ణి మూడు నెలలు పెంచారు. 21 అతణ్ణి బయట ఉంచిన తరువాత ఫరో కూతురు అతణ్ణి తీసుకొని తన కొడుకుగా పెంచింది. 22 మోషే ఈజిప్ట్‌వారి జ్ఞానమంతటిలో విద్యాభ్యాసం పొందినవాడు. మాటలలో, క్రియలలో బలప్రభావాలు ఉన్నవాడు.
23 ✝“నలభై ఏళ్ళ ప్రాయంలో తన సోదరులైన ఇస్రాయేల్ వారిని సందర్శించాలని అతని హృదయంలో కోరిక పుట్టింది. 24 వారిలో ఒకడు దౌర్జన్యానికి గురి కావడం చూచి అతడు అతణ్ణి కాపాడి ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపి బాధపడ్డవాని విషయంలో ప్రతీకారం చేశాడు. 25 తన ద్వారా వారిని దేవుడు విడిపిస్తాడని తన సోదరులు గ్రహిస్తారనుకొన్నాడు. కానీ వారు గ్రహించలేదు✽. 26 మర్నాడు ఇద్దరు పోరాడుతూ ఉంటే అతడు వారికి కనబడి ‘అయ్యలారా! మీరు సోదరులు. ఎందుకు ఒకరికొకరు హాని చేసుకొంటున్నారు?’ అంటూ వారిని సఖ్యపరచడానికి ప్రయత్నం చేశాడు. 27 అయితే తన పొరుగువానికి హాని చేస్తున్నవాడు మోషేను అవతలికి గెంటివేసి ‘నిన్ను మామీద అధికారిగా, తీర్పరిగా నియమించినదెవరు? 28 నిన్న ఆ ఈజిప్ట్‌వాణ్ణి చంపినట్టు నన్నూ చంపాలనుకుంటున్నావా?’ అన్నాడు.
29 “ఆ మాట విని మోషే పారిపోయి మిద్యాను దేశంలో విదేశీయుడయ్యాడు. అక్కడతడు ఇద్దరు కొడుకులకు తండ్రి అయ్యాడు.
30 ✝“నలభై ఏళ్ళయిన తరువాత, సీనాయి పర్వతం దగ్గర ఉన్న ఎడారిలో పొదలోని మంటల్లో ప్రభు దూత అతనికి కనిపించాడు. 31 అది చూచి మోషే ఆ దృశ్యానికి ఆశ్చర్యపడి పరిశీలనగా చూడాలని దాని దగ్గరకు వెళ్ళాడు. వెంటనే ప్రభు స్వరం ఇలా వినిపించింది: 32 ‘నేను నీ పూర్వీకుల దేవుణ్ణి – అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి.’ అందుకు మోషే వణికిపోతూ అటువైపు చూడడానికి తెగించలేదు. 33 అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు: ‘నీ చెప్పులు విడువు. నీవు నిలుచున్నది పవిత్ర భూమి. 34 ఈజిప్ట్‌లో నా ప్రజలకు జరుగుతున్న దౌర్జన్యం నేను పూర్తిగా చూశాను. వారి మూలుగులు విన్నాను. వారిని విడిపించడానికి దిగివచ్చాను. ఇప్పుడు రా, నేను నిన్ను ఈజిప్ట్‌కు పంపుతాను.’
35 ✽“మునుపు ఈ మోషేను ఇస్రాయేల్ ప్రజలు నిరాకరించి ‘నిన్ను అధికారిగా, తీర్పరిగా నియమించినది ఎవరు?’ అన్నారు. అయితే అతనికి పొదలో కనిపించిన దూత ద్వారా దేవుడు అతణ్ణే అధికారిగా, విమోచకుడుగా ఉండేందుకు పంపాడు. 36 ✽ఇతడు వారిని బయటికి తీసుకువచ్చాడు. ఈజిప్ట్‌లో, ఎర్ర సముద్రం దగ్గర, నలభై ఏండ్లు ఎడారిలో వింతలూ సూచకమైన అద్భుతాలూ చేశాడు. 37 ✽ ‘దేవుడు మీకోసం మీ సొంత సోదరులలోనుంచి నాలాంటి ప్రవక్త బయలుదేరేలా చేస్తాడు. ఆయన మాట మీరు వినాలి’ అని ఇస్రాయేల్ ప్రజలతో చెప్పినది ఈ మోషేయే. 38 ✽సీనాయి పర్వతంమీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పూర్వీకులతోనూ ఎడారిలోని సంఘంలో ఉన్నది ఇతడే. మనకు అందించడానికి అతడు జీవ వాక్కులు పొందాడు.
39 ✽“మన పూర్వీకులు అతనికి లోబడడానికి ఇష్టం లేక అతణ్ణి నిరాకరించారు. వారి హృదయాల్లో ఈజిప్ట్ వైపుకు తిరిగారు✽. 40 ✝వారు అహరోనుతో ఇలా అన్నారు: ‘మా ముందర వెళ్ళడానికి దేవుళ్ళను మాకోసం చెయ్యి. మమ్మల్ని ఈజిప్ట్‌నుంచి తెచ్చిన ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు.’ 41 ఆ రోజులలో వారు దూడను చేసి ఆ విగ్రహానికి బలి అర్పించి తమ చేతులతో చేసినదాని గురించి సంతోషించారు.
42 ✽ “అందుచేత దేవుడు వారినుంచి మళ్ళుకొని ఆకాశ సమూహాల పూజకు వారిని విడిచిపెట్టాడు. ఈ విషయం ప్రవక్తల గ్రంథంలో ఇలా రాసి ఉంది: ‘ఇస్రాయేల్ ప్రజలారా! ఎడారిలో నలభై ఏండ్లు మీరు బలులూ అర్పణలూ నాకు అర్పించారా? 43 పూజకోసం మీరు చేసుకొన్న మొలెక్ దేవుడి గుడారాన్నీ, మీకు దేవుడుగా అయిన రోంఫా నక్షత్ర రూపాన్నీ మోసుకుపోయారు. కనుక నేను మిమ్మల్ని బబులోను అవతలకు తొలగిస్తాను.’
44 ✝“దేవుడు నియమించినట్టు ఎడారిలో మన పూర్వీకులకు దేవుని సాక్ష్యం కోసమైన గుడారం ఉంది. మోషే చూచిన నమూనా ప్రకారమే దానిని చేయాలని అతనికి దేవుడు ఆదేశించాడు. 45 ✝మన పూర్వీకులకు వరసగా అది దక్కింది. మన పూర్వీకుల ముందునుంచి వెళ్ళగొట్టిన జనాల ప్రాంతానికి వారు యెహోషువతో కూడా దానిని తీసుకువచ్చారు. దావీదు రోజులవరకు అది ఉండిపోయింది. 46 ✝దావీదు దేవుని అనుగ్రహం పొంది, యాకోబు యొక్క దేవుని✽కోసం ఒక ఆలయం నిర్మించేందుకు దేవుని అనుమతి అడిగాడు, 47 ✝గానీ ఆయనకోసం మందిరం కట్టించినది సొలొమోనే.
48 ✽“అయితే మానవ హస్తాలతో చేసిన ఆలయంలో సర్వాతీతుడైన దేవుడు నివాసం చేయడు. ప్రవక్త చెప్పాడు గదా, 49 ‘నా సింహాసనం ఆకాశమే. నా పాదపీఠం భూతలమే. మీరు నాకోసం ఎలాంటి మందిరం కట్టగలరు? నా విశ్రాంతి స్థలమేది? 50 ఇవన్నీ నా చేతితో చేసినవి కావా? అని ప్రభువు చెపుతున్నాడు.’
51 ✽“తలబిరుసుగా ఉన్న మనుషులారా! హృదయంలో, చెవులలో సున్నతి లేని✽ వారలారా! మీరు ఎప్పుడూ పవిత్రాత్మను ఎదిరిస్తున్నారు. మీ పూర్వీకులలాగే మసలుకొంటున్నారు. 52 ✝మీ పూర్వీకులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? న్యాయవంతుడు✽ వస్తాడని మునుపు చాటించిన వారిని వారు చంపారు. మీరిప్పుడు ఆయన విషయంలో ద్రోహులూ హంతకులూ అయ్యారు!
53 ✽“దేవదూతలద్వారా నియమించిన ధర్మశాస్త్రం మీకు లభించింది గాని మీరు దాన్ని పాటించలేదు.”
54 ✽ఈ మాటలు విని సభ వారు కోపంతో మండిపడి అతణ్ణి చూచి పటపటా పండ్లు కొరికారు. 55 ✽అయితే అతడు పవిత్రాత్మతో నిండినవాడై ఆకాశంవైపు తేరి చూస్తూ దేవుని మహిమాప్రకాశం, దేవుని కుడి వైపున యేసు నిలుచుండడం చూశాడు. 56 అప్పుడతడు “ఇదిగో✽! ఆకాశాలు తెరచుకోవడం, దేవుని కుడి వైపు మానవ పుత్రుడు✽ నిలుచుండడం నేను చూస్తూ ఉన్నాను” అన్నాడు.
57 ✽అందుకు వారు పెద్ద స్వరంతో కేకలు వేస్తూ చెవులు మూసుకొని ఏక మనసుతో అతనిమీదికి దొమ్మిగా వచ్చారు. 58 ✽నగరం బయటికి అతణ్ణి గెంటివేసి రాళ్ళతో కొట్టసాగారు. సాక్షులు✽ తమ పైవస్త్రాలు ఒక యువకుడి పాదాలదగ్గర పెట్టారు. అతడి పేరు సౌలు✽. 59 ✽ వారు స్తెఫనును రాళ్ళు రువ్వుతూ ఉంటే స్తెఫను “యేసుప్రభూ! నా ఆత్మను చేర్చుకో!” అని ప్రార్థన చేశాడు. 60 ✽ అప్పుడతడు మోకాళ్ళపై పడి “ప్రభూ! వీరిమీద ఈ పాపం మోపకు” అని గొంతెత్తి చెప్పాడు. అలా చెప్పి అతడు కన్ను మూశాడు✽.