6
1 ✽ఆ రోజులలో శిష్యుల సంఖ్య వృద్ధి అవుతూ ఉన్నప్పుడు గ్రీక్ భాష మాట్లాడే యూదులు హీబ్రూ మాట్లాడే యూదులమీద సణుక్కొన్నారు. ఎందుకంటే రోజూ భోజనాదులు పంచిపెట్టేటప్పుడు తమలో ఉన్న విధవరాండ్రను నిర్లక్ష్యం చేయడం జరిగింది. 2 కనుక ఆ పన్నెండుమంది✽ క్రీస్తు రాయబారులు శిష్యులందరినీ పిలిచి ఇలా అన్నారు: “మేము బల్లలదగ్గర సేవ చేసేందుకు దేవుని వాక్కు ఉపదేశించడం విడిచిపెట్టడం సరి కాదు. 3 ✽అందుచేత, సోదరులారా, మంచి పేరుగల ఏడుగురిని మీలోనుంచి ఎన్నుకోండి. వారు పవిత్రాత్మతో, జ్ఞానంతో నిండినవారై ఉండాలి. మేము వారిని ఆ పనిమీద నియమిస్తాం. 4 ✽మేమైతే ప్రార్థన, వాక్కు విషయమైన సేవ ఎడతెగకుండా చేస్తూ ఉంటాం.”5 ఆ సమూహమంతటికీ ఆ మాట నచ్చింది. వారు వీరిని ఎన్నుకొన్నారు: స్తెఫను (ఇతడు విశ్వాసంతో, పవిత్రాత్మతో నిండినవాడు), ఫిలిప్పు, ప్రొకొరస్, నీకానోర్, తీమోన్, పర్‌మెనాస్, నీకొలాస్ (ఇతడు అంతియొకయ పట్టణం నుంచి వచ్చినవాడు, మునుపు యూద మతంలో ప్రవేశించినవాడు✽). 6 ✽వారిని క్రీస్తురాయబారుల ముందు నిలబెట్టారు. వీరు ప్రార్థన చేసి వారిమీద చేతులు ఉంచారు.
7 ✽దేవుని వాక్కు అంతకంతకు వ్యాపించింది. జెరుసలంలో శిష్యుల సంఖ్య ఎంతో వృద్ధి అయింది. యాజులలో కూడా అనేకులు విశ్వాస సత్యాలకు విధేయులయ్యారు.
8 ✽స్తెఫను విశ్వాసంతో బలప్రభావాలతో నిండినవాడై ప్రజల మధ్య గొప్ప వింతలూ సూచకమైన అద్భుతాలూ చేశాడు. 9 కానీ ‘స్వతంత్రులైనవారి సమాజం’ అనే దానిలో చేరినవారు కొందరు వచ్చి స్తెఫనుతో వాదించారు. వారు కురేనేవారు, అలెగ్జాండ్రియావారు, కిలికియ, ఆసియాల నుంచి వచ్చినవారు✽. 10 అయితే స్తెఫను మాటల్లో వెల్లడి అయిన జ్ఞానాన్నీ దేవుని ఆత్మనూ వారు అడ్డగించలేకపోయారు.
11 ✽అప్పుడు వారు కొందరిని రహస్యంగా ప్రేరేపించి “వీడు మోషేనూ దేవుణ్ణీ దూషిస్తూవుంటే వాడి మాటలు మేము విన్నాం” అని వారితో చెప్పించారు, 12 ప్రజలనూ పెద్దలనూ ధర్మశాస్త్ర పండితులనూ రేపారు. వారు అతనిమీదికి వచ్చి అతణ్ణి పట్టుకొని సమాలోచన సభ✽ దగ్గరకు తీసుకువెళ్ళారు. 13 అక్కడ అబద్ధ సాక్షులను నిలబెట్టారు. వీరు ఇలా అన్నారు: “ఈ మనిషి మానకుండా ఈ పవిత్ర స్థానానికీ ధర్మశాస్త్రానికీ వ్యతిరేకంగా మాట్లాడుతూ దూషిస్తూ ఉంటాడు. 14 ✝ఆ నజరేతువాడైన యేసు ఈ స్థానాన్ని నాశనం చేసి, మోషే మనకు అందజేసిన ఆచారాలను మార్చేస్తాడని వీడు చెప్పినప్పుడు మేము విన్నాం.”
15 ✽ఆ సమాలోచన సభలో కూర్చుని ఉన్న వారంతా అతనివైపు తేరి చూస్తూ ఉంటే అతని ముఖం దేవదూత ముఖంలాగా వారికి కనిపించింది.