5
1 అయితే అననీయ అనే మనిషి, అతని భార్య సప్పీరా సమ్మతితో ఆస్తిని అమ్మాడు, 2 ఆ డబ్బులో కొంత ఉంచుకొని కొంత తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టాడు. అతని భార్యకు అదంతా బాగా తెలుసు.
3 పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా! భూమి అమ్మిన డబ్బులో కొంత ఉంచుకొని పవిత్రాత్మకు అబద్ధం చెప్పడానికి సైతాను నీ హృదయాన్ని పూర్తిగా ఆక్రమించు కొన్నాడేమిటి? 4 అది నీ అదుపులో ఉన్నంత వరకు నీదే గదా. అమ్మిన తరువాత కూడా ఆ డబ్బు నీ వశంలోనే ఉంది గదా. ఈ విషయం ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు అబద్ధమాడినది మనుషులతో కాదు, దేవునితోనే!”
5 ఈ మాటలు వినగానే అననీయ కుప్పకూలి ప్రాణం విడిచాడు. ఈ విషయాల గురించి విన్నవారందరినీ మహా భయం ఆవరించింది. 6 అప్పుడు యువకులు లేచి అతణ్ణి గుడ్డతో చుట్టి బయటికి మోసుకుపోయి పాతిపెట్టారు.
7 సుమారు మూడు గంటల సేపటికి అతడి భార్య లోపలికి వచ్చింది. జరిగినది ఆమెకు తెలియదు. 8 పేతురు ఆమెను “మీరు భూమిని అమ్మినది ఇంతకేనా? నాతో చెప్పు” అని అడిగాడు. ఆమె “అవును, ఇంతకే” అంది.
9 అప్పుడు పేతురు ఆమెతో అన్నాడు, “‘మీరెందుకు ప్రభు ఆత్మను పరీక్షించడానికి ఏకీభవించారు? ఇదిగో! నీ భర్తను పాతిపెట్టినవారి కాళ్ళు గుమ్మం దగ్గరే ఉన్నాయి. వారు నిన్ను కూడా బయటికి మోసుకుపోతారు!”
10 తక్షణమే ఆమె అతని కాళ్ళదగ్గర కూలి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చచ్చి ఉండడం చూశారు. ఆమెను బయటికి మోసుకుపోయి ఆమె భర్తదగ్గర పాతిపెట్టారు. 11 క్రీస్తు సంఘమంతటినీ ఈ సంగతులు విన్నవారందరినీ ఎంతో భయం చుట్టుకొంది.
12 ప్రజలమధ్య అనేక సూచకమైన క్రియలూ అద్భుతాలూ క్రీస్తు రాయబారుల చేత జరిగాయి. నమ్మిన వారంతా ‘సొలొమోను మంటపం’లో ఏక మనసుతో సమకూడేవారు. 13 వారితో చేరడానికి తక్కినవారిలో ఇంకెవరికీ ధైర్యం లేదు. అయినా వారిని ప్రజలు గౌరవించేవారు. 14 అధిక సంఖ్యలో విశ్వాసులైన స్త్రీ పురుషులు ప్రభువుతో చేరుతూ వచ్చారు. 15 దీనంతటి ఫలితంగా వీధులలో వెళ్తూవున్న పేతురు నీడైనా రోగులలో కొందరిమీదైనా పడాలని ప్రజలు వారిని వీధులలోకి తీసుకువచ్చి మంచాలమీద, పరుపులమీద ఉంచారు. 16 అంతేగాక, జెరుసలం పరిసరాలలో ఉన్న గ్రామాలనుంచి కూడా జనసమూహాలు రోగులనూ మలిన పిశాచాలచేత బాధలపాలైన వారినీ తీసుకువచ్చారు. వారంతా పూర్తిగా నయం అయ్యారు.
17 అప్పుడు ప్రముఖయాజి, అతడి పక్షంవారంతా – అంటే సద్దూకయ్యుల తెగవారంతా – అసూయతో నిండిపోయారు. 18 వారు లేచి క్రీస్తురాయబారులను పట్టుకొని సామాన్యమైన చెరసాలలో వేశారు. 19 అయితే ఆ రాత్రే ప్రభు దేవదూత ఒకడు చెరసాల తలుపులు తెరచి వారిని బయటికి తీసుకువచ్చి ఇలా అన్నాడు: 20 “వెళ్ళి దేవాలయంలో నిలబడి, ఈ జీవాన్ని గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పండి.”
21 అది విని వారు వేకువ జామున దేవాలయంలో ప్రవేశించి ఉపదేశించసాగారు. అయితే ప్రముఖ యాజి, అతడి పక్షంవారు వచ్చి సమాలోచన సభనూ ఇస్రాయేల్‌ప్రజల పెద్దలందరినీ సమకూర్చి క్రీస్తురాయబారులను తీసుకురండని భటులను చెరసాలకు పంపించారు. 22 భటులు అక్కడికి చేరినప్పుడు వారు చెరసాలలో లేకపోవడం చూచి తిరిగి వచ్చి 23 “చెరసాలకు తాళం భద్రంగా వేసివుంది. బయట తలుపుల దగ్గర కావలివాళ్ళు నిలుచున్నారు. కానీ, తలుపులు తెరచి చూస్తే లోపల మాకెవరూ కనిపించలేదు” అన్నారు.
24 ఆ మాటలు విని ప్రముఖ యాజి దేవాలయం కావలివాళ్ళ అధికారి, ప్రధాన యాజులు ఈ సంగతులు విని అది ఏమవుతుందో అని వారి విషయం కలవరపడ్డారు. 25 అయితే ఎవరో ఒకరు వచ్చి “చూడండి! మీరు చెరసాలలో వేసిన మనుషులు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు ఉపదేశం ఇస్తూ ఉన్నారు” అన్నాడు.
26  అప్పుడు ఆ అధికారి భటులతో వెళ్ళి వారిని తీసుకువచ్చాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారేమో అని భయపడి వారు బలవంతమేమీ చేయలేదు. 27 వారిని తీసుకువచ్చి సమాలోచన సభలో నిలబెట్టారు. అప్పుడు ప్రముఖ యాజి వారిని ప్రశ్నిస్తూ ఇలా అన్నాడు: 28 “ఆ పేరున ఉపదేశం చేయకూడదని మేము మీకు ఖచ్చితంగా ఆజ్ఞ జారీ చేయలేదా? అయినా, ఇదిగో! మీరు జెరుసలంను మీ ఉపదేశాలతో నింపేశారు. ఆ మనిషి రక్తవిషయమైన అపరాధం మామీదికి తేవాలని చూస్తున్నారు.”
29  అందుకు పేతురు, తక్కిన క్రీస్తురాయబారులు ఇలా జవాబిచ్చారు: “మేము దేవునికే లోబడాలి గానీ మనుషులకు కాదు. 30  మీరు మ్రానుమీద వ్రేలాడవేసి చంపించిన యేసును మన పూర్వీకుల దేవుడు సజీవంగా లేపాడు. 31  ఇస్రాయేల్ ప్రజలకు పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రసాదించాలని దేవుడు ఆయననే ప్రధానాధికారిగా, ముక్తిప్రదాతగా తన కుడి ప్రక్కన హెచ్చించాడు. 32  ఈ సంగతులకు మేము సాక్షులం. తనకు విధేయులైనవారికి దేవుడు ప్రసాదించిన పవిత్రాత్మ కూడా సాక్షి.
33 ఇది విని సభ వారు కోపంతో మండిపడి వారిని చంపదలచుకొన్నారు. 34 అయితే గమలీయేల్ అనే పరిసయ్యుడు ఆ సభలో లేచి నిలబడి క్రీస్తురాయబారులను కాసేపు బయట ఉంచాలని వారిని ఆజ్ఞాపించాడు. అతడు ధర్మశాస్త్ర గురువు, ప్రజలంతా గౌరవించినవాడు. 35 అప్పుడతడు వారితో అన్నాడు, “ఇస్రాయేల్ మనుషులారా, మీరు ఆ మనుషులను ఏమి చేయాలనుకొంటున్నారో మీ విషయం జాగ్రత్తగా ఉండండి. 36 కొంత కాలం క్రిందట థూదా బయలుదేరి గొప్పవాణ్ణని చెప్పుకొన్నాడు. దాదాపు నాలుగు వందలమంది మనుషులు వాడి పక్షం చేరారు. అయితే వాణ్ణి చంపడం, వాని అనుచరులందరినీ చెదరగొట్టడం జరిగింది. అదంతా వ్యర్థమైపోయింది. 37 ఆ మనిషి తరువాత, జనాభా లెక్క వ్రాసే దినాలలో, గలలీవాడైన యూదా బయలుదేరి అనేకమందిని తన వెంట ఈడ్చుకుపోయాడు. కానీ వాడు కూడా నాశనమయ్యాడు. వాని అనుచరులంతా చెల్లా చెదురయ్యారు. 38 కనుక ఇప్పుడు నేను మీతో చెప్పేదేమిటంటే, ఆ మనుషుల జోలికి వెళ్ళకండి. వారిని విడిచిపెట్టండి. ఆ ఆలోచన, లేక ఆ క్రియాశీలత పని మనుషులమూలంగా కలిగినదైతే అది భంగం అవుతుంది. 39 అది దేవుని మూలంగా కలిగినదే గనుక అయితే దాన్ని మీరు భంగపరచలేరు. ఒకవేళ మీరు దేవునితోనే పోట్లాడే వారవుతారేమో భద్రం!”
40 అతనితో వారు సమ్మతించారు. వారు క్రీస్తురాయబారులను పిలిపించి కొరడాలతో కొట్టించి యేసు పేర మాట్లాడకూడదని వారికి ఆజ్ఞాపించారు. అప్పుడు వారిని విడిచిపెట్టారు. 41 ఆయన పేరుకోసం అవమానానికి పాత్రులుగా ఎంచబడినందుచేత వారు ఆనందిస్తూ సమాలోచన సభనుంచి వెళ్ళిపోయారు. 42 యేసే అభిషిక్తుడు అని వారు ప్రతి రోజూ దేవాలయంలో, ఇంటింటా ఉపదేశిస్తూ ప్రకటిస్తూ ఉండడం మానలేదు.