4
1 వారు ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే యాజులు, దేవాలయం కాపలావారికి అధికారి, సద్దూకయ్యులు వారిమీదికి వచ్చారు. 2 రాయబారులు ప్రజలకు ఉపదేశించి నందుకూ చనిపోయినవారు సజీవంగా లేస్తారని యేసును బట్టి ప్రకటించినందుకూ వీరు చాలా కలవరపడుతూ ఉన్నారు. 3 వారిని పట్టుకొని, అప్పటికే సాయంకాలం అయిందని మరుసటి రోజువరకు ఖైదులో ఉంచారు. 4 అయినా వాక్కు విన్నవారిలో చాలామంది నమ్మారు. పురుషుల సంఖ్య ఇంచుమించు అయిదు వేల వరకు అయింది.
5 మరునాడు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ జెరుసలంలో సమకూడారు. 6 ప్రముఖ యాజి అన్నా, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రముఖ యాజి వంశీకులంతా కూడా వారితో ఉన్నారు. 7 వారు తమ మధ్యలో పేతురు యోహానులను నిలబెట్టి “మీరు చేసిన ఈ పని ఏ శక్తితో, ఏ పేరునుబట్టి చేశారు?” అని అడిగారు.
8 అప్పుడు పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వారితో ఇలా అన్నాడు: “ప్రజల అధికారులారా! ఇస్రాయేల్ పెద్దలారా! 9 కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి – అతడు ఎలా బాగుపడ్డాడని ఈ రోజు మాకు విమర్శ జరుగుతూ ఉంటే– 10  మీరంతా, ఇస్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతువాడైన యేసు క్రీస్తు పేరటే ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు గానీ దేవుడు ఆయనను చనిపోయినవారిలో నుంచి లేపాడు. 11 ఆయన ఎవరంటే, ‘కట్టేవారైన మీరు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది.’
12 “పాపవిముక్తి ఇంకెవరివల్లా కలగదు. ఈ పేరుననే మనం పాపవిముక్తి పొందాలి. ఆకాశంక్రింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాపవిముక్తి కలగదు.”
13 పేతురు యోహానులు విద్యలేని సామాన్యులని గ్రహించి వారి ధైర్యం చూచి అధికారులు ఆశ్చర్యపోయారు, వారు యేసుతోకూడా ఉండేవారని గుర్తించారు. 14 బాగుపడ్డ ఆ మనిషి వారితో నిలుచుండడం చూచి దానికి వ్యతిరేకంగా దేన్నీ చెప్పలేక, 15 “సభనుంచి వెళ్ళిపోండి” అని వారికి ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు ఒకరితో ఒకరు సమాలోచన జరిపి ఇలా అన్నారు:
16 “ఈ మనుషులను ఏం చేద్దాం? వాళ్ళద్వారా ప్రసిద్ధమైన అద్భుతం నిజంగా జరిగిందని జెరుసలం నివాసులందరికీ తెలిసిపోయింది. అది కాదనలేము. 17 కానీ ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకూడదు గనుక ఇకమీదట ఈ పేర ఎవరితోనూ మాట్లాడకూడదని వారిని తీవ్రంగా బెదిరిద్దాం.” 18 అప్పుడు వారిని పిలిపించి, యేసు పేర ఎంత మాత్రమూ మాట్లాడకూడదనీ ఉపదేశించకూడదనీ వారికి ఆజ్ఞ జారీ చేశారు.
19  పేతురు యోహానులు వారికి ఇలా జవాబిచ్చారు: “దేవుని మాట వినక మీ మాట వినడం దేవుని దృష్టిలో న్యాయమా? మీరే గుర్తించండి. 20 మేమైతే చూచిందీ విన్నదీ చెప్పకుండా ఉండలేము.”
21 ఆ నాయకులు వారిని ఇంకా బెదిరించిన తరువాత వారిని విడిచిపెట్టారు. ప్రజల కారణంగా వారిని ఎలా శిక్షించాలో తోచలేదు. ఎందుకంటే జరిగినదానిని బట్టి ప్రజలంతా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. 22 ఆ స్వస్థత అద్భుతం ఎవడి విషయంలో జరిగిందో ఆ మనిషి నలభై ఏళ్ళకంటే ఎక్కువ వయసు గలవాడు.
23 వారు విడుదల అయి తమ సంఘంవారి దగ్గరకు వెళ్ళి ప్రముఖ యాజులూ పెద్దలూ తమతో చెప్పినదంతా తెలియజేశారు.
24 ఇది విని వారు ఏక మనసుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు: “ప్రభూ! ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించిన దేవుడవు నీవు. 25 నీవు నీ సేవకుడు అయిన దావీదు నోట ఇలా పలికించావు: జనాలు ఎందుకు అల్లరి చేశాయి? ప్రజలు ఎందుకు వృధాలోచనలు చేశారు? 26 ప్రభువుకూ ఆయన అభిషిక్తుడికీ వ్యతిరేకంగా భూరాజులు నిలిచారు, పరిపాలకులు సమకూడారు.
27 “అలాగే ఈ నగరంలో హేరోదు, పొంతి పిలాతు, ఇస్రాయేల్ ప్రజలతోనూ ఇతర ప్రజలతోనూ కలిసి నీచేత అభిషేకం పొందిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా 28 ఏది జరగాలని నీ అధికారంచేతా సంకల్పంచేతా ముందు నిర్ణయించావో అదే జరిగించడానికి సమకూడారు. 29 ప్రభూ! ఇప్పుడు వారి బెదిరింపులు గుర్తించి రోగులను బాగు చేయడానికీ నీ పవిత్ర సేవకుడైన యేసు పేరట సూచకమైన అద్భుతాలూ వింతలూ జరిగించడానికీ నీ చేయి చాపు. 30 తద్వారా నీ దాసులకు నీ వాక్కు ప్రకటించడానికి గొప్ప ధైర్యం ప్రసాదించు.”
31  వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కంపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు.
32  నమ్మినవారంతా హృదయంలో, మనసులో ఏకంగా ఉన్నారు. ఎవరూ తనకు కలిగినవాటిలో ఏదీ తనది అనలేదు. అంతా వారికి ఉమ్మడిగా ఉంది. 33 పునర్జీవితాన్ని గురించి యేసుప్రభుని క్రీస్తు రాయబారులు గొప్ప బలప్రభావాలతో సాక్ష్యమిచ్చారు. దేవుని కృప వారందరికి అధికంగా ఉంది. 34 భూములైనా ఇండ్లయినా ఉన్నవారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టేవారు. 35 అక్కరకొద్దీ ప్రతి ఒక్కరికీ దానిని పంచిపెట్టడం జరిగింది, గనుక వారిలో ఎవరికీ కొరత లేకపోయింది.
36  సైప్రస్ ద్వీపంలో జన్మించిన లేవీ గోత్రికుడొకడు ఉండేవాడు. పేరు యోసే. అతనికి క్రీస్తురాయబారులు బర్నబా అనే పేరు పెట్టారు. ఆ పేరుకు “ఆదరణ పుత్రుడు” అని అర్థం. 37 అతనికి ఉన్న భూమి అమ్మి ఆ డబ్బు తెచ్చి క్రీస్తురాయబారుల పాదాల దగ్గర పెట్టాడు.