3
1 ✽ఒకప్పుడు ప్రార్థన కాలంలో – పగలు మూడు గంటలకు – పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. 2 అప్పుడే కొందరు పుట్టు కుంటి మనిషిని ఒకణ్ణి మోసుకువస్తున్నారు. దేవాలయంలోకి వెళ్ళే వారిదగ్గర బిచ్చం అడుక్కోవడానికి వారు అతణ్ణి ప్రతి రోజూ సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర ఉంచేవారు. 3 పేతురు, యోహాను దేవాలయంలో ప్రవేశించబోతూ ఉంటే చూచి అతడు బిచ్చమడిగాడు.4 ✽పేతురు, యోహానుతోపాటు అతణ్ణి తేరిపార చూస్తూ “మావైపు చూడు” అన్నాడు. 5 తనకు వారిదగ్గర ఏదైనా దొరుకుతుందని వారివైపు శ్రద్ధతో చూశాడు.
6 ✽అప్పుడు పేతురు “నేను వెండి బంగారాలు ఉన్నవాణ్ణి కాను గాని నాకున్నదేదో అదే నీకిస్తాను. నజరేతువాడైన యేసు క్రీస్తు పేర✽ లేచి నడువు!” అన్నాడు, 7 ✽అతని కుడి చేయి పట్టుకొని అతణ్ణి లేవనెత్తాడు. తక్షణమే అతని పాదాలకూ చీలమండలకూ బలం కలిగింది. 8 ✽అతడు దిగ్గున లేచి నిలబడి నడవసాగాడు. నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితోపాటు దేవాలయంలో ప్రవేశించాడు.
9 అతడు నడవడం, దేవుణ్ణి స్తుతించడం ప్రజలంతా చూశారు. 10 ✽ అతడు సౌందర్యం అనే ద్వారం దగ్గర బిచ్చమెత్తుకోవడానికి కూర్చుని ఉన్నవాడే అని వారు గుర్తెరిగి అతనికి జరిగినదాని కారణంగా ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయారు.
11 బాగుపడ్డ ఆ కుంటివాడు పేతురు యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ‘సొలొమోను మంటపం✽’లో వారి దగ్గరికి ప్రజలంతా అధికంగా ఆశ్చర్యపడిపోతూ పరుగెత్తు కొంటూ వచ్చారు. 12 ✽ఇది చూచి పేతురు ప్రజతో ఇలా అన్నాడు:
“ఇస్రాయేల్ మనుషులారా! దీనిని గురించి మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మేమేదో మా సొంత బలంతో, భక్తితో ఈ మనిషిని నడిచేలా చేసినట్టు ఎందుకు మావైపు తేరి చూస్తున్నారు? 13 ✽అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు – మన పూర్వీకుల దేవుడు – తన సేవకుడైన యేసు✽ను గౌరవించాడు. మీరాయనను పిలాతుకు అప్పగించారు, ఆయనను విడుదల చేసే నిర్ణయానికి అతడు వచ్చినప్పుడు అతని ఎదుట మీరు వద్దన్నారు. 14 ✽పవిత్రుడూ న్యాయవంతుడూ అయినవాణ్ణి వద్దని చెప్పి హంతకుణ్ణి✽ మీకు విడుదల చేయాలని కోరారు. 15 ✽మీరు జీవానికి కర్తను చంపించారు గానీ దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపాడు. ఇందుకు మేము సాక్షులం.✽ 16 ✽యేసు పేరుమీద ఉన్న నమ్మకం వల్ల, ఆయన పేరటే ఈ మనిషికి బలం కలిగింది. ఇతణ్ణి మీరు చూస్తున్నారు. ఇతడెవరో మీకు తెలుసు. యేసుమూలంగా కలిగే నమ్మకమే మీ అందరి ఎదుటా ఇతనికి ఈ పూర్తి ఆరోగ్యాన్ని కలిగించింది.
17 ✝“సోదరులారా! మీరు చేసినది తెలియక చేశారని నాకు తెలుసు. మీ నాయకుల సంగతి కూడా అంతే. 18 ✝అయితే తన అభిషిక్తుడు బాధలపాలవుతాడని దేవుడు ప్రవక్తలందరి నోట ముందుగా ప్రకటించినదానిని ఈ విధంగా నెరవేర్చుకొన్నాడు.
19 “కనుక పశ్చాత్తాపపడి✽ దేవుని వైపు తిరగండి! ప్రభు సన్నిధానం నుంచి విశ్రాంతి కాలాలు వచ్చేలా, 20 మీకు ముందుగా ప్రకటించబడిన అభిషిక్తుడైన✽ యేసును ఆయన పంపేలా, మీ పాపాలు నిర్మూలం కావడానికి అలా చేయండి. 21 ✽అన్నిటికీ కుదురుబాటు కాలాలు✽ వస్తాయని లోకారంభం నుంచి దేవుడు తన పవిత్ర ప్రవక్తల నోట పలికించాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండాలి.
22 ✽ “మోషే యథార్థంగా పితరులతో అన్నాడు గదా, ‘మీ దేవుడైన ప్రభువు మీకోసం మీ సోదరులలోనుంచి నాలాంటి ప్రవక్తను ఒకణ్ణి బయలుదేరేలా చేస్తాడు. ఆయన మీతో చెప్పేదంతా మీరు చెవిని పెట్టాలి. 23 ఆ ప్రవక్త మాటలు పెడచెవి పెట్టే ప్రతి ఒక్కరూ ప్రజలలో లేకుండా పూర్తిగా నాశనం అవుతారు.’
24 ✽“నిజంగా, సమూయేలు మొదలుకొని ఆ తరువాత మాట్లాడిన ప్రవక్తలందరూ ఈ రోజులను గురించి ముందుగా చాటించారు. 25 మీరు✽ ప్రవక్తల ప్రజలు, మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒడంబడిక ప్రజలు. ఆయన అబ్రాహాముతో అన్నాడు ‘నీ సంతానం మూలంగా లోకంలోని అన్ని వంశాలు ధన్యమవుతాయి.’ 26 ✽దేవుడు తన సేవకుడైన యేసును బయలుదేరదీసి మొట్టమొదట మీదగ్గరకు పంపాడు. మీలో ప్రతి ఒక్కరినీ మీ దుర్మార్గాలనుంచి మళ్ళించడంవల్ల మిమ్ములను ధన్యులుగా చేయాలని ఆయన ఉద్దేశం.”