2
1 పెంతెకొస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారంతా ఏకగ్రీవంగా ఒక్క స్థలంలో సమకూడి ఉన్నారు. 2 హఠాత్తుగా బలమైన గాలి హోరుమని వీచే విధంగా ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నింపివేసింది. 3 అప్పుడు జ్వాలల్లాంటి నాలుకలు వారికి కనిపించాయి. అవి విడిపోయి వారిలో ప్రతి ఒక్కరిమీదా వాలాయి. 4 వారందరూ పవిత్రాత్మతో నిండిపోయారు. ఆ ఆత్మ వారికి మాట్లాడే శక్తి ఇచ్చిన ప్రకారం ఇతర భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారు.
5 ఆ కాలంలో, ఆకాశంక్రింద ఉన్న ప్రతి జనంలో నుంచి వచ్చిన యూదులు – భక్తిపరులైన పురుషులు – జెరుసలంలో నివాసమున్నారు. 6 ఆ శబ్దం వినిపించినప్పుడు జన సమూహం అక్కడ గుమికూడారు. ప్రతి ఒక్కరూ తన మాతృభాషలోనే శిష్యులు మాట్లాడడం విని కలవరపడ్డారు. 7 వారు ఆశ్చర్యంతో, విస్మయంతో నిండిపోయి ఒకరితో ఒకరు ఇలా అన్నారు:
“చూడండి! మాట్లాడుతున్న వీరంతా గలలీ ప్రాంతీయులే గదా. 8 మనలో ప్రతి ఒక్కరమూ మన మాతృభాషలో వింటున్నామే. ఇదేమిటి? 9 పార్తియ దేశస్థులు, మాదీయులు, ఏలాం దేశస్థులు, మెసొపొటేమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, 10 ఫ్రుగియ, పంఫులియ, ఈజిప్ట్ ప్రదేశాల నివాసులు, కురేనే దగ్గర ఉన్న లిబియ దేశవాసులు, రోమ్ నుంచి వచ్చి కాపురమున్నవారు, యూదులు, యూద మతంలో ప్రవేశించినవారు, 11 క్రేతు, అరేబియా దేశాలవారు – మనం మన సొంత భాషలలో వీరు దేవుని మహాక్రియలను గురించి మాట్లాడడం వింటూ ఉన్నాం!”
12 వారంతా ఆశ్చర్యపడ్డారు, విస్తుపోయారు, “దీని భావమేమిటి?” అని ఒకరినొకరు అడిగారు. 13 కొందరైతే “వీరు కొత్త ద్రాక్షమద్యంతో నిండివున్నారు” అంటూ వేళాకోళం చేశారు.
14 అప్పుడు పేతురు పదకొండుమందితో కూడా నిలబడి స్వరమెత్తి వారితో ఇలా చెప్పాడు: “యూదయ మనుషులారా! జెరుసలం నివాసులారా! మీరంతా ఈ సంగతి తెలుసుకోవాలి – నేను చెప్పేది వినండి. 15 మీరు అనుకొన్నట్టు వీరు మత్తుగా లేరు. ఇప్పుడు ప్రొద్దున తొమ్మిది గంటలయింది, అంతే.
16 “కానీ ఇది యోవేలుప్రవక్త చెప్పినది. 17 అదేమంటే ‘దేవుడు అంటున్నాడు, చివరి రోజుల్లో నా ఆత్మను సర్వ ప్రజలమీద కుమ్మరిస్తాను. మీ కొడుకులూ కూతుళ్ళూ దేవునిమూలంగా పలుకుతారు. మీ యువకులకు దర్శనాలు కనిపిస్తాయి. మీ ముసలివారు కలలు కంటారు. 18 ఆ రోజుల్లో నా సేవకులమీద, నా సేవికలమీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు దేవునిమూలంగా పలుకుతారు. 19 పైన ఆకాశంలో అద్భుతాలు చూపుతాను, కింద భూమిమీద సూచనలు – రక్తం, మంటలు, పొగతో నిండిన ఆవిరి కలిగిస్తాను. 20 ప్రభు మహా ప్రసిద్ధ దినం రాకముందు సూర్యమండలం చీకటిగానూ చంద్రగోళం రక్తంలాగా మారుతాయి. 21  అప్పుడు ఎవరైతే ప్రభువు పేర ప్రార్థన చేస్తారో వారికి పాపవిముక్తి కలుగుతుంది.’
22 “ఇస్రాయేల్ మనుషులారా! ఈ మాటలు వినండి. దేవుడు నజరేతువాడైన యేసుచేత అద్భుతాలు, వింతలు, సూచకమైన క్రియలు మీమధ్య చేయించడంద్వారా ఆయన దేవుని దృష్టిలో యోగ్యుడై ఉన్నట్టు మీకు వెల్లడి చేశాడు. ఇది మీకే తెలుసు. 23 దేవుని నిర్ణయమైన ఏర్పాటు ప్రకారం, భవిష్యత్తును ఎరిగిన జ్ఞానం ప్రకారం ఆయనను అప్పగించడం జరిగింది. మీరు అన్యాయమైన చేతులతో ఆయనను పట్టుకొని సిలువ వేయించి చంపించారు. 24  అయితే మరణం ఆయనను బంధించి ఉంచడం అసాధ్యం గనుక దేవుడు ఆయనను మరణ వేదనలనుంచి విడిపించి సజీవంగా లేపాడు. 25 ఆయనను గురించి దావీదు ఇలా అన్నాడు:
ప్రభువును నా ఎదుటే నేనెప్పుడు చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక ఏదీ నన్ను కదల్చదు. 26 అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది. నా నాలుక నా ఆనందాన్ని బయలుపరుస్తున్నది. నా శరీరం కూడా ఆశాభావంతో ఉంటుంది. 27 ఎందుకంటే, నీవు నా ఆత్మను మృత్యులోకంలో జారవిడువవు. నీ పవిత్రుణ్ణి కుళ్ళిపోనియ్యవు. 28 జీవ పథాలు నీవు నాకు చూపావు. నీ సన్నిధానంలో నీవు నన్ను ఆనందంతో నింపుతావు.
29  “అయ్యలారా, సోదరులారా! పూర్వీకుడైన దావీదును గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి పాలయ్యాడు. నేటివరకు అతని సమాధి మన మధ్య ఉంది. 30  అతడు ప్రవక్త. అతని సంతానంలో శరీర సంబంధంగా అతని సింహాసనం మీద కూర్చోవడానికి క్రీస్తును లేపుతానని దేవుడు శపథం చేసి తనతో ప్రమాణం చేసిన సంగతి అతనికి తెలుసు. 31 అతడు భవిష్యత్తులోకి చూస్తూ, క్రీస్తును మృత్యులోకంలో విడిచిపెట్టడమూ ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడమూ జరగలేదని చెప్పాడు. క్రీస్తు సజీవంగా లేచిన సంగతిని గురించి చెప్పాడన్న మాటే.
32 “ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమంతా సాక్షులం. 33  ఆయనను దేవుని కుడిప్రక్కకు హెచ్చించడం జరిగింది. పవిత్రాత్మను గురించిన వాగ్దానం తండ్రి చేత ఆయన పొంది ఇప్పుడు మీకు కనిపిస్తూ వినిపిస్తూ ఉన్న దీనిని కుమ్మరించాడు. 34 దావీదు ఆకాశాలలోకి ఎక్కిపోలేదు గాని అతడు ఇలా అన్నాడు: ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు: 35 నీ శత్రువులను నీ పాదాల క్రింద పీటగా నేను చేసేవరకూ నా కుడి ప్రక్కన కూర్చుని ఉండు.’
36 “అందుచేత ఇస్రాయేల్‌ప్రజలంతా ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయమేమంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే ప్రభువుగా, అభిషిక్తుడుగా దేవుడు నియమించాడు.”
37  ఇది వింటూ ఉంటే వారికి గుండెలలో బాకుతో పొడిచినట్లయింది. “పురుషులారా, సోదరులారా! మేమేం చేయాలి?” అని వారు పేతురునూ తక్కిన రాయబారులనూ అడిగారు.
38 పేతురు వారితో ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడండి! పాపక్షమాపణ గురించి మీలో ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు పేర బాప్తిసం పొందండి. అలా చేస్తే పవిత్రాత్మ అనే వరం మీరు పొందుతారు. 39 ఈ వాగ్దానం మీ కోసం, మీ సంతానం కోసం, దూరంగా ఉన్న వారందరి కోసం – అంటే, మన ప్రభువైన దేవుడు పిలిచేవారందరికోసం.”
40 అతడింకా అనేక మాటలతో గంబీరంగా సాక్ష్యమిచ్చి “వక్ర బుద్ధులైన ఈ తరం వారి నుంచి తప్పించుకోండి” అని వారిని హెచ్చరించాడు. 41 అప్పుడు అతడి సందేశాన్ని సంతోషంతో అంగీకరించినవారు బాప్తిసం పొందారు. ఆ రోజు సుమారు మూడు వేలమంది వారితో చేరారు.
42 వీరు క్రీస్తురాయబారుల ఉపదేశంలో, సహవాసంలో, రొట్టె విరవడంలో, ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నారు. 43 ప్రతి ఒక్కరికీ భయం ముంచుకు వచ్చింది. క్రీస్తురాయబారులు అనేక ఆశ్చర్యకరమైన క్రియలు, సూచకమైన అద్భుతాలు చేశారు. 44 విశ్వాసులంతా ఒకటిగా కలిసి తమకు కలిగినదంతా ఉమ్మడిగా ఉంచుకొన్నారు. 45 ఇదీ గాక, తమ ఆస్తిపాస్తులు అమ్మి ప్రతి ఒక్కరికీ అక్కరకొలది పంచి ఇస్తూ వచ్చారు. 46 ప్రతి రోజూ ఎడతెగకుండా వారు ఏకమనస్సుతో దేవాలయంలో ఉన్నారు. ఇంటింట రొట్టె విరుస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఆనందంతోనూ యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారు. 47 ప్రజలంతా వారిని అభిమానించారు. పాపవిముక్తి పొందుతున్నవారిని ప్రతి రోజూ ప్రభువు తన సంఘంతో చేరుస్తూ వచ్చాడు.