28
1 వారు తప్పించుకొన్న తరువాత అది మాల్త✽ ద్వీపం అని తెలిసింది. 2 ద్వీపవాసులు మాపట్ల చూపిన దయ అసాధారణమైనది. ఎలాగంటే, అప్పుడు వర్షం పడుతూ ఉంది, చలిగా ఉంది, గనుక వారు చలిమంట వేసి మమ్మల్నందరినీ చేర్చుకొన్నారు.3 అయితే పౌలు ఒక మోపు కట్టెలు ఏరి మంటలో వేస్తూ ఉంటే విషసర్పం ఒకటి మంట సెగకు బయటికి వచ్చి అతని చేయి పట్టుకొంది. 4 ✽ ఆ ప్రాణి అతని చేతినుంచి వ్రేలాడడం చూచి ద్వీపవాసులు “ఈ మనిషి తప్పక హంతకుడై ఉండాలి. సముద్రంనుంచి తప్పించుకున్నా ధర్మదేవత అతణ్ణి బతకనివ్వడం లేదు” అని ఒకరితో ఒకరు చెప్పుకొన్నారు.
5 ✽ అతడైతే ఆ విషప్రాణిని మంటలో విదిల్చివేసి ఏమీ హాని పొందలేదు. 6 ✽అతని ఒళ్ళుకు వాపు వస్తుంది, లేదా అతడు తటాలున పడి చస్తాడు అనుకొని వారు చూస్తూ ఉన్నారు. చాలా సేపు చూచిన తరువాత అతనికి ఏమీ హాని కలగలేదని గ్రహించి మనసు మార్చుకొని “ఇతడు ఒక దేవుడు” అని చెప్పుకొన్నారు.
7 ఆ ద్వీపంలో ముఖ్యుడు పొప్లి అనేవాడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్ములను చేర్చుకొని మూడు రోజులు స్నేహభావంతో అతిధి సత్కారాలు చేశాడు. 8 ✝పొప్లి తండ్రి జ్వరంతో, రక్తవిరేచనాలతో బాధపడుతూ మంచం పట్టి ఉన్నాడు. పౌలు లోపలికి అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన తరువాత అతనిమీద చేతులుంచి అతణ్ణి బాగు చేశాడు. 9 ఇలా జరిగిన తరువాత ద్వీపంలో ఉన్న తక్కిన రోగులు కూడా వచ్చి బాగయ్యారు. 10 వారు అనేక విధాలుగా మమ్ములను ఆదరించారు. మేము బయలుదేరి నప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఇచ్చారు.
11 మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచిపోయిన ఓడలో బయలుదేరాం. అది అలెగ్జాండ్రియ నగరానికి చెందినది. దాని మీద ‘అశ్వినీ’ చిహ్నం ఉంది. 12 సురకూస్✽ రేవుకు చేరి అక్కడ మూడు రోజులు గడిపాం. 13 అక్కడనుంచి చుట్టూ వెళ్ళి రేగియు✽కు వచ్చి ఒక్క రోజు తరువాత దక్షిణం గాలి వీచడంచేత మరునాడు పొతియొలీ✽ చేరుకొన్నాం. 14 అక్కడ కొందరు సోదరులను✽ మేము చూశాం. వారు తమదగ్గర ఏడు రోజులు గడపాలని మమ్ములను వేడుకొన్నారు. ఆ విధంగా రోమ్ నగరం వైపుకు వెళ్ళాం. 15 అక్కడనుంచి సోదరులు మా విషయం విని మమ్ములను ఎదుర్కోవడానికి వచ్చారు. ‘అప్పీయా ఫోరం’ వరకూ ‘త్రియొన్ తాబెర్నొన్’ వరకూ వచ్చారు. వారిని చూచి పౌలు దేవునికి కృతజ్ఞత చెప్పి ధైర్యం తెచ్చుకొన్నాడు.
16 ✽మేము రోమ్కు చేరినతరువాత శతాధిపతి కావలివారి పై అధిపతికి ఆ ఖైదీలను అప్పగించాడు. అయితే పౌలుకు తనను కావలి కాస్తున్న సైనికుడితోపాటు ప్రత్యేకంగా ఉండడానికి సెలవు దొరికింది.
17 ✽మూడు రోజులైన తరువాత పౌలు యూదుల నాయకులను తనదగ్గరకు పిలవనంపించాడు. వారు సమకూడినప్పుడు అతడు వారితో ఇలా అన్నాడు: “అయ్యలారా, సోదరులారా, నేను మన ప్రజలకు గానీ మన పూర్వీకుల ఆచారాలకూ గానీ వ్యతిరేకమైనది ఏదీ చేయక పోయినా జెరుసలంలోనుంచి రోమ్వారి చేతికి నన్ను ఖైదీగా అప్పగించడం జరిగింది. 18 వీరు నన్ను విచారణ చేసి నా విషయంలో మరణానికి తగిన కారణం ఏదీ లేదని నన్ను విడుదల చేయాలని ఉద్దేశించారు. 19 ✝కానీ యూదులు అడ్డం చెప్పినప్పుడు నేను చక్రవర్తి ఎదుట చెప్పుకొంటాననవలసి వచ్చింది. అంతేగాని, నేను స్వజనం మీద ఏదైనా నేరం మోపాలని మాత్రం కాదు. 20 ఈ కారణంచేతనే మిమ్ములను చూచి మాట్లాడాలని పిలిచాను. ఇస్రాయేల్ ప్రజల ఆశాభావాన్ని బట్టే✽ ఈ సంకెళ్ళ పాలయ్యాను.”
21 అందుకు వారు అతనితో “యూదయనుంచి మీ గురించి మాకు ఉత్తరాలు రాలేదు. ఇక్కడికి వచ్చిన సోదరులలో ఎవరూ మీ గురించి చెడు సంగతి ఏదీ మాకు తెలపలేదు, ఎవరూ చెప్పుకోలేదు. 22 అయినా ఈ మతశాఖ✽కు వ్యతిరేకంగా మాట్లాడడం అంతటా జరుగుతూ ఉందని మాత్రం మాకు తెలుసు గనుక మీ ఆలోచనలేవో మీవల్ల వినాలని మా కోరిక.”
23 అతనికి తేది నియమించి ఆ రోజున అతని బసలోకి అతని దగ్గరకు చాలామంది వచ్చారు. ఉదయంనుంచి సాయంకాలంవరకు అతడు దేవుని రాజ్యాన్ని✽ గురించి వివరిస్తూ సాక్ష్యాధారాలతో చెపుతూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలోనుంచీ ప్రవక్తల వ్రాతల ✽లోనుంచీ సంగతులెత్తి యేసును గురించి వారిని ఒప్పించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. 24 ✝అతడు చెప్పిన దానికి కొందరు ఒప్పించబడ్డారు, మరి కొందరు నమ్మడానికి నిరాకరించారు. 25 ✝వారి మధ్య ఏకీభావం కుదరక వారు వెళ్ళబోతూ ఉంటే పౌలు ఈ మాట వారితో అన్నాడు:
“యెషయాప్రవక్త ద్వారా పవిత్రాత్మ మన పూర్వీకులతో చెప్పిన మాట✽ తగినదే. 26 అదేమిటంటే, నీవు ఈ ప్రజలదగ్గరికి వెళ్ళి ఈవిధంగా చెప్పు, ‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు. ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు. 27 ఎందుకంటే, ఈ ప్రజల హృదయాలు మొద్దుబారిపోయాయి. వారికి ఏదీ చెవికెక్కదు. వారు తమ కండ్లు మూసుకొన్నారు. వారు కండ్లతో చూచి చెవులతో విని వారి హృదయాలతో అర్థం చేసుకొని నా వైపు తిరగకుండా, నేను వారిని బాగు చేయకుండా అలా చేశారు.
28 ✝“కాబట్టి, దేవుడు ప్రసాదించిన రక్షణ, పాపవిముక్తి యూదేతరుల దగ్గరకు పంపడం జరిగిందని మీరు తెలుసుకోండి. వారు వింటారు.” 29 అతడీ మాటలు చెప్పిన తరువాత తమ మధ్య తీవ్ర వివాదం జరిగిస్తూ యూదులు వెళ్ళిపోయారు.