20
1 ఆదివారం నాడు పెందలకడ ఇంకా చీకటిగా ఉండగానే మగ్‌దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసివేసి ఉండడం చూచింది. 2 గనుక ఆమె సీమోను పేతురు దగ్గరకూ యేసు ప్రేమించిన ఆ మరో శిష్యుని దగ్గరకూ పరుగెత్తి వెళ్ళింది. “వారు ప్రభువును సమాధిలో నుంచి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు” అంది.
3 అందుచేత పేతురు, ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు. 4 ఇద్దరూ కలిసి పరుగెత్తుతూ ఉన్నారు గాని ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి మొదట సమాధి చేరాడు. 5 అతడు వంగి సమాధిలో ఆ అవిసెనార గుడ్డలు ఉండడం చూశాడు గాని లోపలికి వెళ్ళలేదు. 6 అప్పుడు అతడి వెనకాలే సీమోను పేతురు వచ్చాడు. అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అవిసెనార బట్టలు చూశాడు. 7 యేసు తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు. అది ఆ అవిసెనార బట్టలతో గాక వేరే చోట చుట్టిపెట్టి ఉంది. 8 అప్పుడు, మొదట సమాధి దగ్గరికి చేరిన ఆ మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మాడు. 9 ఆయన చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అనే లేఖనం అప్పటికి వారు గ్రహించలేదు.
10 అప్పుడు ఆ శిష్యులు మళ్ళీ తమ ఇండ్లకు వెళ్ళారు. 11 మరియ సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ వంగి సమాధిలోకి చూచింది. 12 తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారు. యేసు మృతదేహం మునుపు ఉన్న స్థలంలో తలవైపు ఒకరూ కాళ్ళవైపు మరొకరూ కూర్చుని ఉన్నారు. 13 వారు ఆమెతో ఇలా అన్నారు: “అమ్మా! ఎందుకు ఏడుస్తూ ఉన్నావు?” ఆమె “వారు నా ప్రభువును తీసుకుపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అంది.
14  ఆమె అలా చెప్పి వెనక్కు తిరిగింది. యేసు అక్కడ నిలుచుండడం ఆమెకు కనిపించింది గాని యేసని ఆమె గుర్తుపట్టలేదు.
15 యేసు ఆమెతో “అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని వెదకుతున్నావు?” అన్నాడు. ఆయన తోటమాలి అనుకొని ఆమె ఆయనతో ఇలా అంది: “అయ్యా, ఆయనను మోసుకుపోయినది మీరే గనుక అయితే ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి. నేను ఆయనను తీసుకుపోతాను.”
16 అప్పుడు యేసు ఆమెతో “మరియా” అన్నాడు. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనతో “రబ్బోనీ!” అంది. ఆ మాటకు “గురువు” అని అర్థం.
17 యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నన్ను అంటిపెట్టుకొని ఉండబోకు. ఎందుకంటే నేను ఇంకా నా తండ్రిదగ్గరకు పైకి వెళ్ళలేదు. అయితే నా సోదరుల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు: నా తండ్రి, మీ తండ్రి దగ్గరకు, నా దేవుడు, మీ దేవుని దగ్గరకు పైకి వెళ్ళిపోతున్నాను.”
18 మగ్‌దలేనే మరియ వెళ్ళి తాను ప్రభువును చూశాననీ ఆయన తనతో ఆ విషయాలు చెప్పాడనీ శిష్యులకు తెలియజేసింది.
19 ఆ రోజు – ఆ ఆదివారం నాడు – సాయంకాల సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు. యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడియ వేసుకొని ఉన్నాయి. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. 20  అలా చెప్పి వారికి తన చేతులనూ ప్రక్కనూ చూపెట్టాడు. ప్రభువును చూచి శిష్యులు ఆనందించారు.
21 యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “మీకు శాంతి కలుగుతుంది గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుతున్నాను.” 22 ఆ విధంగా చెప్పి ఆయన వారిమీద ఊది “పవిత్రాత్మను స్వీకరించండి. 23  మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమాపణ పొందారు. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి” అన్నాడు.
24 యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా లేడు. (ఇతణ్ణి ‘దిదుమ’ అంటారు.) 25 కాబట్టి తక్కిన శిష్యులు “మేము ప్రభువును చూశాం” అని అతనితో చెప్పారు. అతడైతే వారితో “ఆయన చేతులలో మేకుల మచ్చ నేను చూడకపోతే, ఆ మేకుల మచ్చలో నా వ్రేలు పెట్టకపోతే, ఆయన ప్రక్కన నా చేయి పెట్టకపోతే నేను నమ్మను” అన్నాడు.
26 ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు. 27 అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
28 అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
29 యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు అన్నాడు.
30 యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు. 31 కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.