19
1 ✽అప్పుడు పిలాతు యేసును స్వాధీనపరచుకొని కొరడాలతో కొట్టించాడు. 2 ✝సైనికులు ముండ్లతో కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. 3 అప్పుడు “యూదుల రాజా, శుభం!” అన్నారు. ఆయనను చేతులతో కొట్టారు.4 మరోసారి పిలాతు బయటికి వెళ్ళి యూదులతో ఇలా అన్నాడు: “చూడండి. ఇతనిలో నాకు ఎలాంటి దోషమూ కనిపించలేదని మీరు తెలుసుకోవాలి, గనుక ఇతణ్ణి బయటికి మీ దగ్గరికి తెప్పిస్తున్నాను.”
5 ✽ముండ్ల కిరీటం, ఊదారంగు వస్త్రం ధరించినవాడై యేసు బయటికి వచ్చినప్పుడు పిలాతు వారితో అన్నాడు “ఇడుగో ఈ మనిషి!”
6 ✽ఆయనను చూడగానే ప్రధాన యాజులూ యూదుల అధికారులూ “సిలువ వెయ్యండి! సిలువ వెయ్యండి!” అని అరిచారు.
పిలాతు “మీరే అతణ్ణి తీసుకుపోయి సిలువ వేయండి. నాకు అతనిలో ఏ దోషమూ కనబడలేదు” అని వారితో చెప్పాడు.
7 ✽అందుకు యూదులు “మాకో చట్టం ఉంది. మా చట్టం ప్రకారం అతడు చావాలి. ఎందుకంటే, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకొన్నాడు” అని జవాబిచ్చారు.
8 ✽ఆ మాట విని పిలాతు మరి ఎక్కువగా భయపడ్డాడు. 9 అధిపతి భవనంలోకి తిరిగి వెళ్ళి “నీవు ఎక్కడనుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. యేసు అతడికి ఏ జవాబూ ఇవ్వలేదు. 10 ✽పిలాతు ఆయనతో అన్నాడు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికి, లేదా సిలువ వేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?”
11 ✽అందుకు యేసు “ఆ అధికారం పైనుంచి నీకు ఇవ్వబడితేనే తప్ప నామీద నీకు అధికారమేమీ ఉండదు. కనుక నన్ను నీకు అప్పగించినవానికే ఎక్కువ పాపం ఉంది” అని జవాబిచ్చాడు.
12 ✽అప్పటినుంచి ఆయనను విడిపించడానికి పిలాతు ప్రయత్నం చేశాడు, గానీ యూదులు ఇలా అరిచారు: “ఒకవేళ మీరు ఈ మనిషిని విడుదల చేస్తే మీరు సీజరుకు స్నేహితులు కారన్నమాటే! తాను రాజునని చెప్పుకొనేవాడెవడైనా చక్రవర్తికి వ్యతిరేకంగా మాట్లాడేవాడే!”
13 ఈ మాటలు విని పిలాతు యేసును బయటికి తెప్పించి న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఆ స్థలానికి ‘రాళ్లు పరచిన స్థలం’ అని పేరు. హీబ్రూ భాషలో గబ్బతా అంటారు. 14 ఆ రోజు పస్కా పండుగను సిద్ధం చేసే రోజు. ఉదయం సుమారు ఆరు గంటలయింది.
“ఇడుగో మీ రాజు!” అని పిలాతు యూదులతో చెప్పాడు.
15 అందుకు వారు “ఇతణ్ణి చంపండి! చంపండి! అతణ్ణి సిలువ వేయండి!” అని అరిచాడు.
“నేను మీ రాజును సిలువ వేయాలా?” అని పిలాతు వారిని అడిగాడు.
అందుకు ప్రధాన యాజులు “సీజరు తప్ప మాకు వేరే రాజు లేడు✽” అని జవాబిచ్చారు.
16 ✽అప్పుడు సిలువ వేయడానికి ఇతడు ఆయనను వారికి అప్పగించాడు. అందుచేత వారు యేసును పట్టుకొని బయటికి తీసుకుపోయారు. 17 ✽ తన సిలువను తానే మోసుకొంటూ ‘కపాలస్థలం’ అనే చోటికి ఆయన వెళ్ళాడు. హీబ్రూ భాషలో దానిని గొల్‌గొతా అంటారు. 18 అక్కడ వారు ఆయనను సిలువ వేశారు. యేసును మధ్యలో ఉంచి ఆయనకు ఇరుప్రక్కల ఇంకా ఇద్దరిని సిలువ వేశారు. 19 పిలాతు ఈ వ్రాత వ్రాయించి సిలువకు పైగా పెట్టించాడు: “నజరేతువాడైన యేసు, యూదుల రాజు” 20 అది హీబ్రూ, గ్రీకు, రోమన్ భాషలలో వ్రాసి ఉంది. యేసును సిలువ వేసిన స్థలం నగరానికి దగ్గరగా ఉంది, గనుక యూదులు అనేకులు ఆ పై వ్రాతను చదివారు.
21 అప్పుడు యూదుల ప్రధాన యాజులు పిలాతుతో ఇలా అన్నారు: “యూదుల రాజు అని వ్రాయకండి. నేను యూదుల రాజునని అతడు అన్నాడు అని వ్రాయండి.”
22 పిలాతు “నేను రాసినదేదో రాశాను” అని బదులు చెప్పాడు.
23 యేసును సిలువ వేసిన తరువాత సైనికులు ఆయన బట్టలు తీసుకొన్నారు. ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు. ఆయన అంగీ కూడా తీసుకొన్నారు గాని అది కుట్టు లేకుండా పైభాగంనుంచి పూర్తిగా నేసినది కావడంచేత 24 వారు “మనం దానిని చింపెయ్యకూడదు. అది ఎవడికి రావాలో దానికోసం చీట్లు వేద్దాం”✽ అని చెప్పుకొన్నారు. “నా వస్త్రాలను తమలో తాము పంచుకొని నా అంగీకోసం చీట్లు వేస్తున్నారు” అనే లేఖనం నెరవేర్పు ఇలా జరిగింది. సైనికులు అలా చేసినది అందుకే.
25 ✽యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్‌దలేనే✽ మరియ ఆయన సిలువ దగ్గర నిలుచున్నారు. 26 యేసు తన తల్లి, తాను ప్రేమించిన శిష్యుడు✽ దగ్గర నిలుచుండడం చూచి “అమ్మా! అడుగో, నీ కొడుకు” అని తన తల్లితో అన్నాడు. 27 అప్పుడు ఆ శిష్యుడితో “అదిగో, నీ తల్లి” అన్నాడు. ఆ కాలంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొన్నాడు.
28 ✽ ఆ తరువాత, సమస్తమూ అప్పటికే అయిపోయిందని తెలిసి లేఖనం నెరవేరడానికి యేసు “నాకు దప్పి అవుతూ ఉంది” అన్నాడు. 29 పులిసిపోయిన ద్రాక్షరసంతో నిండిన ఒక పాత్ర అక్కడ ఉంది. కాబట్టి వారు ఒక స్పంజి నిండా పులిసిపోయిన ద్రాక్షరసాన్ని పట్టించారు. దానిని హిస్సోపు మొక్క కాడకు తగిలించి ఆయన నోటికి అందజేశారు.
30 ✽ఆ పులిసిపోయిన ద్రాక్షరసం తీసుకొన్న తరువాత యేసు “సమాప్తమయింది” అన్నాడు. అప్పుడు తల వంచి ప్రాణం విడిచాడు.
31 ✽ ఆ రోజు పస్కాను సిద్ధం చేసే రోజు. మరుసటి రోజు యూదులకు మహా విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం మృత దేహాలు సిలువమీద ఉండకూడదనీ వారి కాళ్ళు విరగ్గొట్టించి వారిని సిలువనుంచి తీయించాలనీ✽ యూదులు పిలాతును అడిగారు. 32 కనుక సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడ్డ మొదటివాని కాళ్ళు, రెండో వాని కాళ్ళు విరగ్గొట్టారు. 33 ✽గానీ యేసు దగ్గరకు వచ్చి, అప్పటికే ఆయన చనిపోవడం చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు. 34 ✽అయితే సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచాడు. వెంటనే రక్తమూ నీళ్ళూ కారాయి. 35 ✽అది చూచినవాడు సాక్ష్యం చెప్పాడు. అతని సాక్ష్యం నిజం. మీరు కూడా నమ్మేలా అతడు సత్యం చెపుతున్నాడని అతనికి తెలుసు.
36 ✝ఈ లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి: “ఆయన ఎముకలలో ఒకటైనా విరగగొట్టబడదు” 37 ✝మరో లేఖనం ఇలా అంటుంది.: “తాము పొడిచినవానివైపు వారు చూస్తారు.”
38 ✽ ఆ తరువాత అరిమతయి గ్రామం వాడైన యోసేపు యేసు మృత దేహాన్ని తీసుకుపోవడానికి పిలాతును అడిగాడు. పిలాతు అనుమతించాడు. యోసేపు యేసుకు శిష్యుడు గాని యూదులకు భయపడి రహస్యంగా శిష్యుడుగా ఉన్నాడు. అతడు వచ్చి యేసు మృత దేహాన్ని తీసుకువెళ్ళాడు. 39 నీకొదేము✽ కూడా వచ్చాడు. ఈ నీకొదేము అంతకు ముందు రాత్రివేళ యేసుదగ్గరకు వచ్చినవాడు. అతడు బోళంతో కలిపిన అగరు సుమారు నలభై అయిదు కిలోగ్రాములు తెచ్చాడు. 40 వారు యేసు దేహాన్ని తీసుకొని యూదుల భూస్థాపన ఆచారం ప్రకారం ఆ సుగంధ ద్రవ్యాలు పెట్టి అవిసెనార గుడ్డలు చుట్టారు. 41 ఆయనను సిలువ వేసిన స్థలంలో తోట ఉంది. తోటలో కొత్త సమాధి ఉంది. దానిలో అదివరకు ఎవరినీ ఉంచడం జరుగలేదు. 42 ఆ సమాధి దగ్గరగా ఉండడంచేత, ఆ రోజు యూదులకు పస్కాను తయారు చేసే రోజు గనుక వారు ఆయనను దానిలో పెట్టారు.