18
1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కూడా కెద్రోను లోయ దాటివెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉంది. ఆయన, ఆయన శిష్యులు దానిలోకి వెళ్ళారు. 2 యేసు ఆయన శిష్యులను తరచుగా అక్కడ కలుసుకొనేవాడు గనుక ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చే యూదాకు ఆ స్థలం తెలుసు.
3 అప్పుడు యూదా, సైనికుల గుంపునూ ప్రధాన యాజులూ పరిసయ్యులూ పంపిన దేవాలయ ఉద్యోగులనూ కొందరిని అక్కడికి తీసుకువచ్చాడు. వారికి దివిటీలతో, దీపాలతో, ఆయుధాలు ఉన్నాయి. 4 తనమీదికి జరగబోయేది అంతా తెలిసి యేసు ముందుకు వెళ్ళి “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని వారితో అన్నాడు.
5 “నజరేతువాడైన యేసును” అని వారు ఆయనకు జవాబిచ్చారు.
యేసు వారితో “నేనే ఆయనను అన్నాడు.
ఆయనను పట్టి ఇచ్చే యూదా వారి మధ్య నిలబడి ఉన్నాడు. 6 యేసు “నేనే ఆయనను” అనగానే వారు వెనక్కు తగ్గి నేలమీద పడిపోయారు.
7 “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని ఆయన వారిని మళ్ళీ అడిగాడు.
వారు “నజరేతువాడైన యేసును” అన్నారు.
8 “నేనే ఆయనని మీకు చెప్పాను గదా. నన్నే గనుక మీరు వెదకుతూ ఉంటే వీరిని వెళ్ళిపోనియ్యండి” అని యేసు బదులు చెప్పాడు. 9  నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరినీ పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరేందుకు అలా అన్నాడు.
10 సీమోను పేతురు దగ్గర ఖడ్గం ఉంది. దానిని ఒరనుంచి దూసి అతడు ప్రముఖయాజి సేవకుణ్ణి కొట్టి అతడి కుడిచెవి తెగనరికాడు (ఆ సేవకుడి పేరు మల్కు).
11 “ఖడ్గం ఒరలో పెట్టు. తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగనా?” అని యేసు పేతురుతో చెప్పాడు.
12 అప్పుడు ఆ సైనికుల గుంపు, వారి అధిపతి, యూదుల ఉద్యోగులు ఆయనను పట్టుకొని బంధించారు. 13 మొట్టమొదట కయపకు మామ అయిన అన్నా అనేవాడి దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళారు. ఆ సంవత్సరం కయప ప్రముఖ యాజిగా ఉన్నాడు. 14 ప్రజలకోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకు సలహా చెప్పినది ఈ కయపే.
15 సీమోను పేతురు, మరో శిష్యుడు యేసువెంట వెళ్ళారు. ఆ శిష్యుడు ప్రముఖ యాజికి తెలుసు, గనుక ప్రముఖయాజి ముంగిటిలోకి యేసు వెంట వెళ్ళాడు. 16 పేతురైతే బయట ద్వారం దగ్గర నిలిచాడు. అందుచేత ప్రముఖ యాజికి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారానికి కాపలా ఉన్న ఆమెతో మాట్లాడి పేతురును లోపలికి తెచ్చాడు. 17 ద్వారం కావలి కాస్తున్న ఆ పనిపిల్ల పేతురుతో “మీరు కూడా ఆ మనిషి శిష్యులలో ఒకరు కదూ!” అంది.
అతడు “కాను” అన్నాడు.
18 దేవాలయం ఉద్యోగులూ పని మనుషులూ అక్కడ నిలబడి ఉన్నారు. చలిగా ఉంది గనుక మంట వేసుకొని చలికాచుకొంటున్నారు. పేతురు వారితో నిలుచుండి చలికాచుకొంటున్నాడు.
19 ఇంతలో, ప్రముఖయాజి ఆయన ఉపదేశాన్ని గురించీ శిష్యులను గురించీ యేసును ప్రశ్నించాడు.
20 యేసు అతడికిలా జవాబిచ్చాడు: “నేను బాహాటంగా లోకానికి చెప్పాను. యూదులు ఎప్పుడూ సమకూడే సమాజ కేంద్రాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా నేనేమీ చెప్పలేదు. 21 మీరు నన్ను ప్రశ్నించడమెందుకు? నా బోధ విన్నవారిని నేను వారికి చెప్పిన దాని గురించి అడుగు. నేను చెప్పినది వారికి తెలుసు.
22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, దగ్గర నిలుచున్న అధికారి ఒకడు ఆయనను అరచేతితో చెంపదెబ్బ కొట్టి “ప్రముఖ యాజికి ఇలా జవాబిస్తున్నావేమిటి!” అన్నాడు.
23 యేసు జవాబిస్తూ “నేను చెప్పినదానిలో దోషం ఉంటే ఆ దోషం ఏదో సాక్ష్యం చెప్పు. అది సరిగా ఉంటే నన్ను కొట్టడం ఎందుకు?” అన్నాడు.
24 అప్పుడు అన్నా ఆయనను కట్లతోనే ప్రముఖయాజి అయిన కయప దగ్గరకు పంపాడు.
25 సీమోను పేతురు ఇంకా నిలుచుండి చలి కాచుకొంటున్నాడు. అక్కడున్నవారు అతనితో “మీరు కూడా ఆయన శిష్యులలో ఒకరు కారా?” అన్నారు.
అతడు ఒప్పుకోలేదు, “నేను కాదు” అన్నాడు.
26 పేతురు ఎవడి చెవి నరికివేశాడో అతడి చుట్టాల్లో ఒకడు ప్రముఖయాజికి సేవకుడుగా ఉన్నాడు. అతడు పేతురుతో “మీరు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27 మరోసారి పేతురు కాదన్నాడు. తక్షణమే కోడి కూసింది.
28 యూదులు యేసును కయప దగ్గరనుంచి రోమన్ అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు. అప్పటికి ఉదయం అయింది. వారు మాత్రం అపవిత్రం కాకుండేలా భవనంలో ప్రవేశించలేదు. ఎందుకంటే, పస్కాను తినాలని ఉన్నారు. 29 అందుచేత రోమన్ అధిపతి పిలాతు బయటికి వారిదగ్గరకు వచ్చి “ఈ మనిషిపై మీరు మోపే నేరం ఏమిటి?” అని అడిగాడు.
30 “ఇతడు నేరస్థుడు కాకపోతే ఇతణ్ణి మీకు అప్పగించేవారం కాము” అని వారు అతనికి బదులు చెప్పారు.
31 పిలాతు వారితో “మీరే అతణ్ణి తీసుకువెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి” అన్నాడు.
అందుకు యూదులు అతనితో “ఎవరికీ మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు” అన్నారు. 32 తాను ఎలాంటి మరణానికి గురి అవుతాడో దాని విషయం యేసు సూచించి చెప్పిన మాట నెరవేరేలా అది జరిగింది.
33 అప్పుడు పిలాతు అధిపతి భవనంలోకి మళ్ళీ వెళ్ళి యేసును పిలిపించి ఆయనను ఇలా అడిగాడు: “యూదులకు రాజువు నీవేనా?”
34 “మీ అంతట మీరే ఆ మాట అంటున్నారా? లేదా, ఇతరులు నా విషయం మీతో చెప్పారా?” అని యేసు అతనికి జవాబిచ్చాడు.
35 “నేను యూదుడినా ఏం! నాకు నిన్ను అప్పగించినది నీ సొంత ప్రజలే, ప్రధాన యాజులే గదా. నీవు చేసినది ఏమిటి?” అని పిలాతు బదులు చెప్పాడు.
36 యేసు ఇలా జవాబిచ్చాడు: “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే గనుక అయితే నన్ను యూదులకు పట్టి ఇవ్వడం జరగకుండా నా సేవకులు పోరాడేవారే. కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడిది కాదు.”
37 అందుకు పిలాతు “అయితే నీవు రాజువా?” అని ఆయనను అడిగాడు.
యేసు జవాబిస్తూ “నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే. సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను, ఈ కారణం చేత ఈ లోకానికి వచ్చాను. నేను చెప్పేదానిని సత్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నా స్వరం వింటారు” అన్నాడు.
38 అందుకు పిలాతు “సత్యం అంటే ఏమిటి?” అని ఆయనతో అన్నాడు. అలా అని బయటికి యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి “అతనిలో ఎలాంటి దోషమూ నాకు కనిపించలేదు. 39 అయితే పస్కా పండుగలో నేను ఎవడైనా ఒక ఖైదీని మీకు విడుదల చేసే వాడుక మీకు ఉంది గదా. నేను యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకిష్టమా?”
40 అందుకు వారు “ఈ మనిషిని కాదు, బరబ్బను విడుదల చేయండి” అని మళ్ళీ అరిచారు. బరబ్బ బందిపోటు దొంగ.