17
1 ఆ మాటలు చెప్పి యేసు ఆకాశం వైపు తలెత్తి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ, నా సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ చేకూర్చేలా నీ కుమారునికి మహిమ చేకూర్చు. 2 నీ కుమారునికి శరీరమున్నవారందరిమీద అధికారం ఇచ్చావు. నీవు ఆయనకు అనుగ్రహించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా ఆ ప్రకారం ఇచ్చావు. 3 ఏకైక సత్య దేవుడవైన నిన్నూ నీవు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వత జీవం. 4 చేయడానికి నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేసి భూమిమీద నీకు మహిమ కలిగించాను. 5 తండ్రీ, ప్రపంచం ఉండకముందే నీతో నాకున్న మహిమ ఇప్పుడు నీ సముఖంలో నాకు మళ్ళీ కలిగించు.
6 “లోకంనుంచి నీవు నాకిచ్చినవారికి నీ పేరును వెల్లడి చేశాను. పూర్వం వారు నీవారు. వారిని నాకు ఇచ్చావు. వారు నీ వాక్కును పాటించారు. 7 నీవు నాకిచ్చిన మాటలు వారికిచ్చాను. వారు వాటిని అంగీకరించారు, నేను నీ దగ్గరనుంచి వచ్చానని వారు రూఢిగా తెలుసుకొన్నారు, నీవు నన్ను పంపావని నమ్ముకొన్నారు, 8 కాబట్టి నీవు నాకిచ్చినవన్నీ నీనుంచి వచ్చినవని ఇప్పుడు వారికి తెలుసు.
9 “వీరికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. లోకం కోసం నేను ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు ఇచ్చినవారు నీవారే గనుక వారికోసమే ప్రార్థన చేస్తూ ఉన్నాను. 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. వీరిమూలంగా నాకు మహిమ కలిగింది. 11 ఇకమీదట నేను లోకంలో ఉండను గానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరకు వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, మనం ఒక్కటిగా ఉన్నట్టే నీవు నాకిచ్చినవారు ఒక్కటిగా ఉండేలా నీ పేర వారిని కాపాడు. 12 నేను లోకంలో వారితో ఉన్నప్పుడు నీ పేర వారిని కాపాడాను. నీవు నాకిచ్చినవారిని నేను కాపాడాను. వారిలో ఎవరూ నశించలేదు. అయితే లేఖనం నెరవేరేందుకు నాశనానికి తగినవాడే నశించాడు.
13 “ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను. వీరిలో నా ఆనందం పూర్తిగా ఉండాలని ఈ మాటలు లోకంలో చెపుతున్నాను. 14  నేను నీ వాక్కు వారికిచ్చాను. నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందినవారు కారు. అందువల్ల వారంటే లోకానికి ద్వేషం. 15 లోకంనుంచి వీరిని తీసుకుపొమ్మని నేను నిన్ను అడగడం లేదు గానీ దుర్మార్గుడినుంచి వారిని కాపాడాలని అడుగుతున్నాను. 16 నేను లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు లోకానికి చెందిన వారు కారు. 17 నీ సత్యంచేత వారిని ప్రత్యేకించు. నీ వాక్కే సత్యం. 18 నీవు నన్ను లోకంలోకి పంపినట్టు నేను వారిని లోకంలోకి పంపాను. 19 వారు కూడా సత్యంలో ప్రత్యేకమైనవారు కావాలని నన్ను నేను ప్రత్యేకించు కొంటున్నాను.
20 “నేను ప్రార్థన చేస్తున్నది వీరికోసం మాత్రమే కాదు గాని వీరి మాటల మూలంగా నామీద నమ్మకం ఉంచబోయేవారి కోసం కూడా. 21 వారందరూ ఒక్కటిగా ఉండాలని నా ప్రార్థన. తండ్రీ, నీవు నన్ను పంపావని లోకం నమ్మేలా నేను నీలో, నీవు నాలో ఉన్న విధంగా వారు మాలో ఒక్కటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. 22 మనము ఒక్కటిగా ఉన్నట్టే వారు ఒక్కటిగా ఉండేందుకు నీవు నాకిచ్చిన మహిమ వారికిచ్చాను. 23 నీవు నన్ను పంపావనీ నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించావనీ లోకం తెలుసుకోవాలి గనుక వారిలో నేను, నాలో నీవు ఉండడంవల్ల వారు సంపూర్ణంగా ఒక్కటి కావాలని ఆ మహిమ వారికిచ్చాను. 24 తండ్రీ, నీవు నాకు ఇచ్చినవారు నీవు నాకిచ్చిన మహిమను చూచేలా నేను ఎక్కడ ఉంటానో వారు నాతో అక్కడే ఉండాలని నా కోరిక. ఎందుకంటే, జగత్తు పునాదికి మునుపే నీవు నన్ను ప్రేమించావు.
25 “న్యాయవంతుడవైన తండ్రీ, లోకం నిన్ను తెలుసు కోలేదు, గానీ నీవు నాకు తెలుసు. నీవు నన్ను పంపావని వీరు తెలుసుకొన్నారు. 26 నామీద నీకు ఉన్న ప్రేమ వారిలో ఉండాలనీ నేను కూడా వారిలో ఉండాలనీ నీ పేరును వారికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”